మారుతి అడ్రస్ లీక్.. ఎఫెక్ట్ పడిందా?

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి రీసెంట్ గా ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2026-01-23 10:11 GMT

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి రీసెంట్ గా ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో రూపొందిన ఆ సినిమా.. మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంది. భారీ అంచనాల మధ్య సినిమా రిలీజ్ అవ్వగా.. అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మారుతిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

అయితే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న సంగతి విదితమే. ఆ సమయంలో మూవీ అవుట్ పుట్ పై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. సినిమా చూశాక ఏ ఒక్క అభిమాని అయినా నిరాశ చెందితే తన ఇంటికి వచ్చి నిలదీయండంటూ ఏకంగా తన ఇంటి అడ్రస్ కొండాపూర్‌ లోని విల్లా నంబర్ 17 మైక్‌ లో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయితే ఇప్పుడు చిరునామా వెల్లడించడమే తనకే చిక్కులు తెచ్చిపెట్టిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మారుతి నివసిస్తున్న కొండాపూర్‌ లోని కొల్లా లక్సూరియా అపార్ట్మెంట్‌ లోని విల్లా నంబర్ 17కి గత మూడు నాలుగు రోజులుగా భారీ సంఖ్యలో పార్సిళ్లు, లేఖలు చేరుతున్నాయని తెలుస్తోంది. రోజూ అనేక కొరియర్ బాక్సులు, కవర్లు అదే చిరునామాకు వస్తున్నాయట.

దీంతో ఇప్పుడు మారుతి ఉన్న అపార్ట్మెంట్ సిబ్బంది, భద్రతా సిబ్బంది అయోమయంలో పడిపోయారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అసలు ఆ పార్సిల్స్ ఎవరు పంపుతున్నారు? వీటిలో ఏముందన్న విషయం తెలియకపోవడం గందరగోళాన్ని మరింత పెంచిందని వినికిడి. అయితే కొందరు అభిమానులు కావాలనే వరుసగా ఆర్డర్లు, లేఖలు పంపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి ఘటనలపై ఇప్పటికే మారుతి సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు! అభిమానుల ప్రేమ ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తుంటే, ఇలా వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం భద్రతాపరమైన సమస్యలకు దారితీస్తుందని వారు చెబుతున్నారు. అపార్ట్మెంట్‌ లో నివసిస్తున్న ఇతర కుటుంబాలు కూడా అనవసర డెలివరీల వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

అందుకే భద్రతా సిబ్బంది ప్రతి పార్సిల్‌ ను జాగ్రత్తగా పరిశీలిస్తూ, అనుమానాస్పదంగా కనిపిస్తే నిర్వాహకులకు సమాచారం అందిస్తున్నారని టాక్. మొత్తం వ్యవహారంపై అధికారికంగా మారుతి స్పందించకపోయినా, ఇకపై తన వ్యక్తిగత వివరాలను బహిరంగంగా చెప్పకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అవసరమైతే కొరియర్ సంస్థలతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

ఈ ఘటన దర్శకులు, నటులు, సెలబ్రిటీలు తమ వ్యక్తిగత సమాచారం విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో గుర్తుచేస్తోంది. స్టేజ్‌ పై సరదాగా చెప్పిన ఒక్క మాట కూడా పెద్ద సమస్యగా మారవచ్చని స్పష్టం చేసింది. అభిమానులతో అనుబంధం అవసరమే అయినా, భద్రత, గోప్యతకు మించినది లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రాజా సాబ్ ఈవెంట్‌ లో చెప్పిన అడ్రస్ ఇప్పుడు మారుతికి తలనొప్పిగా మారింది.

Tags:    

Similar News