'పెద్ది'కి ముందు థియేటర్స్ సమస్య.. మెగా ఫ్యాన్స్ ఏమంటున్నారు?

థియేటర్ల అద్దె విధానం, పర్సంటేజీ వ్యవస్థపై ఎగ్జిబిటర్లు చేస్తున్న వ్యాఖ్యలు.. మరోవైపు మెగా అభిమానుల ఆగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌ కు దారితీస్తున్నాయి.

Update: 2026-05-13 06:24 GMT

తెలంగాణలో థియేటర్ల సమస్య ఇప్పుడు టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఆ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. థియేటర్ల అద్దె విధానం, పర్సంటేజీ వ్యవస్థపై ఎగ్జిబిటర్లు చేస్తున్న వ్యాఖ్యలు.. మరోవైపు మెగా అభిమానుల ఆగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌ కు దారితీస్తున్నాయి.

ఇటీవల హైదరాబాద్‌ లో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించింది. ఆ సందర్భంగా నిర్మాతలు శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్ థియేటర్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అద్దె విధానం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు నష్టాలను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, సంవత్సరంలో చాలా నెలలు థియేటర్ల యాజమాన్యాలు నష్టాలతో కొనసాగుతున్నాయని వారంతా పేర్కొన్నారు.

ఇకపై పూర్తిస్థాయిలో పర్సంటేజీ లేదా కమిషన్ బేస్డ్ విధానాన్ని అమలు చేయాలని నిర్మాతలు, హీరోలు కోరారు. పర్సంటేజ్ విధానానికి అంగీకరించే సినిమాలనే ప్రదర్శిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్ స్పష్టం చేశారు. అయితే థియేటర్లు బంద్ చేస్తున్నామని జరుగుతున్న ప్రచారం అసత్యమని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఆ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది.

ముఖ్యంగా మెగా అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. "మెగా హీరోల సినిమాలు విడుదలయ్యే సమయానికే ఎందుకు ఇలాంటి సమస్యలు తెరపైకి వస్తాయి?" అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు విడుదల సమయంలో ఇలాంటి పరిస్థితులు కనిపించాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పెద్ది విడుదల సమయం దగ్గరపడుతున్న వేళ ఆ అంశం మళ్లీ పెద్ద ఎత్తున చర్చకు రావడంతో కొందరు అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద సినిమాల విడుదలకు ముందు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారనే కొందరు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు మైత్రీ మూవీ మేకర్స్‌ కు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కొంతమందికి నచ్చడం లేదని కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు సాధారణ సినీ ప్రేక్షకులు, నెటిజన్లు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. థియేటర్ల సమస్య కొత్తది కాదని అంటున్నారు.

ఏడాది స్టార్టింగ్ లోనే చర్చించకుండా ఇప్పుడు మాత్రమే ఎందుకు బయటకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు. పెద్ది వంటి భారీ సినిమా విడుదలకు ముందు చర్చ రావడం సహజంగానే అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఎగ్జిబిటర్ల వాదన మాత్రం భిన్నంగా ఉంది. థియేటర్ల మనుగడ కోసమే తాము ఆ అంశాన్ని లేవనెత్తుతున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిలబడాలంటే ప్రస్తుత వ్యవస్థలో మార్పులు తప్పనిసరిగా అవసరమని అంటున్నారు. అలా ఒకవైపు థియేటర్ల మనుగడ అంశం, మరోవైపు మెగా అభిమానుల రెస్పాన్స్ కలిసి ఇప్పుడు టాలీవుడ్‌ లో పెద్ద చర్చకు దారితీశాయి. మరి పెద్ది మూవీ విడుదలకు ముందే పరిష్కారం దొరుకుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News