ధైర్యంగా ఉన్నా లోపల మాత్రం భయంగానే ఉండేది
మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ రకరకాల సినిమాలతో కొత్త ప్రయోగాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.;
మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ రకరకాల సినిమాలతో కొత్త ప్రయోగాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ గత కొన్నేళ్లుగా మనోజ్ కెరీర్ కు అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ను పూరించాలని మనోజ్ ఎప్పటికప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. కానీ అవేవీ ఫలించలేదు.
ఆశించిన ఫలితం అందుకోని భైరవం
మధ్యలో హీరోగా ఒకటి, రెండు సినిమాలను అనౌన్స్ చేశారు కానీ తర్వాత వాటి గురించి మళ్లీ ఎలాంటి అప్డేట్ లేదు. రీసెంట్ గా భైరవం అనే సినిమాను చేసినప్పటికీ ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కానీ ఇప్పుడు తాజాగా రిలీజైన మిరాయ్ సినిమా మాత్రం మనోజ్ కు మంచి సక్సెస్ ను ఇచ్చి తన ఆకలిని తీర్చింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన మిరాయ్ లో మంచు మనోజ్ కీలక పాత్రలో నటించారు.
అంతా కలలానే ఉంది
సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు మొదటి రోజునే రూ.27 కోట్ల కలెక్షన్లు రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించగా అందులో పాల్గొన్న మనోజ్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. 12 ఏళ్ల తర్వాత తనకు సక్సెస్ వచ్చిందని, అభినందించడానికి ఫోన్లు వస్తున్నప్పటికీ ఇదంతా కలలానే ఉందంటున్నారు మనోజ్.
ఆఖరి నిమిషంలో చాలా సినిమాలు క్యాన్సిల్ అయ్యాయి
తనను నమ్మి మిరాయ్ లో ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ కు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానని చెప్పిన మనోజ్, ఇంతకుముందు తానెక్కడికి వెళ్లినా ఎప్పుడు సినిమా తీస్తావ్, కంబ్యాక్ ఎప్పుడనే వాళ్లని, త్వరలోనే వస్తానని అందరితో ధైర్యంగా చెప్పినప్పటికీ, తన లోపల మాత్రం తెలియని భయం ఉండేదని, దానిక్కారణం చాలా సినిమాలు లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అవడమేనని చెప్పారు మనోజ్.
కార్తీక్ ఆ భయాన్ని పోగొట్టాడు
తనని నమ్మి కార్తీక్ ఈ ప్రాజెక్టులో చోటివ్వడం అదృష్టమని, కార్తీక్ నిలబెట్టింది తనను మాత్రమే కాదని, తన కుటుంబాన్ని కూడా అని మనోజ్ అన్నారు. నేను పెరిగినట్టు నా పిల్లల్ని పెంచగలనా అనే భయం తనకెప్పుడూ ఉండేదని, ఆ భయం మొత్తాన్ని కార్తీక్ తీసేశారని, ఈ సినిమాను ఇంతగా నమ్మి తీసిన నిర్మాతకు థ్యాంక్స్ అని చెప్పుకొచ్చారు మనోజ్. మిరాయ్ లో మహావీర్ లామా గా ఆడియన్స్ ను మెప్పించిన తాను ఇకపై వరుస సినిమాలు చేసి ఆడియన్స్ ను అలరిస్తానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.