ఏఐ నటులు బంగాళాదుంపల్లా నటిస్తున్నారు!

ఫ్రెంచ్ నటి, ఆస్కార్ విజేత మారియన్ కొటిల్లార్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నటులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-09-25 15:30 GMT

ఫ్రెంచ్ నటి, ఆస్కార్ విజేత మారియన్ కొటిల్లార్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నటులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏఐ ద్వారా సృష్టించబడుతున్న వర్చువల్ నటుల నటన బంగాళాదుంపల్లా (నిర్జీవంగా) ఉందని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి మారి ఏఐ నటుడి నటన తనను భావోద్వేగానికి గురిచేస్తే లేదా మాయ చేయగలిగితే ఆ పరిస్థితిని తలచుకుంటే భయమేస్తోందన్నారు. స్పెయిన్‌లో జరుగుతున్న 74వ సాన్ సెబాస్టియన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో తన కొత్త చిత్రం `7h40 ce jour-la ప్రదర్శన సందర్భంగా మారియన్ ఈ వ్యాఖ్య‌లు చేసారు. పరిశ్రమలో రోజురోజుకూ పెరుగుతున్న ఏఐ ప్రభావంపై త‌న అభిప్రాయాల‌ను బాహాటంగా పంచుకున్నారు. ప్రస్తుతానికైతే ఏఐ నటుల నటన ఏమాత్రం ప్రభావవంతంగా లేకపోవడం కొంత ఊరటనిస్తోందని.. కానీ రాబోయే రోజుల్లో ఇవి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.

భవిష్యత్తు సాంకేతిక పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసారు. ఒకరోజు ఏఐ నటులు నిజమైన నటులవలే ప్రేక్షకులను నమ్మించగలిగితే పరిస్థితి ఏంటని? ప్రశ్నించారు. `ఏదో ఒక రోజు ఏఐ నటుడి నటన చూసి నేను భావోద్వేగానికి గురైతే ఆ రోజున నేను నిజంగా భయపడతాను` అని వెల్లడించారు. సాంకేతికత మానవ సహజమైన భావోద్వేగాలను రీక్రియేట్ చేయగలదా? లేదా? అనే ప్రశ్న తనను నిరంతరం ఆలోచింపజేస్తుందని 50 ఏళ్ల నటి అనుమానం వ్య‌క్తం చేసారు.

ప్రస్తుతం ఏఐ ఆధారిత నటుల వాడకంపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవల `టిల్లీ నార్వుడ్` అనే వర్చువల్ ఏఐ నటి ఓ ప్రముఖ టాక్ షోలో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పియర్స్ మోర్గాన్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఏఐ మోడల్ సడన్‌గా చైనీస్ భాషలోకి మారి మాట్లాడటం సంచలనం సృష్టించింది. ఇలాంటి ప్రయోగాలు సాంకేతికత సాధిస్తున్న పురోగతికి నిదర్శనంగా నిలుస్తున్నప్పటికీ సినీ కళాకారుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.

2008లో రిలీజ్అ యిన `లా వీ ఎన్ రోజ్` చిత్రంలో ప్రసిద్ధ ఫ్రెంచ్ గాయని ఎడిత్ పియాఫ్ పాత్రలో అద్భుత నటనకు గాను మారియన్ కొటిల్లార్డ్ ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న `7h40 ce jour-là` చిత్రంలో 20 ఏళ్ల జైలు శిక్ష తర్వాత బయటకు వచ్చి తన కుమారుడితో తిరిగి సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించే ఆలిస్ అనే మాజీ విప్లవ కార్యకర్త పాత్రలో కనిపించనున్నారు. నికోల్ గార్సియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫెస్టివల్‌లో ప్రధాన పురస్కారం కోసం పోటీపడుతోంది.

సాంకేతికత రోజురోజుకూ సరికొత్త శిఖరాలను చేరుకుంటున్నా? మానవ అనుభూతులను, హృదయపూర్వక భావోద్వేగాలను సాంకేతికతతో సృష్టించడం ఎంతవరకు సాధ్యమనేది ప్రశ్నార్థకంగా మారింది. మారియన్ కొటిల్లార్డ్ వంటి దిగ్గజ నటీమణులు వ్యక్తంచేసిన అభిప్రాయాలు భ‌విష్య‌త్ సినీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఏ విధంగా ఉండబోతోందనే దానిపై పరిశ్రమలో సరికొత్త ఆలోచనలకు నాంది పలుకుతున్నాయి.

Tags:    

Similar News