సినిమా రంగంలో మార్పు మహిళలతోనే సాధ్యం!

భారతీయ చలనచిత్ర -డిజిటల్ రంగంలో మహిళా ప్రాధాన్యత కలిగిన కథలు, పాత్రల చిత్రణపై గత కొన్నేళ్లుగా విస్తృతమైన చర్చ జరుగుతోంది.

Update: 2026-06-08 12:30 GMT

భారతీయ చలనచిత్ర -డిజిటల్ రంగంలో మహిళా ప్రాధాన్యత కలిగిన కథలు, పాత్రల చిత్రణపై గత కొన్నేళ్లుగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విలక్షణమైన నటనతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌పై మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మాన్వీ గారూ చిత్ర పరిశ్రమలో లింగ సమానత్వం -పితృస్వామ్య ధోరణులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో .. చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులలో మార్పు రావాలంటే పురుషులు చొరవ తీసుకుంటారని ఆశించడం వ్యర్థమని, ఆ మార్పును మహిళలే స్వయంగా తీసుకురావాలని సూచించారు.

`పరిశ్రమలో పురుషులు మన కోసం వ్యవస్థను మారుస్తారని భావించడం అమాయకత్వమే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతమున్న వ్యవస్థ వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంది. అలాంటప్పుడు వారు దానిని ఎందుకు మార్చాలని అనుకుంటారు? కాబట్టి మహిళలుగా మనమే ముందడుగు వేసి ఆ హద్దులను చెరిపేస్తూ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నించాలి` అని పిలుపునిచ్చారు. మాన్వీ నటించిన `హీర్ సారా` సిరీస్ కూడా ఇద్దరు ఆధునిక మహిళల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందింది. నగర జీవితంలో ఒంటరిగా ఉంటూ సమాజం విధించే నిబంధనలను దాటుకుంటూ తమకంటూ గుర్తింపు కోసం పోరాడే ఇద్దరు స్నేహితుల ప్రయాణాన్ని ఇందులో ఆవిష్కరించారు.

ఈ సిరీస్ ప్రస్తుత తరం మహిళల ఆలోచనలకు, వారు నిత్య జీవితంలో ఎదుర్కొనే మానసిక ఘర్షణలకు అద్దం పడుతుందని మాన్వీ పేర్కొన్నారు. సమాజం ఆశించే ముసాయిదాలో ఇమడలేని మహిళల అస్తిత్వాన్ని ఈ కథ చర్చిస్తుందని తెలిపారు. చిత్ర పరిశ్రమలో కేవలం తెరపైనే కాకుండా తెర వెనుక కూడా మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉంద‌ని నొక్కి చెప్పారు. ఎక్కువ మంది మహిళా దర్శకులు, రచయితలు, నిర్మాతలు ముందుకు వచ్చినప్పుడే మహిళల కోణంలో ఉండే వాస్తవిక కథలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు.

పురుషులు రాసే మహిళా పాత్రలకు, ఒక మహిళ స్వయంగా రాసే పాత్రలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందని, అందులోనే అసలైన వాస్తవికత దాగి ఉంటుందని మాన్వీ విశ్లేషించారు. మహిళలు తమ హక్కుల కోసం తామే మాట్లాడటం నేర్చుకో వాలన్నారు. అలాగే మాన్వీ గారూ తన కెరీర్ ప్రయాణం గురించి ప్ర‌స్తావించింది. `ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్`, `ట్రిప్లింగ్` వంటి సిరీస్‌ల ద్వారా తాను ఎప్పుడూ స్వతంత్ర ఆలోచనలు గల పాత్రలనే ఎంచుకున్నానని గుర్తుచేశారు. టైప్‌కాస్ట్ కాకుండా విభిన్నమైన పాత్రలు చేయడం నటిగా తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. సినిమా రంగంలో మార్పు అనేది రాత్రికి రాత్రి రాదని కానీ చేసే చిన్న ప్రయత్నాలు, ఎంచుకునే ప్రత్యామ్నాయ కథలు భవిష్యత్తులో పెద్ద మార్పుకు పునాది వేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News