మెగా డాటర్స్ సెట్ అయితే సూపర్బ్!
మెగా ఫ్యామిలీ సోదరీమణులు కొణిదెల సుస్మిత-నిహారికలు నిర్మాతలుగా ప్రయాణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిహారిక వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలను నిర్మించింది.;
మెగా ఫ్యామిలీ సోదరీమణులు కొణిదెల సుస్మిత-నిహారికలు నిర్మాతలుగా ప్రయాణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిహారిక వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలను నిర్మించింది. కానీ ఇంత వరకూ అన్నయ్య వరుణ్ తేజ్ తో మాత్రం సినిమా నిర్మించలేదు. ఆ కోరిక తీరిపోతుంది. వరుణ్ తో వాలీబాల్ నేపథ్యంలో బరి అనే సినిమాను నిర్మిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది. ఇందులో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు. అలాగే సుస్మిత తొలి సినిమాను ఏకంగా డాడ్ చిరంజీవితోనే నిర్మించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
చిరంజీవి హీరోగా నటించిన `మన శంకర వరప్రసాద్ గారు` చిత్రాన్ని సాహూ గారపాటితో కలిసి సుస్మిత నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుస్మిత తమ్ముడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కూడా ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తే చూడాలని మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ కాంబినేషన్ సెట్ అయితే మెగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయం. కానీ రామ్ చరణ్‌తో సినిమా చేయాలంటే చాలా స్టెప్స్ దాటాల్సి ఉంటుంది. సొంత అక్క కదా? అని చరణ్ అప్పటికప్పుడు డేట్లు ఇవ్వలేడు. చరణ్ నేడు గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ ఉన్న నటుడు.
పాన్ ఇండియా దర్శకులు, అగ్ర బ్యానర్లతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం `పెద్ది` చిత్రంలో నటిస్తున్నాడు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ది సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చరణ్ తో ఎలాగైనా సినిమా నిర్మించాలని ఈ మూడు బ్యానర్లో ఒకే తాటి మీదకు వచ్చాయి. చరణ్ డేట్లు ఇస్తే సోలోగానే చిత్రాన్ని నిర్మించడానికి ఎన్నో అగ్ర నిర్మాణ సంస్థలు క్యూలో ఉన్నాయి. అలాంటి స్టార్ ఒక్కసారిగా సోదరి కోసం సోలోగా డేట్లు ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు. సుస్మిత ఇప్పటికిప్పుడు చరణ్ తో సినిమా నిర్మించాలంటే ఇతర బ్యానర్లతో అసోసియేట్ అవ్వడం తప్ప మరో మార్గం లేదు.
చరణ్ 17వ చిత్రం నిర్మాతలు ఇప్పటికే ఖరారయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ -సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నిర్మాణంలో భాగమవ్వడానికి సుస్మితకు అవకాశం ఉంటుంది. మరి ఆ రకమైన ఛాన్స్ సుస్మిత తీసుకుంటారా? లేదా? తన సొంత నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై తానే సోలోగా నిర్మించాలనుకుంటున్నారా? అన్నది తేలాలి. సుస్మిత ఇప్పటికే కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎంతో అనుభవం సంపాదించారు. చరణ్‌తో సినిమా చేస్తే ఆ చిత్రం విజువల్‌గా , కంటెంట్ పరంగా ఎంతో రిచ్‌గా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.