మంచు లక్ష్మి అంత తేలిగ్గా వదిలేలా లేదు
మంచు లక్ష్మీప్రసన్న చూడ్డానికి చాలా సరదా మనిషిలాగే కనిపిస్తుంది. సినిమా ఈవెంట్లలో, మీడియా ఇంటర్వ్యూల్లో ఆమె జోవియల్‌గానే ఉంటుంది.;
మంచు లక్ష్మీప్రసన్న చూడ్డానికి చాలా సరదా మనిషిలాగే కనిపిస్తుంది. సినిమా ఈవెంట్లలో, మీడియా ఇంటర్వ్యూల్లో ఆమె జోవియల్‌గానే ఉంటుంది. కానీ ఆమె హర్టయితే, కోపం తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు జనాలకు తెలుస్తోంది. ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మికి ఎదురైన ప్రశ్న ఆమెకు తీవ్ర ఆగ్రహమే తెెప్పించినట్లు స్పష్టమవుతోంది. మహిళల పట్ల వివక్ష చూపించేలా.. వారి వస్త్రధారణను కించపరిచేలా ఆ ప్రశ్న ఉండడంతో ఆమె తట్టుకోలేకపోయింది.
ఒక సీనియర్ జర్నలిస్టు తనను.. ఈ వయసులో ఈ డ్రెస్సులేంటి అని ప్రశ్నించడంతో లక్ష్మికి చాలా కోపం వచ్చింది. ఆ ఇంటర్వ్యూలోనే సదరు జర్నలిస్టుకు దీటుగా సమాధానం చెప్పారు. ఇదే ప్రశ్న ఒక హీరోను అడగ్గలరా అంటూ.. మహిళల పట్ల సొసైటీతో పాటు సినిమా ఇండస్ట్రీ ఎంత వివక్షతో వ్యవహరిస్తుందో ఆవేదన స్వరంతో చెప్పింది లక్ష్మి.
ఐతే అంతటితో వ్యవహారం అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ మంచు లక్ష్మి ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా విడిచిపెట్టేయాలని అనుకోవట్లేదు. ఫిలిం జర్నలిస్టులెవ్వరూ ఇలాంటి ప్రశ్నలు అడక్కుండా ఒక పాఠం నేర్పాలనుకున్నారు. అందుకే ఆ జర్నలిస్టు మీద ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారు. అంతేకాక మహిళా కమిషన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తున్నారు. ఈ విషయమై లక్ష్మి ఇప్పటికే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. తనకు ఆ జర్నలిస్టు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఐతే అటు నుంచి స్పందన లేకపోవడంతో మంచు లక్ష్మి మరింత సీరియస్ అయ్యారు. తన వ్యాఖ్యల పట్ల కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం, పైగా ఈ వివాదం వల్ల ఇంటర్వ్యూ వైరల్ అయింది కదా అంటూ మాట్లాడడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ అంశం మీద ఒక ప్రధాన పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మంచు లక్ష్మి. యూట్యూబ్ ఛానెళ్లు ఇంటర్వ్యూల పేరుతో సినీ జనాల పట్ల ఎలా వ్యవహరిస్తారో ఆమె వివరంగా మాట్లాడారు. ఫిలిం ఛాంబర్ నుంచి ఇంకా స్పందన లేదని.. వాళ్లీ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూస్తానని ఆమె వ్యాఖ్యానించారు.