మూవీ రివ్యూ : మదరాసి

రమణ.. గజిని.. తుపాకి.. కత్తి లాంటి చిత్రాలతో ఒకప్పుడు బ్లాక్ బస్టర్లు కొట్టి సౌత్ ఇండియన్ సినిమాలో ఒక వెలుగు వెలిగాడు మురుగదాస్.;

Update: 2025-09-05 13:54 GMT

‘మదరాసి’ మూవీ రివ్యూ

నటీనటులు: శివ కార్తికేయన్- రుక్మిణి వసంత్- విద్యుత్ జమ్వాల్- బిజు మీనన్- విక్రాంత్- షబీర్ కల్కరక్కల్ తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: సుదీప్ ఎలమాన్

నిర్మాణం: శ్రీ లక్ష్మీ మూవీస్

రచన-దర్శకత్వం: మురుగదాస్

రమణ.. గజిని.. తుపాకి.. కత్తి లాంటి చిత్రాలతో ఒకప్పుడు బ్లాక్ బస్టర్లు కొట్టి సౌత్ ఇండియన్ సినిమాలో ఒక వెలుగు వెలిగాడు మురుగదాస్. కానీ గత దశాబ్ద కాలంలో ఆయనకు అన్నీ చేదు అనుభవాలే మిగిలాయి. ఇప్పుడాయన సూపర్ ఫామ్ లో ఉన్న శివ కార్తికేయన్ కథానాయకుడిగా ‘మదరాసి’ చిత్రాన్ని రూపొందించాడు. మరి ఈ చిత్రంతో మురుగదాస్ మళ్లీ తన ముద్రను చూపించాడా? సక్సెస్ కోసం ఆయన నిరీక్షణ ఫలించిందా? చూద్దాం పదండి.

కథ:

రఘు (శివ కార్తికేయన్) ఒక అనాథ. 14 ఏళ్ల వయసులోనే ఒక ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన అతను.. ఆ షాక్ లో మానసిక సమస్యలు ఎదుర్కొంటాడు. ఎవరు సమస్యలో ఉన్నా వాళ్లను తన కుటుంబ సభ్యులుగా భావించి సాయం చేస్తుంటాడు. ఈ గుణం చూసి మాలతి (రుక్మిణి వసంత్) అతణ్ని ప్రేమిస్తుంది. అతనూ ఆమె ప్రేమలో పడతాడు. కానీ ఉన్నట్లుండి రుక్మిణి రఘును వదిలేసి వెళ్లిపోతుంది. అదే సమయంలో గన్ స్మగ్లింగ్ చేసే ఒక మాఫియాను అడ్డుకోవడానికి పోలీసులు రఘును పావుగా ఉపయోగించుకోవాలనుకుంటారు. మరి మాలతికి దూరమైన రఘు.. ఈ మిషన్లో భాగం అయ్యాడా.. ఆ మాఫియాను ఢీకొట్టి అతను పోలీసులు చేపట్టిన మిషన్ విజయవంతం చేశాడా.. మాలతిని తిరిగి కలిశాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఒకప్పుడు శంకర్ తరహాలోనే సామాజికాంశాలతో ముడిపడ్డ కథలను కమర్షియల్ గా వర్కవుట్ చేయడంలో మురుగదాస్ కు తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉండేది. అందుకు ర‌మ‌ణ‌.. క‌త్తి లాంటి చిత్రాలు ఉదాహ‌ర‌ణ‌. అదే సమయంలో అప్పుడప్పుడూ ఏదో ఒక యునీక్ పాయింట్ తీసుకుని దానికి యాక్షన్.. ఎంటర్టైన్మెంట్ జోడించి వావ్ అనిపించేవాడు. గ‌జిని.. తుపాకి లాంటి సినిమాలు ఈ కోవ‌లోనివే. కానీ ‘స్పైడర్’ నుంచి ఆయన కథలేవీ వర్కవుట్ కాలేదు. ఏ త‌ర‌హా క‌థ ట్రై చేసినా త‌న ముద్ర‌ను చూపించ‌లేక‌పోతున్నాడు. సినిమా సినిమాకూ టచ్ కోల్పోతూ.. ఎలాంటి దర్శకుడికైనా ఒక దశలో పతనం తప్పదని రుజువు చేశాడు మురుగదాస్. ఇక మునుపటి మురుగదాస్ ను మళ్లీ చూడలేమనుకున్న దశలో ‘మదరాసి’తో తన ఒకప్పటి సిగ్నేచర్ చూపించడానికి కొంచెం సిన్సియ‌ర్ గానే ప్ర‌య‌త్నించాడు మురుగ. కానీ పాత మురుగ అలా వ‌స్తూ పోతూ ఉంటాడు త‌ప్ప‌.. క‌న్సిస్టెన్సీ మాత్రం క‌నిపించ‌దు. ఏదో ప్ర‌త్యేకంగా చూడ‌బోతున్నామ‌నే కాస్త ఆశ‌లు రేగ‌డం.. అంత‌లోనే నిట్టూర్పు ఆవ‌హించ‌డం.. ఇలా ఎత్తుప‌ల్లాల‌తో సాగే సినిమా.. మ‌ద‌రాసి. స్థూలంగా చెప్పాలంటే మురుగ‌దాస్ గ‌త చిత్రాల‌తో పోలిస్తే ఇది బెట‌ర్ కానీ.. ఆయ‌న ప్రైమ్ సినిమాల‌ను మాత్రం మ్యాచ్ చేయ‌లేక‌పోయింది.

