చిరు, పవన్, చరణ్ మూవీస్.. ప్రొడ్యూసర్లకు లాస్ ఉండదా?
అయితే ఆ మూడు సినిమాలు ప్రొడ్యూసర్లకు డిస్ట్రిబ్యూటర్లకు నిజంగా లాభాలే తెచ్చిపెట్టాయా? అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగా హీరోల హవా కొనసాగుతోంది. వరుసగా పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ మూడు సినిమాలు ప్రొడ్యూసర్లకు డిస్ట్రిబ్యూటర్లకు నిజంగా లాభాలే తెచ్చిపెట్టాయా? అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.
గతేడాది సెప్టెంబర్ లో విడుదలైన పవన్ కళ్యాణ్ ఓజీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ సాధించిన ఆ చిత్రం లాంగ్ రన్ లో రూ.300 కోట్లకు చేరువలో నిలిచింది. థియేటర్ల పరంగా చూస్తే కొన్ని ఏరియా డిస్ట్రిబ్యూటర్లకు స్వల్ప నష్టాలు వచ్చినట్లు టాక్ వచ్చింది. కానీ ఓటీటీ, శాటిలైట్ హక్కులు, ఇతర నాన్-థియేట్రికల్ ఆదాయాలతో నిర్మాత డీవీవీ దానయ్యకు మాత్రం భారీ స్థాయిలో టేబుల్ ప్రాఫిట్స్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఓజీని నిర్మాత యాంగిల్ లో సేఫ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు.
ఆ తర్వాత సంక్రాంతి బరిలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు కూడా అదే జోరును కొనసాగించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఆ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభాలు అందించింది. థియేట్రికల్ రన్ ముగిసే నాటికి నిర్మాతలకూ, డిస్ట్రిబ్యూటర్లకు మంచి రిటర్న్స్ అందించిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇప్పుడు అదే జాబితాలో రామ్ చరణ్ పెద్ది చేరింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఆ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.315 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సత్తా చాటింది. అయితే సినిమాకు భారీ బడ్జెట్ ఉండటంతో అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందని టాక్ వినిపిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు పూర్తి స్థాయిలో లాభాల్లోకి రావాలంటే ఆ చిత్రం ఇంకా స్ట్రాంగ్ థియేట్రికల్ రన్ కొనసాగించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఉన్న స్పీడ్ చూస్తుంటే.. అది జరిగేలా కనిపిస్తోంది.
అయితే మూడు సినిమాల విషయంలో కనిపిస్తున్న ఒకే కామన్ విషయం ఏమిటంటే నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎఫెక్ట్. ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ రైట్స్ వాల్యూ భారీగా పెరగడంతో నిర్మాతలు ముందుగానే బడ్జెట్ లో ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేసుకుంటున్నారు. దీంతో థియేటర్లలో ఆశించిన స్థాయిలో వసూళ్లు వచ్చినా రాకపోయినా నిర్మాతలు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు తగ్గుతున్నాయి. ఏదేమైనా ఇప్పుడు మెగా హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల క్లబ్ లోకి చేరడమే కాదు.. సరైన బిజినెస్ ప్లానింగ్ తో నిర్మాతలకు కూడా నో లాస్ ప్రాజెక్టులుగా మారుతున్నాయని చెప్పడానికి ఆ మూడు చిత్రాలు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచాయి.