క‌ర్మ ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌దు.. రెండో పెళ్లి వార్త‌ల‌పై మండిప‌డ్డ మీనా

తన భర్త విద్యాసాగ‌ర్ 2022లో ఊపిరితిత్తుల సమస్యలతో చ‌నిపోయిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.;

Update: 2026-02-20 18:30 GMT

సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడూ అందరి కళ్ల ముందే ఉంటాయి. కానీ బ‌య‌ట‌కు క‌నిపించే ఆ వెలుగుల వెనుక ఎంత బాధ దాగి ఉంటుందో చాలా మందికి తెలియదు. తాజాగా సీనియర్ నటి మీనా మనసును ముక్కలు చేసే ఆవేదనను వ్యక్తం చేశారు. రీసెంట్ గా మీనా రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం మొదల‌వ‌డం, సోష‌ల్ మీడియా వాడ‌కం పెర‌గ‌డంతో ఆ వార్త‌లు క్షణాల్లో వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు, సన్నిహితులు కూడా ఫోన్ చేసి ఈ విష‌య‌మై మీనాను అడగడం మొద‌లుపెట్టారు. వీట‌న్నింటితో సహనం కోల్పోయిన మీనా ఈసారి కాస్త గట్టిగానే స్పందించారు.

ఆ బాధ నుంచి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేదు

తన భర్త విద్యాసాగ‌ర్ 2022లో ఊపిరితిత్తుల సమస్యలతో చ‌నిపోయిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆ బాధ నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు. ప్ర‌స్తుతం నా కూతురే నా ప్రపంచం. త‌న కోస‌మే స్ట్రాంగ్ గా నిల‌బ‌డుతున్నాను అంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు మీనా. భర్త మరణించిన కొన్ని రోజులకే తనపై పెళ్లి పుకార్లు రాయడం మొదలైందని, కానీ అప్పట్లో పట్టించుకోలేదని చెప్పారు. కానీ త‌న మౌనాన్ని బలహీనతగా తీసుకుంటే ఎలా? అని ఆమె ప్రశ్నించారు.

ఒంటరి మహిళను కాబట్టి ఇలా రాస్తున్నారా?

తానొక సెలబ్రిటీనని, ఒక మహిళనని, భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న స్త్రీని అని, అందుకే త‌న‌ను ఈజీగా టార్గెట్ చేస్తున్నారా అంటూ ప్ర‌శ్నిస్తూ మీనా మండిప‌డ్డారు. ఈ వార్త‌ల‌ను ఇప్ప‌టికే ప‌లుమార్లు ఖండించాన‌ని, అయినా మ‌ళ్లీ మ‌ళ్లీ అదే క‌థ‌లు రాయ‌డం ఎందుకో అర్థం కావ‌డం లేద‌ని అన్నారు. ఫ్రెండ్స్ ఫోన్ చేసి పెళ్లి గురించి అడ‌గ‌డం త‌న గుండెను మ‌ళ్లీ మ‌ళ్లీ గాయ‌ప‌రుస్తోంద‌ని, ఇలాంటి ఫేక్ వార్త‌లు త‌న ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీస్తున్నాయ‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను చాలా పాజిటివ్ ప‌ర్స‌న్ ను అని, ఇకమీద‌ట ఇలాంటి వాటి గురించి త‌న టైమ్, ఎన‌ర్జీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోద‌ల‌చుకోలేద‌ని, క‌ర్మ అనేది ఒక‌టి ఉంటుంద‌ని, అది ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌ద‌ని ఆమె అన్నారు.

సోష‌ల్ మీడియానే కార‌ణమా?

గతంలో పుకార్లు చాలా అరుదుగా వ‌చ్చేవ‌ని, ఇప్పుడు సోషల్ మీడియా వల్ల క్షణాల్లో ప్రపంచమంతా తెలిసిపోతుంద‌ని, దాని వ‌ల్ల ఒక అబద్ధం కూడా నిజంలా మారిపోతుందంటూ ఆమె వ్యాఖ్యానించారు. మీనా చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై హద్దులు దాటుతున్న సోషల్ మీడియా సంస్కృతి పై ఇప్పుడు మ‌రోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇప్ప‌టికైనా మీనా విష‌యంలో ఈ రూమ‌ర్లు ఆగుతాయేమో చూడాలి.

Tags:    

Similar News