నాగ్.. మారుతిని నమ్ముతాడా?

అక్కినేని నాగేశ్వరరావు ఘన వారసత్వాన్ని నిలబెట్టడంలో నాగార్జున చాలా వరకు విజయవంతం అయ్యాడు కానీ.. ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారు.;

Update: 2026-04-02 19:13 GMT

అక్కినేని నాగేశ్వరరావు ఘన వారసత్వాన్ని నిలబెట్టడంలో నాగార్జున చాలా వరకు విజయవంతం అయ్యాడు కానీ.. ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారు. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి ఫెయిలైన నాగచైతన్య, ఎక్కువగా లవ్ స్టోరీలు చేస్తూ మిడ్ రేంజ్‌లో సెటిల్ కాగా.. అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అయిన దశాబ్దం తర్వాత కూడా నిలదొక్కుకోలేకపోయాడు. దీంతో వీరి సినిమాల మీద నాగ్ ఇంకా ఒక కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది.

చైతూ స్వతంత్రంగానే సినిమాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది కానీ.. అఖిల్ విషయంలో మాత్రం నాగ్‌ పర్యవేక్షణ తప్పట్లేదు. ‘లెనిన్’ దర్శకుడు, కథ ఎంపికలో నాగ్ పాత్ర ఉందన్నది స్పష్టం. ఈ సినిమా మేకింగ్‌ను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. దీని తర్వాత అఖిల్ ఏ సినిమా చేయాలనే విషయంలోనూ నాగ్ రోల్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఐతే ఇప్పుడు దర్శకుడు మారుతి.. అఖిల్‌తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తన చివరి చిత్రాన్ని ప్రభాస్ లాంటి టాప్ స్టార్‌తో చేశాడు మారుతి. కానీ వీరి కలయికలో వచ్చిన ‘రాజాసాబ్’ అంచనాలకు చాలా దూరంలో నిలిచిపోయింది. మారుతి తన కెరీర్లో ఎన్నడూ లేనంత ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు ఈ సినిమా వల్ల. ఇప్పుడు మళ్లీ తన రేంజిలో మిడ్ రేంజ్ సినిమా చేయాలనుకుంటున్నాడు మారుతి. ముందు మెగా హీరో వరుణ్ తేజ్‌తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అతను ‘బరి’ మీదికి వెళ్లిపోయాడు. దీంతో ఇప్పుడు అఖిల్ వైపు మారుతి చూస్తున్నట్లు తెలుస్తోంది. కథా చర్చలు జరుగుతున్నాయట.

కానీ మారుతి గతంలో మంచి ఫాంలో ఉండగా నాగచైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ తీస్తే అది ఫ్లాప్ అయింది. అలాంటిది ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్న మారుతి.. కెరీర్లో ఇబ్బంది పడుతున్న అఖిల్‌తో ఎలాంటి సినిమా తీస్తాడన్నది ఆసక్తికరం. కొడుకును నిలబెట్టడం కోసం జాగ్రత్తగా వ్యవహరిస్తున్న నాగ్.. ఆషామాషీగా మారుతి కథను ఓకే చేయడన్నది స్పష్టం. మరి మారుతి నాగ్‌ను మెప్పించి అక్కినేని కుర్రాడితో సినిమా ఓకే చేసుకుంటాడేమో చూడాలి.

Tags:    

Similar News