రవితేజ ఫ్యామిలీ హీరో మూవీ అప్డేట్..!
తాజాగా రవితేజ తమ్ముడు రఘు తనయుడు సైతం ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్న విషయం తెల్సిందే. రఘు తనయుడు మాధవ్ రాజ్ భూపతిని హీరోగా పరిచయం చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటన వచ్చింది.;
టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన హీరోలు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ జనరేషన్‌కి తెలిసిన హీరోల్లో చిరంజీవి, రవితేజ, నానిలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్‌డం దక్కించుకున్నారు. చిరంజీవిపై అభిమానంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రవితేజ ఆయనతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించాడు. వీళ్లు సొంతంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, వీరి ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇండస్ట్రీలోకి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా అడుగు పెట్టారు. రవితేజ దారిలోనే ఆయన తమ్ముళ్లు సైతం టాలీవుడ్‌లో అడుగు పెట్టిన విషయం తెల్సిందే.
తాజాగా రవితేజ తమ్ముడు రఘు తనయుడు సైతం ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్న విషయం తెల్సిందే. రఘు తనయుడు మాధవ్ రాజ్ భూపతిని హీరోగా పరిచయం చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటన వచ్చింది. మాధవ్ హీరోగా సినిమా ప్రారంభం అయ్యి చాలా రోజులు అయింది. కొన్ని కారణాల వల్ల మాధవ్ నటించిన మొదటి సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా కాకుండా మాధవ్ మరో సినిమాను చేశాడు. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది. మాధవ్ హీరోగా నాగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమాకు 'మారెమ్మ' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. జులై చివరి వరకు సినిమా ఫస్ట్ కాపీ రెడీ కాబోతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ఫస్ట్‌లుక్‌తో పాటు, టైటిల్ గ్లిమ్స్‌ను రేపు విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. మారెమ్మ అనే టైటిల్ తో మాస్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పెద్దనాన్న రవితేజ ఆశీర్వాదం మాధవ్ రాజ్ భూపతికి ఖచ్చితంగా ఉంటుంది. కనుక మారెమ్మ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఏదో ఒక సారి, ఏదో ఒక సమయంలో రవితేజ ఖచ్చితంగా స్టేజ్ పై కనిపించే అవకాశాలు ఉన్నాయి, తమ ఫ్యామిలీ హీరో అంటూ రవితేజ ఖచ్చితంగా మాధవ్ ను పరిచయం చేయాల్సిందే అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. మాధవ్ చూడ్డానికి చాలా బాగుంటాడని, అతడికి మంచి హిట్స్ పడితే, మంచి కథలు పడితే ఖచ్చితంగా పెద్దనాన్న మాదిరిగా ఇండస్ట్రీలో స్టార్ డం దక్కించుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు. మరి అతడితో సినిమాలు చేసేందుకు ముందు ముందు ఏ దర్శక నిర్మాతలు ముందుకు వస్తారు అనేది చూడాలి.