ఇదేం ట్విస్టు మాస్ రాజా
రవితేజను జస్ట్ ఆ పేరుతో ఎవ్వరూ పిలవరు. పేరు ముందు ఆటోమేటిగ్గా మాస్ రాజా, మాస్ మహారాజా అనే ట్యాగ్స్ వచ్చేస్తాయి.;
రవితేజను జస్ట్ ఆ పేరుతో ఎవ్వరూ పిలవరు. పేరు ముందు ఆటోమేటిగ్గా మాస్ రాజా, మాస్ మహారాజా అనే ట్యాగ్స్ వచ్చేస్తాయి. మాస్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. వాటితోనే పెద్ద స్టార్‌గా ఎదిగారు. కానీ ఈ మధ్య మాస్ సినిమాలతోనే గట్టి ఎదురు దెబ్బలు తిన్న నేపథ్యంలో ఆయన రూటు మార్చేశారు. తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన సినిమాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన్నుంచి సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది. ఇందులో ఎక్కడా హీరో ఎలివేషన్లు లేవు. మాస్ సీన్లు, యాక్షన్ ఘట్టాలు లేవు. ఈ సినిమా కోసం ఆయన ‘మాస్ మహారాజా’ అనే ట్యాగ్ కూడా పక్కన పెట్టారు. ఐతే రవితేజ రూటు మార్చింది ఈ ఒక్క సినిమాకే, తర్వాత మళ్లీ మామూలే అని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఇప్పుడు ఇంకా పెద్ద షాకే ఇచ్చారు.
శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఈ రోజు రిలీజయ్యాయి. అందులో అయ్యప్ప మాల వేసుకున్న స్వామిగా కనిపించి అందరినీ విస్మయానికి గురి చేశాడు రవితేజ. ఈ సినిమాకు ‘ఇరుముడి’ అనే టైటిల్ కూడా ఖాయం చేశారు. రవితేజ ఇమేజ్ ప్రకారం చూస్తే ఆయన ఇలాంటి సినిమా చేయడం ఎవ్వరూ ఊహించలేని విషయం. గతంలోనూ క్లాస్ సినిమాలు చేశాడు కానీ.. ఇలాంటి భక్తిరస చిత్రం చేయడం మాత్రం అనూహ్యం.
శివ నిర్వాణ శైలి ప్రకారం చూసుకున్నా కూడా అతను ఇలాంటి చిత్రం.. అది కూడా రవితేజతో చేయడం అనూహ్యమే. ఐతే ఇందులో కేవలం అయ్యప్పస్వామి మాలధారణ గురించి.. భక్తి గురించి మాత్రమే చెబుతారా అన్నది ప్రశ్నార్థకం. అలాంటి భక్తి సినిమానే తీయాలంటే రవితేజ అవసరం లేదు. కానీ ఆయనతో ఈ సినిమా చేస్తున్నారంటే ఇంకేదో విశేషం ఈ సినిమాలో ఉండే ఉంటుందని ఆశించవచ్చు. మొత్తానికి ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌తో మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారబోతోందన్నది మాత్రం స్పష్టం.