మారుతి.. ఎట్టకేలకు మళ్ళీ ఇలా..

మారుతి పెట్టిన పోస్ట్‌లో చాలా మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడే ఆయన, ఇప్పుడు చాలా జాగ్రత్తగా పదాలు వాడారు.;

Update: 2026-03-27 09:33 GMT

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన డైరెక్టర్ మారుతి టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్‌లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం ఆయన స్టైల్. కానీ ఈ ఏడాది మొదట్లోనే డిజాస్టర్ వలన, ఆ తరువాత పరిస్థితుల వల్ల కొన్నాళ్లుగా బయట ఎక్కడా కనిపించలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా లేరు. ఇంతలా సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటనేది ఇండస్ట్రీలో అందరికీ అర్థమైన విషయమే.

నిజానికి ప్రభాస్ వంటి పెద్ద స్టార్‌తో 'ది రాజా సాబ్' చేస్తున్నప్పుడు మారుతి మీద చాలా అంచనాలు ఉండేవి. కానీ ఆ సినిమా రిజల్ట్ ఊహించని దెబ్బ కొట్టింది.. రిలీజ్ ముందు మారుతి ఇచ్చిన స్టేట్మెంట్లు చివరకు ఆయనకే ఇబ్బందిగా మారాయి. దీంతో నెటిజన్లు ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ సమయంలో ఫ్యాన్స్ నుంచి వచ్చిన రియాక్షన్స్, ఇంటికి పార్శిళ్లు పంపడం వంటివి చాలా ఇబ్బంది పెట్టాయి. దాంతో మారుతి కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.

సుమారు రెండు నెలల తర్వాత, ఈరోజు శ్రీరామనవమి కావడంతో మారుతి మళ్ళీ ఒక పోస్ట్ పెట్టారు. తన ఇంట్లో పూజ చేస్తున్న ఫోటోలు షేర్ చేస్తూ, అసలు విషయం చెప్పారు. గతాన్ని ఒక పాఠంలాగా తీసుకున్నానని, దేవుడి ఆశీస్సులతో తన నెక్స్ట్ స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. ఈ పోస్ట్ చూడటానికి నార్మల్‌గా ఉన్నా, మారుతి మళ్ళీ తన పని తాను మొదలుపెట్టారని అర్థమవుతోంది.

మారుతి పెట్టిన పోస్ట్‌లో చాలా మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడే ఆయన, ఇప్పుడు చాలా జాగ్రత్తగా పదాలు వాడారు. తనకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ థాంక్స్ చెబుతూ, ఈసారి గట్టిగా ట్రై చేస్తానని ప్రామిస్ చేశారు. పాత తప్పులను మళ్ళీ చేయకుండా, ఈసారి అందరినీ మెప్పించేలా ఒక పక్కా కథతో వస్తున్నట్లు అతని మాటలు బట్టి తెలుస్తోంది. తనలోని కామెడీ టైమింగ్ మళ్ళీ వర్కవుట్ అయితే ట్రాక్ లోకి రావడం కష్టమేమీ కాదు.

'ది రాజా సాబ్' ప్లాప్ అయినా ప్రభాస్ మళ్ళీ మారుతికి ధైర్యం చెప్పడం విశేషం. మరో ఛాన్స్ ఇస్తానని కూడా ప్రభాస్ హామీ ఇచ్చారని టాక్ వచ్చింది. అయితే ప్రభాస్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి, మారుతి తన నెక్స్ట్ సినిమాను వేరే హీరోతో చేసే ఛాన్స్ ఉంది. ఆయన రాసుకున్న ఈ కొత్త కథ ఏ హీరోకి సెట్ అవుతుంది? ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎట్టకేలకు మారుతి మళ్ళీ బయటకు రావడం ఆయన సన్నిహితులకు సంతోషాన్నిస్తోంది. తన వర్క్ ఇష్టపడే వాళ్ళు కూడా మారుతి మళ్ళీ ఒక స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారు. 'రాజా సాబ్' చేదు అనుభవాలను పక్కన పెట్టి, మారుతి తన పాత ఫామ్ చూపిస్తారో లేదో చూడాలి. ఇక కొత్త ప్రాజెక్ట్ గురించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News