విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌కి మెగాస్టార్ భావోద్వేగ నివాళి
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని దిగంతాలకు చాటిన యుగపురుషుడు, మహానటుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని సినీ లోకం ఆయనను ఘనంగా స్మరించుకుంటోంది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని దిగంతాలకు చాటిన యుగపురుషుడు, మహానటుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని సినీ లోకం ఆయనను ఘనంగా స్మరించుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక సామాజిక మాధ్యమ వేదిక ద్వారా ఒక భావోద్వేగభరితమైన సందేశాన్ని షేర్ చేసారు. తరాలు ఎన్ని మారినా.. కాలం ఎంత ముందుకు సాగినా ఆ తారక రాముని ప్రభావం.. ఆయన సృష్టించిన చరిత్ర తెలుగు జాతి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోవని చిరంజీవి ఈ సందర్భంగా కొనియాడారు.
వెండితెరపై పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలకు ప్రాణం పోసి సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా ఎన్టీఆర్ సాధించిన అఛీవ్‌మెంట్స్ సాటిలేనివని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. కేవలం సినీ రంగంలోనే కాకుండా.. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచారని అభినందించారు. కోట్లాది మంది ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న నందమూరి తారక రామారావు గారు ఎప్పటికీ చిరస్మరణీయులుగానే నిలిచిపోతారని తన సందేశంలో స్పష్టం చేశారు.
ఈ నివాళిలో చిరంజీవి తనకు లభించిన ఒక అరుదైన గౌరవాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల తనకు ప్రతిష్టాత్మక `ఎన్టీఆర్ జాతీయ పురస్కారం` లభించడం అత్యంత ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని అందుకోవడం అనేది ఎన్టీఆర్ పై తనకు ఉన్న అపారమైన గౌరవానికి, అభిమానానికి లభించిన మరింత విలువైన గుర్తింపుగా తన జీవితంలో నిలిచిపోతుందని ఎమోషనల్ అయ్యారు.
ఎన్టీఆర్ జయంతి వేళ కేవలం మెగాస్టార్ మాత్రమే కాకుండా టాలీవుడ్‌కు చెందిన పలువురు ఇతర స్టార్ లు, నందమూరి వారసులు కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. నట సింహం బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులంతా ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించి నివాళులు అర్పించడం గురించి తెలిసిందే. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ వంటి స్టార్ హీరోలు తమ తాతగారు తెలుగు ఇండస్ట్రీకి చేసిన సేవలను.. ఆయన అందించిన స్పూర్తిని తలుచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక పోస్ట్‌లు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ దర్శకులు, నిర్మాతలు.. సమకాలీన యువ హీరోలు సైతం సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ రేర్ ఫోటోగ్రాఫ్స్, వీడియోలను షేర్ చేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. వెండితెరను ఏలిన మహారాజుగా.. రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన నాయకుడిగా ఎన్టీఆర్ వారసత్వం నేడు సినీపరిశ్రమలో అజేయంగా కొనసాగుతోంది. నవరసనటసార్వభౌమ ఎన్టీఆర్ పై మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన ఈ భావోద్వేగ సందేశం ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటూ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
ఎన్టీఆర్ జయంతి వేళ.. ప్రధాని మోదీ ఘన నివాళి
నవరసనటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులర్పించారు. ప్రజా సంక్షేమం, పేదలు.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ చూపిన నిబద్ధత.. అందించిన పరిపాలన ఎప్పటికీ చిరస్మరణీయమని ప్రధాని కొనియాడారు. సినిమా రంగంలో ఆయన పోషించిన అద్భుతమైన పాత్రలు.. అందించిన కాంట్రిబ్యూషన్స్ నేటికీ తరాలను అలరిస్తూనే ఉన్నాయని... ఆయన జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాలు, విజన్‌ను నిజం చేసేలా నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.