మహేష్ రాజమౌళి ఫైట్ సీన్.. క్రేజీ వీడియో!
అయితే ఇది నిజమైన వీడియో కాదు, 'Seedance 2.0' అనే అత్యాధునిక AI టూల్ ద్వారా క్రియేట్ చేసిన వీడియో.;
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక భారీ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సగానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవబోతోంది.
ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. జక్కన్న విజన్‌కు తగ్గట్టుగా మహేష్ బాబును గతంలో ఎన్నడూ చూడని సరికొత్త లుక్‌లో ఈ సినిమా కోసం సిద్ధం చేశారు. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ విజువల్ ఎఫెక్ట్స్‌తో 2027 ఏప్రిల్ 7న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మహేష్ బాబు, రాజమౌళికి సంబంధించిన ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఒక కాఫీ షాప్ బ్యాక్‌డ్రాప్‌లో వీరిద్దరూ ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని సినిమాటిక్ తరహాలో కొట్టుకుంటున్నట్లు ఆ విజువల్స్ ఉన్నాయి. మహేష్ బాబు సీరియస్ లుక్‌తో రాజమౌళిపై దాడి చేయడం, ఇద్దరి మధ్య ఫైట్ సీన్ రియలిస్టిక్‌గా ఉండటం చూసి నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అయితే ఇది నిజమైన వీడియో కాదు, 'Seedance 2.0' అనే అత్యాధునిక AI టూల్ ద్వారా క్రియేట్ చేసిన వీడియో. ఈ వీడియోను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది నిమిషాల్లో వైరల్ అయిపోయింది. "సినిమా చనిపోయింది" అంటూ ఆయన ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న మ్యాజిక్ ని గుర్తుచేశారు. సాధారణంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసే వర్మ, ఈసారి మహేష్ రాజమౌళిల ఫేక్ ఫైట్ సీన్‌తో అందరినీ సర్ప్రైజ్ చేశారు.
ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబుకు ప్రతి ఏటా సమ్మర్ వెకేషన్‌కు వెళ్లడం అలవాటని, బహుశా రాజమౌళి షూటింగ్ నుండి పర్మిషన్ ఇవ్వలేదని ఇలా ఫైట్ చేస్తున్నారేమో అని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే రాజమౌళి షూటింగ్ సెట్‌లో ఇచ్చే టార్చర్ భరించలేక మహేష్ ఇలా సీరియస్ అయ్యారని జోకులు పేలుస్తున్నారు.
AI టెక్నాలజీ ఎంతలా ఎదిగిందంటే, మొదటిసారి చూసిన ఎవరైనా ఇది నిజంగా జరిగిన ఘటనే అని నమ్మేలా ఆ విజువల్స్ ఉన్నాయి. టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఇలాంటి వినూత్నమైన ప్రయోగాలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఒకవైపు 'వారణాసి' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తుంటే, మరోవైపు ఇలాంటి ఫేక్ AI వీడియోలు సినిమాపై ఉన్న బజ్‌ను మరింత పెంచుతున్నాయి.