మీకు బౌన్స‌ర్లు ఎందుకు? మంచు విష్ణుకు త‌మ్మారెడ్డి ప్రశ్న‌!

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మంచు మోహ‌న్ బాబు న‌టవార‌సులుగా మంచు విష్ణు, మంచు మ‌నోజ్ వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు.;

Update: 2025-05-28 03:58 GMT
Manchu Vishnu Responds to Tammareddy Bold Questio

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మంచు మోహ‌న్ బాబు న‌టవార‌సులుగా మంచు విష్ణు, మంచు మ‌నోజ్ వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. వారు ప‌రిశ్ర‌మ‌లో న‌టులుగా నిర్మాత‌లుగా వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తున్నారు. విష్ణు మా అధ్య‌క్షుడిగాను ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌డు న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం క‌న్న‌ప్ప త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా అత‌డు ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌తో యూట్యూబ్ చిట్ చాట్ లో చెప్పిన కొన్ని సంగ‌తులు ఆస‌క్తిని రేకెత్తించాయి.

అయితే ఈ ఇంట‌ర్వ్యూలో ముక్కు సూటిగా త‌మ్మారెడ్డి ఒక ప్ర‌శ్న‌ను సంధించారు. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు బౌన్స‌ర్ల‌తో హ‌డావుడి చేయ‌రు. మోహ‌న్ బాబు వార‌సుడిగా మంచు విష్ణు వెళుతుంటే, అటు ఇటు బాడీ గార్డులు ఉంటారు ఎందుకు? ప‌రిశ్ర‌మ అగ్ర హీరోలుగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, కింగ్ నాగార్జున అంత‌టివారే ఇలా ఉండ‌రు. బాల‌య్య రాజ‌కీయ నాయ‌కుడు అయ్యాకా, నిన్న మొన్న‌టి వ‌ర‌కూ బౌన్స‌ర్ల‌తో ప‌ని లేకుండా ప‌బ్లిక్ లో తిరిగారు. కానీ మీకు ఎందుకు బౌన్స‌ర్లు? అంటూ ప్ర‌శ్నించారు.

ఊహించ‌ని ఈ ప్ర‌శ్న‌కు ఖంగు తిన్న విష్ణు.. కొన్నిసార్లు త‌న‌కు ఎదురైన ప‌రిస్థితుల కార‌ణంగానే బౌన్స‌ర్లను నియ‌మించుకోవాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. కొన్నిసార్లు అభిమానులు సెల్ఫీలు, ఫోటోలు పేరుతో మీది మీదికి వ‌చ్చే ప‌రిస్థితులు ఎదుర‌వుతుంటాయి. కానీ గార్డులు ఉంటే, కొంత‌యినా ఆలోచిస్తారు. వెంట‌నే ఇది వారికి సాధ్యం కాదు. అలాగే ఏదైనా ట్రాఫిక్ లోనో, లేక జ‌న స‌మూహాల్లోనో వెళుతుంటే, అక్క‌డ నా వ‌ల్ల ఇత‌రుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌నే బౌన్స‌ర్లు నాతో ఉంటార‌ని అన్నారు. క‌న్న‌ప్ప చిత్రం అత్యంత భారీ కాన్వాస్ తో తెర‌కెక్కింది. స‌ర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయ‌ని విష్ణు ఈ ఇంట‌ర్వ్యూలో త‌మ్మారెడ్డికి చెప్పారు.

త‌మ్మారెడ్డి పూర్తి ప్ర‌శ్న‌ను ప‌రిశీలిస్తే.. ``మీ కుటుంబం గురించి నేను గర్వంగా భావిస్తున్నాను, కానీ కొన్నిసార్లు అది నన్ను కూడా కోపంగా ఉంచుతుంది. మీ తండ్రి మోహన్ బాబు ఈ రోజు ఈ స్థాయికి ఎద‌గ‌డానికి చాలా కష్టపడ్డాడు. మీరు సాధారణ వ్యక్తిలా ఎందుకు ప్రవర్తించరు? మీకు బౌన్సర్లు ఎందుకు అవసరం? మీరు సామాన్యులే క‌దా! బాలకృష్ణ కూడా రాజకీయ నాయకుడిగా రాకముందు బౌన్సర్లు లేకుండా తిరిగారు`` అని అన్నారు.

దానికి విష్ణు స్పందిస్తూ.. ``తాను `సాధారణ` వ్యక్తిని కాదని, తనకు బౌన్సర్లు అవసరమని, దానివ‌ల్ల ఎవరూ మీదికి దూసుకురాలేర‌ని భావిస్తున్నారని పేర్కొన్నాడు. మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, మేము సాధారణ వ్యక్తులం కాదు అంకుల్‌. ప్రజలు నన్ను క‌ల‌వాల‌నుకోవడంతో ఆగదు. మేము అన‌వ‌స‌రంగా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాము. కొంతమంది నేను నా కుటుంబంతో ఉన్నానని అర్థం చేసుకుంటారు. మరికొందరు నేను వారి కుటుంబం లాంటివాడినని అనుకుంటారు.. ఆ స‌మ‌యంలో నా ప‌రిస్థితిని అర్థం చేసుకోలేరు. నా దగ్గర ఎవ‌రైనా(బౌన్సర్లు) ఉంటే, వారు నన్ను సంప్రదించే ముందు రెండుసార్లు ఆలోచిస్తారు. ఇది వర్గవాదం(క్లాస్ స్టాటస్) గురించి కాదు.

ఒకప్పుడు సెల్ఫీ కోసం తన చేయి లాగిన అభిమానులు తన తండ్రి స్టేటస్ కారణంగా అతని దగ్గరికి వెళ్లడానికి ఎలా భయపడుతార‌ని కూడా ఆయన ఒక ఉదాహరణ ఇచ్చారు. ప్రజలు నాతో బాగా తెలిసినట్లుగా మాట్లాడినప్పుడు నేను గందరగోళానికి, ఇబ్బందికి గురయ్యే సందర్భాలు ఉన్నాయి.. నాకు వాళ్ళు వ్యక్తిగతంగా తెలుసా? అని నేను ఆశ్చర్యపోతాను అని విష్ణు చెప్పారు.

Tags:    

Similar News