త‌న ఫిల్మోగ్ర‌ఫీలో చాలా స్పెష‌ల్ అన‌ద‌గ్గ తుపాకీ-గ‌జినీ చిత్రాల‌నే స్ఫూర్తిగా తీసుకుని.. వాటి నుంచి ఒక మిక్చ‌ర్ పొట్లం లాంటి సినిమా తీయ‌డానికి ప్ర‌య‌త్నించాడు మ‌ద‌రాసిలో మురుగ‌దాస్. ఒక క్రైమ్ రాకెట్.. దాన్ని న‌డిపించే ప‌వ‌ర్ ఫుల్ విల‌న్.. అత‌ను చేప‌ట్టిన ప్ర‌మాద‌క‌ర మిష‌న్ ను ఆప‌డానికి పోలీసుల చేతిలో ఆయుధంలా మారిన హీరో. అత‌డికో మాన‌సిక స‌మ‌స్య‌.. ఇదీ బేసిక్ స్టోరీ. హీరోకు ఉన్న మాన‌సిక స‌మ‌స్య చుట్టూ కొంచెం కొత్త‌గా స‌న్నివేశాలు న‌డిపించ‌డానికి ప్ర‌య‌త్నించాడు మురుగ‌దాస్. అలాగే త‌మిళ‌నాడులో సామాన్యుల చేతుల్లోకి తుపాకీలు ఇచ్చి గ‌న్ క‌ల్చ‌ర్ పెంచాల‌ని చూసే సిండికేట్.. దాని చుట్టూ సెట‌ప్ కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఈ రెండు పాయింట్ల మీద న‌డిపించిన కొన్ని ఎపిసోడ్లు ప్రేక్ష‌కుల‌ను ఎంగేజ్ చేస్తాయి. కానీ హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ మాత్రం తేలిపోయింది. మామూలుగా సినిమాల్లో హీరోలు ఎవ‌రికో సాయం చేయ‌డం కోసం గొడ‌వ‌ల‌కు వెళ్తే హీరోయిన్లు అడ్డం ప‌డుతుంటారు. వాళ్ల‌కు దూరం అయిపోతుంటారు. కానీ ఇక్క‌డ మాత్రం హీరో అలా సాయం చేయ‌డానికి తాను అడ్డు అనుకుని హీరోయిన్ అత‌డికి దూరం అవుతుంది. ఇది కొత్త‌ద‌నం అని మురుగ‌దాస్ అనుకున్నాడేమో కానీ.. అదంత లాజిక‌ల్ గా అనిపించ‌దు. దీని మీదే క‌థ మ‌లుపు తిర‌గ‌డంతో అది స‌హ‌జంగా అనిపించ‌క క‌థ గాడి త‌ప్పిన ఫీలింగ్ క‌లుగుతుంది.

