ఆశలన్నీ ప్రభాస్‌ మీదే పెట్టుకుంది...!

మలయాళి ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలంకు పైగా అయింది.;

Update: 2025-09-09 06:33 GMT

మలయాళి ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలంకు పైగా అయింది. అయితే ఇప్పటి వరకు ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా విజయాలను ఈమె సొంతం చేసుకోలేక పోయింది. హీరోయిన్‌గా ఈమె చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలను అందించడంలో విఫలం అవుతున్నాయి. గత ఏడాది ఈమె నటించిన తంగలన్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఫలితం తారుమారు అయింది, అంతే కాకుండా ఆ సినిమాలో ఈమె పోషించిన పాత్ర కారణంగా అసలు ఉందా లేదా అన్నట్లుగా కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం మాళవిక మోహనన్‌ చేతిలో అరకొర సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందులో ప్రభాస్‌తో నటిస్తున్న రాజాసాబ్‌ ఒకటి అనే విషయం తెల్సిందే.

ప్రభాస్‌ రాజాసాబ్‌ మూవీలో ముగ్గురు ముద్దుగుమ్మలు

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ముగ్గురు హీరోయిన్స్‌లో ఒక హీరోయిన్‌గా మాళవిక మోహనన్‌ నటిస్తోంది. ఇప్పటికే ఈమె పార్ట్‌ షూటింగ్‌ పూర్తి అయిందని సమాచారం. రాజాసాబ్‌ ఈ ఏడాది ఆరంభంలో విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. మొదట ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల షూటింగ్‌ ఆలస్యం అయింది, ఆ తర్వాత వీఎఫ్ఎక్స్ కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. ఈమధ్య కాలంలో ఎక్కువ సినిమాలు వీఎఫ్‌ఎక్స్‌ ఆలస్యం కారణంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై ఆశలు పెట్టుకుని మాళవిక మోహనన్‌ ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ఆమె ఈ సినిమా విడుదల తర్వాతే తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తుందట.

టాలీవుడ్లో మాళవిక మోహన్‌ ఎంట్రీ

హీరోయిన్‌గా మాళవిక మోహన్‌ కి తెలుగులో మంచి ఎంట్రీ అని అంతా భావించారు. కానీ రాజాసాబ్‌ సినిమా ఆలస్యం కావడం వల్ల ఆమెకు ఎంత వరకు కలిసి వస్తుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజాసాబ్‌ సినిమా విడుదలకు ముందే తమ సినిమాలో నటించాలి అంటూ పలువురు తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ మాళవికను సంప్రదించారట. కానీ ఆమె మాత్రం ఇప్పటి వరకు తెలుగులో మరే సినిమాకు ఓకే చెప్పలేదు. రాజాసాబ్‌ సినిమా తర్వాత టాలీవుడ్‌లో తన క్రేజ్‌ అమాతం పెరగడం ఖాయం. కనుక అప్పుడు మంచి సినిమాల్లో ఆఫర్లు వస్తాయి అనే నమ్మకంతో ఆమె ఉంది. అందుకే ఆమె కొత్త సినిమాలను ఒప్పుకోవడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కార్తీతో కలిసి సర్దార్‌ 2 మూవీలో

ఇటీవల ఈమె మలయాళ మూవీ హృదయపూర్వక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. పైగా ఆ సినిమా వల్ల మలయాళంలో ఈమెకు చేతి వరకు వచ్చిన ఆఫర్‌ సైతం కోల్పోవాల్సి వచ్చింది అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. రాజాసాబ్‌ పూర్తి చేసిన మాళవిక మోహనన్ మరో వైపు సర్దార్‌ 2 సినిమాలో నటిస్తోంది. కార్తీ హీరోగా నటిస్తున్న ఆ తమిళ మూవీలో ఈమె ఏ మేరకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించబోతుంది అనే విషయంలో క్లారిటీ లేదు. తమిళనాట ఈ అమ్మడికి ఉన్న గుర్తింపు నేపథ్యంలో అక్కడ నుంచి వరుస సినిమాలు వస్తాయని అంతా భావించారు. కానీ ఆమెకు అక్కడ కూడా పెద్దగా ఆఫర్లు వస్తున్నట్లుగా లేవు. అందుకే ప్రస్తుతం చేతిలో సర్దార్‌ 2 సినిమా మాత్రమే ఉంది. టాలీవుడ్‌లో ఈమె మరిన్ని సినిమాలు చేయాలి అంటే రాజాసాబ్‌ హిట్‌ కావాల్సిందే. మరి మాళవిక పెట్టుకున్న ఆశలు ఎంత వరకు రాజాసాబ్‌ సినిమా నిలబెడుతుంది అనేది చూడాలి.

Tags:    

Similar News