సౌండ్ కాదు బంగారం రీసౌండ్ చేయాల్సిందే!
`ఖుషి` తరువాత రెండేళ్లు విరామం తీసుకున్న సమంత తాను నిర్మించిన చిన్న సినిమా `శుభం`లో చిన్న గెస్ట్ రోల్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేసింది.;
`ఖుషి` తరువాత రెండేళ్లు విరామం తీసుకున్న సమంత తాను నిర్మించిన చిన్న సినిమా `శుభం`లో చిన్న గెస్ట్ రోల్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. పూర్తి స్థాయి పాత్రలో ఇప్పుడు `మా ఇంటి బంగారం`తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీకి సమంత నిర్మాతగానూ వ్యహరిస్తుండగా, రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రిలీజ్ డేట్ పక్కాగా చెప్పకపోయినా ఈ మూవీని మే 15న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
అప్పుడెప్పుడో టీజర్‌ని రిలీజ్ చేసిన టీమ్ ఈ మధ్యే ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేసింది. సమంత సినిమా అంటే ఉండే హడావిడి వేరుగా ఉంటంది. `ఖుషి` వరకు ఆ హడావిడీ హంగామా కనిపిచింది. కానీ `మా ఇంటి బంగారం` విషయంలో మాత్రం ఆ వాతావరణం, హంగామా ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత బాగా పబ్లిసిటీ చేస్తే సినిమా అంత వైరల్ అవుతోంది. అలాంటి పరిస్థితుల్లో `మా ఇంటి బంగారం` టీమ్ ఏంటీ ఇంత చప్పగా పబ్లిసిటీని చేస్తోందని, ఇది ఏ మాత్రం సరిపోదని రీసౌండ్ ఓ రేంజ్‌లో ఉండాలని కామెంట్‌లు సర్వత్రా వినిపిస్తున్నాయి.
టీజర్‌కు మంచి స్పందనే లభించింది కానీ ఆ స్థాయిలో రీసెంట్‌గా రిలీజ్ చేసిన పాట బజ్‌ని క్రియేట్ చేయలేకపోతోందని అంటున్నారు. ఇలా అయితే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కష్టమవుతుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంటెంట్ ఏముందన్నది కాదు ఎంత వైరల్ అయ్యేలా ప్రమోట్ చేశారన్నది మాత్రమే ఆడియన్స్ చూస్తున్నారని, అలా థియేటర్లకు వచ్చిన వారిని కంటెంట్‌తో ఆకట్టుకున్న సినిమాలే ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయని అంటున్నారు.
దీనికి తోడు మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. సమంత నుంచి సినిమా వచ్చి మూడేళ్లు అవుతోంది. ఈ మూడేళ్లలో చాలా సమీకరణాలు, ప్రేక్షకుల ఆలోచనా విధానం, కంటెంట్‌లని ఎంచుకునే తీరులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పైగా మూడేళ్ల గ్యాప్ కారణంగా సమంతపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కూడా భారీగా తగ్గిందని, ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ఆకర్షించే ప్రయత్నం చేస్తే గానీ ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయ్యే ప్రసక్తిలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
సినిమా రిలీజ్‌కు నెల రోజులు కూడా లేని నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్‌ని దూకుడుగా స్టార్ట్ చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది. నందినిరెడ్డికి డైరెక్టర్‌గా భారీ ట్రాక్ రికార్డ్ ఏమీ లేదు. సమంత తప్ప మరో క్రేజీ యాక్టర్ ఇందులో లేడు. ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రమోషన్స్ దూకుడు పెంచాలని సూచిస్తున్నారు. శ్రీముఖీ మరో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో సమంత మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసి అందరిని ఆశ్చర్యపరుస్తుందా? లేక `శాకుంతలం` తరహాలో నిరాశ పరుస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.