మాలీవుడ్ ఫిలింపాలసీ టాలీవుడ్‌లో అమలు చేస్తారా?
ఆన్ లొకేషన్ మహిళా ఆర్టిస్టులను వేధించడం లేదా సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేయడం వంటివి నేరం.;
ఆన్ లొకేషన్ మహిళా ఆర్టిస్టులను వేధించడం లేదా సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేయడం వంటివి నేరం. మహిళా ఆర్టిస్టులకు రక్షణ కల్పించడం, భద్రతను ఇవ్వడం నిర్మాతల బాధ్యత. మాలీవుడ్ అవ్యవస్థపై జస్టిస్ హేమ కమిటీ ఎన్నో సంచలన విషయాలను బయటపెట్టిన సంగతిని మరువలేం. మలయాళ ప్రముఖ కథానాయికపై లైంగిక దాడి అనంతరం జస్టిస్ హేమ కమిటీ కొన్నేళ్ల పాటు పరిశోధించి భయానక నిజాలెన్నిటినో బయటపెట్టింది.
ఇప్పుడు అత్యంత కీలకమైన ``కేరళ ఫిలిమ్ పాలసీ కాన్ క్లేవ్``లో వీటన్నిటికీ పరిష్కారాలపై చర్చించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్, మాలీవుడ్ సూపర్‌స్టార్ మోహన్ లాల్ సహా పలువురు సినీరాజకీయ దిగ్గజాలు కొలువు తీరిన చోట నూతన ఫిలింపాలసీ గురించి చర్చ సాగింది. ఈ చర్చల్లో పని చేసే చోట సమగ్రతను ప్రోత్సహించడం, భద్రత, ఉపాధి చట్టాలు, పని గంటలు, చట్టపరమైన రక్షణల గురించి చర్చించారు. పని ఓవర్‌లోడ్ , ఉద్యోగ భద్రతపైనా ఆసక్తికరచర్చ సాగింది. ఫిర్యాదుల పరిష్కార బృందాల్లో మేల్- ఫీమేల్ సమ ప్రాతినిధ్యం, ఆన్‌లైన్ ద్వేషం, సైబర్ దాడులకు వ్యతిరేకంగా చట్టపరమైన రక్షణ వంటి అంశాలను చర్చా సమావేశంలో ప్రస్థావించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సమీక్షా సమావేశాన్ని అభినందించారు. పరిశ్రమలో తక్షణం కొత్త ఫిలింపాలసీ అమలు చేయాలని కోరారు.
పాలసీలో కొన్ని కీలకంగా చర్చకు వచ్చిన విషయాలను పరిశీలిస్తే, సినిమా సెట్లలో వివక్ష లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ వంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. తప్పు చేసిన వారిని క్షమించకూడదు. అధికార దుర్వినియోగాన్ని నిషేధించాలి. కాస్టింగ్ కౌచ్ ను పూర్తిగా ఆపాలి. వేధింపులకు పాల్పడే వారిని పరిశ్రమ నుంచి పూర్తిగా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడే మహిళలకు సాటి వారితో పాటు, పరిశ్రమ మద్దతు అందించాలి.
ఆడిషన్స్ విషయంలో పారదర్శక ప్రోటోకాల్ ను అమలు చేయాలి. మంచి టాయిలెట్లను మెయింటెయిన్ చేయడం, స్త్రీలకు రిలాక్స్ అయ్యేందుకు విశ్రాంతి గదులు లేదా ప్రాంతాలను ఏర్పాటు చేయడం అవసరం. వారికోసం ఆఫీస్ తరహాలో సౌకర్యాలు సెట్ లో ఉండాలి. సెట్స్ లో POSH (లైంగిక వేధింపుల నివారణ) చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. సైబర్ పోలీసుల పరిధిలో ఒక ప్రత్యేక యాంటీ పైరసీ సెల్ ఏర్పాటు చేయాలి. సైబర్ దాడులను ఆపాలి. చిత్రసీమలో అవకాశాల కోసం వచ్చే వారికి సరైన మార్గదర్శనం అవసరం. వారికి మద్దతు ఇవ్వడానికి మెంటర్‌షిప్ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి.... ఇలాంటి ఎన్నో నియమనిబంధనల్ని మాలీవుడ్ ఫిలింపాలసీలో చేర్చారు. ఇవే నియమాలను టాలీవుడ్ లోను అమలు చేస్తారా లేదా! అన్నది వేచి చూడాలి.