నాది కాని ఇల్లును నేను ఎలా అమ్ముతాను : మంచు లక్ష్మి
మంచు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఈ ఏడాదిలో విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమా వచ్చింది.;
మంచు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఈ ఏడాదిలో విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమా వచ్చింది. ఆ సినిమాకు మంచి స్పందన వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో మంచు మోహన్ బాబు సైతం నటించాడు. ఆ సినిమాతో ఖచ్చితంగా మంచు ఫ్యామిలీ చాలా హ్యాపీ అయ్యి ఉంటుంది. ఇటీవల మంచు మనోజ్ తన లాంగ్ బ్రేక్ కు కమ్ బ్యాక్ అన్నట్లుగా మిరాయ్ సినిమాతో వచ్చాడు. హీరోగా కాకుండా విలన్‌గా మంచు మనోజ్ అదరగొట్టాడు. మంచు ఫ్యాన్స్‌కి ఖచ్చితంగా మిరాయ్ లో మనోజ్ నచ్చి ఉంటాడు. మనోజ్, విష్ణు గొడవల గురించి ఇన్నాళ్లు మాట్లాడుకున్న జనాలు ఇప్పుడు వారి సినిమాల గురించి మాట్లాడుకున్నారు. ఇక ముంబై వెళ్లి పోయిన మంచు లక్ష్మి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. తన కొత్త సినిమా 'దక్ష' తో మంచు లక్ష్మి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
మంచు లక్ష్మి దక్ష మూవీ సెప్టెంబర్ 19
'దక్ష' సినిమా గురించి ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉంచుతూ వచ్చిన మంచు లక్ష్మి సడెన్‌గా తన సినిమా సెప్టెంబర్ 19న అంటూ అధికారికంగా ప్రకటించి సర్‌ప్రైజ్ చేసింది. సినిమా ప్రారంభించి చాలా కాలం అయినా ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా సినిమాను లేట్ చేస్తూ వచ్చాను అని, డబ్బులు ఉన్నప్పుడు చేస్తూ వచ్చాను అంది. మంచు లక్ష్మి ముంబై వెళ్లి పోయిన సమయంలో హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ ఇంటిని మంచు లక్ష్మి అమ్మేసింది అనే వార్తలు వచ్చాయి. ఆ ఇంటిని మంచు లక్ష్మి అమ్మేసి ముంబైలో సొంత ఇంటిని కొనుగోలు చేసిందని కూడా కొందరు అన్నారు. మొత్తానికి మంచు లక్ష్మి ఇంటి గురించి ఆ సమయంలో ప్రముఖంగా చర్చ జరిగింది. అప్పుడు మంచు లక్ష్మి మీడియా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు దక్ష సినిమా కోసం వచ్చింది. కనుక ఇప్పుడు ఆ ఇంటి మ్యాటర్‌పై క్లారిటీ ఇచ్చింది.
ఫిల్మ్ నగర్ ఇంటి పుకార్లపై మంచు లక్ష్మి క్లారిటీ
తాజాగా దక్ష సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ... హైదరాబాద్‌లో తాను ఇల్లు అమ్మాను అంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. అసలు నాకు అంటూ సొంత ఇల్లు ఉంటే కదా నేను అమ్మడానికి. నేను ఫిల్మ్ నగర్‌లో ఉన్న ఇల్లు నా తండ్రిది. ఆయన నాకు ఉండేందుకు మాత్రమే ఇచ్చాడు. ఆయన ఆస్తిని నేను ఎలా అమ్మగలను. ముంబై వెళ్లి పోయిన సమయంలో ఆ ఇంటిని వదిలేశాను. ఆ ఇంటి గురించి ఏ విషయాలు తెలియాలి అన్నా నాన్నను అడగాల్సిందే అన్నారు. తనకు ముంబైలో సొంత ఇల్లు లేదని, అక్కడ ఉంటున్న ఇంటికి అద్దె చెల్లించేందుకే చాలా ఇబ్బంది పడుతున్నాను అంటూ నవ్వేసింది. నాన్నను డబ్బులు అడగలేను, నా సొంతంగా నేను షో లు చేసుకుంటూ, సినిమాలు చేస్తూ సంపాదించుకుంటున్నాను అంది.
దక్ష మూవీలో మోహన్ బాబు కీలక పాత్ర
ఈ సినిమా కథను నాన్న నా వద్దకు పంచించాడు. ఆయన మొదటి సారి ఒక సినిమా కథ పంపించడంతో చాలా ఎగ్జైట్ అయ్యాను. సినిమా కథ విన్న తర్వాత తప్పకుండా చేయాలి అనుకున్నాను. నేను సినిమా కోసం చాలా కష్టపడ్డాను. పోలీస్ ఆఫీసర్‌గా సినిమాను చేయడం అంత ఈజీ పని కాదు. ఈ సినిమాను సొంతంగా నిర్మించడంకు కారణం కథపై ఉన్న నమ్మకం. తప్పకుండా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేసింది. ఈ సినిమాలో మోహన్ బాబు ఉన్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ స్టఫ్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఆకట్టుకునే కథతో పాటు పాత్రలు తప్పకుండా మెప్పిస్తాయి అంటూ మంచు లక్ష్మి చెప్పింది. ఈ సినిమా మొత్తం కూడా నాన్న గారు ఉంటారు అని సినిమాపై మంచు లక్ష్మి ఆసక్తి పెంచింది. ఈనెల 19న రాబోతున్న దక్ష సినిమా ఎలా ఉంటుందో చూడాలి.