'వారణాసి' స్టోరీ..ఇదే నిజమైతే రికార్డుల మోతే!
సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ యాక్షన్ టైమ్ ట్రావెల్ మూవీ `వారణాసి`.;
సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ యాక్షన్ టైమ్ ట్రావెల్ మూవీ `వారణాసి`. జక్కన్న అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఇందులో మహేష్ రుద్రగా, శ్రీరాముడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
ప్రస్తుతం పృధ్వీరాజ్ సుకుమార్‌కు సంబంధించిన కీలక పోర్షన్ షూటింగ్ పూర్తి కావడంతో తను రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం మహేష్‌పై కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. ఇందు కోసం హైదరాబాద్‌లో వారణాసిని తలపించే సెట్‌ని నిర్మించడం తెలిసిందే. అక్కడే పలు కీలక సన్నివేశాలని షూట్ చేస్తున్నారని తెలిసింది. ఫస్ట్ గ్లింప్స్‌తో సంచలన సృష్టించిన `వారణాసి`కి సంబంధించిన ప్రతి విషయాన్ని జక్కన్న సీక్రెట్‌గా ఉంచుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ లీక్ కాకూడాదని జాగ్రత్తలు పడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం పని చేస్తున్న వీఎఫ్ ఎక్స్ సంస్థ `వారణాసి` కథని సంక్షిప్తంగా తన వెబ్ సైట్‌లో షేర్ చేసింది. దీనిపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వారణాసి టైమ్ ట్రావెల్ మూవీ అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే వీఎఫ్ ఎక్స్ సంస్థ `వారణాసి` స్టోరీపై ఆసక్తికర పోస్ట్‌ని వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. శివభక్తుడైన రుద్ర కాలాన్ని సైతం అధిగమించే ఒక ప్రమాదకర యాత్రకు బయలుదేరతాడు. అతడి లక్ష్యం అపారమైన శక్తి కలిగిన ప్రస్తుతం కనిపించకుండా పోయిన ఓ విశ్వ కళాఖండం, ఆభరణాన్ని కనుగునే ప్రయత్నం.
ఈ క్రమంలో శతాబ్దాలుగా మరుగున పడిన ప్రాచీన రహస్యాలను ఒకదానితో ఒకటి జోడించుకుంటూ ముందుకు సాగుతాడు. అప్పుడే ఈ మిషన్ వెనకున్న అసలు నిజాన్ని గ్రహిస్తాడు. తనని ఈ దిశగా నడిపించిన శక్తి,కుట్రలు, కుతంత్రాల మేధావి (పృథ్వీరాజ్ సుకుమారన్) గురించి తెలుసుకుంటాడు. ప్రపంచంపై సంపూర్ణ ఆధిపత్యాన్ని శాస్వతంగా స్థాపించాలనే దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తి ఎవరో తెలిసిన తరువాత ఆ శివ భక్తుడు తీసుకున్న నిర్ణయం ఏంటీ?..విశ్వాసాన్ని సైతం శాసించే శక్తి దుష్టుల పాలు కాకుండా ఎలా అడ్డుకున్నాడు? ` అంటూ వీఎఫ్ఎక్స్ కంపనీ తన వెబ్ సైట్‌లో పోస్ట్ చేసింది.
దీంతో ఈ సంక్షిప్త కథ నెట్టింట ట్రెండ్ అవుతూ చర్చనీయాంశంగా మారింది. ఇదే నిజమైతే వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమనే సంకేతాలు, కామెంట్‌లు వినిపిస్తున్నాయి. రాజమౌళి తను రూపొందించే సినిమాల కథలని ముందే రివీల్ చేసినా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాల్ని సొంతం చేసుకున్న సందర్బాలున్నాయి. `వారణాసి` స్టోరీ బయటికి వచ్చేసినా కథనంతో మ్యాజిక్ చేయడంలో రాజమౌళి మాస్టర్ అన్న విషయం తెలిసిందే. అదే తరహాలో వారణాసి స్టోరీ బయటికి వచ్చేసినా తనదైన శైలిలో అబ్బుర పరిచే స్థాయిలో కథనాన్ని నడిపించి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తాడని అబిమానులు, సినీ ప్రియులు చెబుతున్నారు.