మెగా 158 .. రాసి పెట్టుకోండి అంటూ ఛాలెంజ్
దర్శకుడు బాబీ ఇచ్చిన లీకులు ఇప్పుడు సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లోనూ అపారమైన అంచనాలను పెంచేశాయి.
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేని పురస్కరించుకుని అఖిల భారత మెగాభిమానుల సమావేశంలో దర్శకుడు బాబి తన తదుపరి చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈసారి మెగాస్టార్ ని ఎలా ఆవిష్కరిస్తున్నారో కీలకమైన లీకులిచ్చారు. దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం (#Mega158) గురించిన కీలకమైన అంశాలను - కథా నేపథ్యాన్ని రివీల్ చేసారు.
దర్శకుడు బాబీ ఇచ్చిన లీకులు ఇప్పుడు సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లోనూ అపారమైన అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా పూజ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు అమరావతి వెళ్లినప్పుడు..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో ఆత్మీయంగా స్పందించి.. తన బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రత్యేకంగా రెండు గంటల సమయాన్ని కేటాయించారు. ఒక తమ్ముడిగానే కాకుండా చిరంజీవి గారికి అతిపెద్ద అభిమానిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, చెన్నైలో 14 ఏళ్ల వయసున్నప్పటి నుండి తన అన్నయ్య కోసం థియేటర్ల వద్ద గుమిగూడిన జనాలు.. చిరిగిపోయిన చొక్కాలు... తెగిపోయిన చెప్పులు దగ్గరుండి చూశానని గుర్తుచేసుకున్నారు. అలాంటి మెగాస్టార్‌ను మళ్లీ అత్యంత బలమైన కథ, ఎమోషన్‌తో థియేటర్లలో చూపించాలని బాబీకి స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
మెగాస్టార్ పై పవర్ స్టార్ చూపించిన అపారమైన అభిమానం ఈ ప్రాజెక్ట్‌కు ఎనర్జీగా మారింది. ``చిరంజీవి అభిమానుల్లో మొదటి స్థానంలో ఉండేది నేనే.. అందుకే సినిమా ఫస్ట్ కాపీని ముందుగా నాకే చూపించు.. ఆడియో ఫంక్షన్‌కు పిలవకపోయినా వచ్చేలా సినిమా తీయ్ బాబీ`` అని పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేసినట్లు బాబీ తెలిపారు. కళ్యాణ్ గారికి ఇచ్చిన ఆ మాటనే ప్రమాణంగా తీసుకుని #Mega158 రూపుదిద్దుకుంటోందని.. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ అతిత్వరలోనే రాబోతోందని.. ఈ సినిమా ప్రభావం ఎలా ఉంటుందో కచ్చితంగా ``రాసి పెట్టుకోండి`` అంటూ బాబీ ధీమాగా ఛాలెంజ్ విసిరారు.
మెగాస్టార్‌పై వచ్చే విమర్శలకు, నెగిటివ్ కామెంట్లకు తన సృజనాత్మకతతోనే బాబీ సమాధానం చెబుతానని అన్నారు. గతంలో విమర్శలు వచ్చిన ప్రతిసారీ తన ప్రేమనంతటినీ నింపి తీసిన `వాల్తేరు వీరయ్య` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 250 కోట్ల భారీ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. ``వందల మంది తిడుతుంటే కోట్ల మంది పొగుడుతుంటారు`` అనే అనిరుధ్ పాటలోని వాక్యాన్ని గుర్తు చేస్తూ.. ఇటీవల వచ్చిన ప్రతికూల కామెంట్లకు కూడా ఈ 158వ సినిమాతోనే తిరుగులేని సమాధానం చెప్తున్నామని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో మెగాస్టార్‌లో ఎప్పుడూ చూడని ఒక ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాస్ యాంగిల్ .. హృదయాలను హత్తుకునే ఎమోషనల్ యాంగిల్ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయని వెల్లడించారు.
రుద్రవీణ- స్వయంకృషి- ఆపద్బాంధవుడు + కమర్షియల్ యాంగిల్
బాబి యథాలాపంగా స్పీచ్ ఇస్తూ మెగా 158 కథ ఎలా ఉంటుందో లీకులిచ్చారు. ఇందులో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే చిరంజీవి క్లాసిక్ చిత్రాలైన రుద్రవీణ-స్వయంకృషి-ఆపద్బాంధవుడు చిత్రాల ఆత్మను ఈ సినిమా కథలోకి తీసుకొచ్చానని తెలిపారు. ఈ సినిమాల్లో చిరు అభినయం, ఆయన పోషించిన పాత్రల గీటురాయి ఆల్-టైమ్ గ్రేట్ అని.. అయితే సరైన కమర్షియల్ హంగులు లేకపోవడం వల్లే ఆ రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి రెవెన్యూ రాబట్టలేకపోయాయని బాబీ విశ్లేషించారు. అందుకే రుద్రవీణలోని సామాజిక ఆదర్శం.. స్వయంకృషిలోని కష్టం.. ఆపద్బాంధవుడులోని అద్భుతమైన ఎమోషన్‌ను ప్రాతిపదికగా తీసుకుని.. వాటికి మాస్ -కమర్షియల్ యాంగిల్‌ను నూరు శాతం జోడించి ఈ కొత్త కథను మలిచామని తెలిపారు.
#Mega158 కేవలం మరొక కమర్షియల్ మాస్ చిత్రం మాత్రమే కాదు.. క్లాసిక్ సినిమాల ఎమోషన్‌ను మాస్ వినోదంతో మేళవించిన ఒక భారీ ప్రయోగం అని బాబి చెప్పకనే చెప్పారు. పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం.. బాబీ పట్టుదల.. మెగాస్టార్ నటవిశ్వరూపం కలబోసి రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. క్లాసిక్ కంటెంట్‌కు కమర్షియల్ మాస్ యాంగిల్ తోడైతే ఫలితం ఎలా ఉంటుందో నిరూపించడానికే దర్శకుడు బాబీ `రాసి పెట్టుకోండి` అంటూ అంతటి ఆత్మవిశ్వాసాన్ని కనబరిచారన్నమాట.