రిజల్ట్ తో సంబంధం లేకుండా ఛాన్సులు
కొంతమందికి ఎంత కష్టపడినా అవకాశాలు, సక్సెస్ అనేవి దరిచేరవు. కానీ కొంతమందికి మాత్రం కంటెంట్ తో సంబంధం లేకుండా ఛాన్సులు వస్తుంటాయి.;
కొంతమందికి ఎంత కష్టపడినా అవకాశాలు, సక్సెస్ అనేవి దరిచేరవు. కానీ కొంతమందికి మాత్రం కంటెంట్ తో సంబంధం లేకుండా ఛాన్సులు వస్తుంటాయి. అలాంటి వారిలో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. మా నగరం సినిమాతో డైరెక్టర్ గా సక్సెస్ అయిన లోకేష్, కార్తీతో ఖైదీ సినిమా చేసి విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు.
ఖైదీతో మంచి సక్సెస్
ఖైదీ సక్సెస్ చూసి ఏకంగా దళపతి విజయ్‌నే లోకేష్‌కు ఛాన్స్ ఇచ్చారు. విజయ్ తో మాస్టర్ సినిమా చేసి యావరేజ్ అనిపించుకున్న లోకేష్, ఈ సారి ఇంకాస్త పెద్ద ఛాన్సును కమల్ హాసన్ రూపంలో అందుకున్నారు. కమల్ తో లోకేష్ చేసిన విక్రమ్ సినిమా చాలా భారీ సక్సెస్ అవడంతో మరోసారి లోకేష్ ను నమ్మి విజయ్ అవకాశమిచ్చారు. ఈ సారి విజయ్ హీరోగా లియో సినిమా చేశారు లోకేష్.
అంచనాలను కూల్చేసిన కూలీ
భారీ అంచనాలతో వచ్చిన లియో కూడా మాస్టర్ లాగానే అనుకున్న స్థాయి కంటెంట్ ను అందించలేకపోయింది. అయినప్పటికీ లోకేష్ కు ఛాన్సులకేమీ కొదువలేదు. ఈ సారి ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ను లైన్ లో పెట్టి భారీ స్టార్ క్యాస్టింగ్ తో కూలీ సినిమా చేశారు. రిలీజ్ కు ముందు భారీ అంచనాలున్న ఈ సినిమా కూడా రిలీజయ్యాక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
కూలీ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినప్పటికీ, ఆ సినిమాతో లోకేష్ పలు విమర్శలకు గురవుతున్నప్పటికీ ఆయన వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. అందులో భాగంగానే కమల్ హాసన్, రజినీకాంత్ ఇద్దరితో ఓ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నారు లోకేష్. దాంతో పాటూ కార్తీతో ఖైదీ2 ఉండనే ఉంది. సూర్యతో రోలెక్స్ మరియు కమల్ హాసన్ తో విక్రమ్2, ఇవి కాకుండా బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తో ఓ సూపర్ హీరో ఫిల్మ్ ను కూడా లోకేష్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇవి కాకుండా ఇండియన్ సినిమాలోని పలువురు స్టార్ హీరోలతో లోకేష్ సంప్రదింపులు జరుపుతున్నారని, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా లోకేష్ కు భారీ మొత్తంలో అడ్వాన్సులు ఇచ్చిందని అంటున్నారు. ఏదేమైనా గత రెండు సినిమాలుగా కంటెంట్ పరంగా చెప్పుకోదగ్గ సక్సెస్ లేకపోయినా స్టార్ హీరోలు మాత్రం లోకేష్ కు ఛాన్సులు ఇస్తూనే ఉన్నారు. మరి లోకేష్ అంతగా ఏం చెప్పి హీరోలను ఒప్పిస్తున్నారనేది తెలీదు.