హీరో మిష‌న్ మొద‌లుపెట్టక ముందు వ‌ర‌కు ఇంట్రెస్టింగ్ గా అనిపించే మ‌ద‌రాసి.. ఆ త‌ర్వాత మాత్రం అంత ఎంగేజింగ్ గా అనిపించ‌దు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో క‌థ పెద్ద‌గా ముందుకు క‌ద‌ల‌క‌.. రిపిటీటివ్ గా అనిపించే స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష త‌ప్ప‌దు. అంత పెద్ద విల‌న్ సింపుల్ గా హీరో చేతికి దొరికిపోవ‌డంతో ఆ పాత్ర బ‌లం త‌గ్గిపోయింది. ఆ త‌ర్వాత క‌థ అనేక మ‌లుపులు తిరుగుతున్నా.. ఉత్కంఠ మాత్రం క‌నిపించ‌దు. హీరో పాత్రతో కొన్ని విచిత్ర విన్యాసాలు చేయించాల‌ని చూసిన సన్నివేశాల వ‌ర‌కు ఓకే అనిపించినా.. మిగ‌తా వ్య‌వ‌హారమంతా బోరింగ్ గా అనిపిస్తుంది. లాజిక్కులు లేని సీన్లు మ‌ద‌రాసి గ్రాఫ్ ను అంత‌కంత‌కూ త‌గ్గించేస్తాయి. ఓవైపు తుపాలు బాంబుల మోత‌.. ఇంకోవైపు యాక్ష‌న్ సీక్వెన్సుల‌తో ద్వితీయార్ధం గంద‌ర‌గోళంగా అనిపిస్తుంది. ప‌తాక స‌న్నివేశాలు ఓ మోస్త‌రుగా అనిపిస్తాయి. తుపాకి సినిమాలో మాదిరి విల‌న్ బ‌లంగా ఉండుంటే.. హీరో పాత్ర‌కు కూడా ఎలివేష‌న్ ఉండేది. అందులోనూ అక్క‌డా ఇక్క‌డా విల‌న్ విద్యుతే కావ‌డంతో తేడా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ప్ర‌థ‌మార్ధంలో ఉన్నట్లు క‌థ‌లు మ‌లుపులు లేక‌పోవ‌డం.. విల‌న్ పాత్ర వీకైపోవ‌డం.. లాజిక్కులు లేని స‌న్నివేశాల వ‌ల్ల సెకండాఫ్ లో మ‌ద‌రాసి స్థాయి త‌గ్గి చివ‌రికి సోసో సినిమాగా మిగిలిపోయింది. మొత్తంగా చూస్తే శివ కార్తికేయన్ కోసం.. యాక్షన్ సన్నివేశాల కోసం అయితే మదరాసిపై ఒక లుక్ వేయొచ్చు. అంతకుమించి ఆశిస్తే కష్టం.

నటీనటులు:

శివ కార్తికేయన్ మంచి పెర్ఫార్మెర్ అని మరోసారి రుజువు చేశాడు. మానసిక సమస్యలతో పోరాడుతూ.. కొన్నిసార్లు వైల్డ్ గా ప్రవర్తించే కుర్రాడి పాత్రలో అతను చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పాత్రను.. పరిస్థితులను బట్టి అమాయకత్వాన్ని.. హింసాత్మక ప్రవృత్తిని సరిగ్గా చూపించాడు. యాక్షన్ ఎపిసోడ్లలో శివ అదరగొట్టాడు. హీరోయిన్ రుక్మిణి వసంత్ కు కథలో కీలక పాత్రే దక్కింది. ఆమె అందంతో.. నటనతో ఆకట్టుకుంది. విలన్ విద్యుత్ జమ్వాల్ క్యారెక్టర్ తుపాకీ స్థాయిలో లేదు. తన పరిధిలో అతను బాగానే నటించాడు. మరో విలన్ షబీర్ మెప్పించాడు. బిజు మీనన్ స్థాయికి తగ్గ పాత్రను మురుగదాస్ డిజైన్ చెయ్యలేదు. మిగతా నటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

అనిరుధ్ మ్యూజిక్ మీద ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే కష్టమే. తన పాటల్లో ఏదీ అంత కిక్ ఇవ్వదు. తన మార్కు మిస్ అయింది. బీజీఎం విషయంలోనూ అనిరుధ్ తనకున్న పేరును ఇందులో నిలబెట్టలేక పోయాడు. హీరో థీమ్ మ్యూజిక్ బావున్నా మిగతా స్కోర్ అంతా మామూలుగా అనిపిస్తుంది. సుదీప్ ఎలమాన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. మురుగదాస్ గత చిత్రాలతో పోలిస్తే రచయితగా.. దర్శకుడిగా మెరుగైన పనితనమే చూపించాడు. ఆయన ఎంచుకున్న కథ ఆసక్తికరంగానే ఉంది. స్క్రీన్ ప్లే విషయంలోనూ కసరత్తు చేశాడు. కానీ ఒకప్పటి ఆయన చిత్రాల్లో మాదిరి ఉత్కంఠ రేకెత్తించలేక పోయాడు. ముఖ్యంగా ప్రధాన పాత్రల చిత్రణ కూడా అనుకున్నంత బలంగా లేదు. ద్వితీయార్థంలో మురుగ తన స్పార్క్ చూపించలేకపోయాడు.

చివరగా: మదరాసి.. కాస్త మెరిసి..

రేటింగ్- 2.25/5

Tags:    

Similar News