మంచు మనోజ్ కొత్త అవతారం: గ్లోబల్ లెవెల్లో 'మోహన రాగ' మ్యూజిక్!
హీరోగానే కాదు, తనదైన క్రియేటివిటీతో ఎప్పుడూ కొత్తగా ఆలోచించే మంచు మనోజ్, ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపారు.;
హీరోగానే కాదు, తనదైన క్రియేటివిటీతో ఎప్పుడూ కొత్తగా ఆలోచించే మంచు మనోజ్, ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపారు. సినిమాల్లో తన ఎనర్జీతో, డిఫరెంట్ పాత్రలతో అలరించే మనోజ్, ఇప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. "మోహన రాగ మ్యూజిక్" పేరుతో తన సొంత మ్యూజిక్ లేబుల్‌ను అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇది కేవలం లోకల్ ఆడియన్స్ కోసమే కాదు, మన మ్యూజిక్‌ను గ్లోబల్ బీట్స్‌తో ప్రపంచానికి వినిపించేందుకేనని ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
అసలు మనోజ్‌కి సంగీతం అంటే ప్రాణం అన్న విషయం చాలా మందికి తెలుసు. 'పోటుగాడు' సినిమాలో 'ప్యార్ మే పడిపోయా' అంటూ పాడినా, కరోనా కష్టకాలంలో 'అంత బాగుంటాంరా' అంటూ పాటతో ధైర్యం చెప్పినా.. అందులో అతని మ్యూజిక్ టేస్ట్ కనిపిస్తుంది. కేవలం పాడటమే కాదు, 'మిస్టర్ నూకయ్య', 'నేను మీకు తెలుసా' వంటి సినిమాలకు లిరిక్స్ రాసిన అనుభవం కూడా మనోజ్‌కి ఉంది. ఆ ప్యాషన్‌తోనే ఇప్పుడు ఈ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు.
తెర వెనుక మనోజ్ చేసిన మ్యూజిక్ ప్రయోగాలు చాలానే ఉన్నాయి. తన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు సినిమాల్లో మ్యూజిక్ సిట్టింగ్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనడమే కాదు, ఫ్యామిలీ సినిమాల్లో కొన్ని రాప్ సాంగ్స్ కూడా ట్రై చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బ్రీ లార్సన్ నటించిన హాలీవుడ్ సినిమా 'బాస్మతి బ్లూస్' కోసం మ్యూజిక్ డైరెక్టర్ అచు రాజామణితో కలిసి మనోజ్ వర్క్ చేశారు. అప్పుడే ఆయనలోని మ్యూజిక్ సెన్స్ ఇంటర్నేషనల్ లెవెల్‌కి రీచ్ అయ్యింది.
ఈ లేబుల్‌కి "మోహన రాగ" అని పేరు పెట్టడం వెనుక ఒక ఎమోషనల్ రీజన్ ఉంది. ఇది మంచు కుటుంబానికి, ముఖ్యంగా మోహన్ బాబు గారికి, మనోజ్‌కి అత్యంత ఇష్టమైన రాగం. తన తండ్రి పేరు కలిసేలా, తనకు ఇష్టమైన మ్యూజిక్ వినిపించేలా ఈ పేరును డిసైడ్ చేశారు. "లోకల్ హార్ట్స్, గ్లోబల్ బీట్" అనే ట్యాగ్‌లైన్‌తో మన నేటివిటీని ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ లేబుల్ లక్ష్యం.
కేవలం తన సొంత పాటల కోసమే ఈ కంపెనీ పెట్టలేదు. బయట ఉన్న ఫ్రెష్ టాలెంట్‌ను, కొత్త స్వరాలను వెలుగులోకి తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. బోల్డ్ టాలెంట్, ఫియర్‌లెస్ క్రియేటివిటీ ఉన్న యంగ్ మ్యూజిషియన్స్‌కి ఇదొక మంచి ప్లాట్‌ఫామ్ కాబోతోంది. ఇప్పటికే మ్యూజిక్ ఇండస్ట్రీలో కొత్త వారికి అవకాశాలు తక్కువగా ఉన్న టైంలో, మనోజ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమందికి లైఫ్ ఇస్తుందనడంలో సందేహం లేదు.
త్వరలోనే ఈ బ్యానర్ నుంచి అదిరిపోయే అప్డేట్స్ రాబోతున్నాయి. ఒరిజినల్ సింగిల్స్, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాటు.. ఒక భారీ ఇంటర్నేషనల్ కొలాబరేషన్‌ను కూడా మనోజ్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు మ్యూజిక్‌ను ఖండాంతరాలకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్న మంచు మనోజ్.. ఈ కొత్త వెంచర్‌తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.