రూ.35 కోట్ల పారితోషికం... లోకేష్‌కి మాత్రమే సాధ్యం!
తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ ఇతర భాషల ప్రేక్షకులను తన విక్రమ్, ఖైదీ, లియో సినిమాలతో మెప్పించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్.;
తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ ఇతర భాషల ప్రేక్షకులను తన విక్రమ్, ఖైదీ, లియో సినిమాలతో మెప్పించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇటీవల ఈయన రజనీకాంత్ మూవీ 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విక్రమ్ సినిమా రేంజ్‌లో కూలీ ఆడుతుందని, తప్పకుండా రూ.1000 కోట్ల సినిమాగా కూలీ నిలుస్తుందని అభిమానులు ఆశ పడ్డారు. కానీ కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. సినిమాలోని భారీ స్టార్‌కాస్ట్ వసూళ్లు రాబట్టడంలో విఫలం అయింది. ఆకట్టుకోని కథ, కథనం అంటూ రివ్యూలు వచ్చాయి. కూలీ సినిమా సూపర్ హిట్ అయ్యి ఉంటే ఆమీర్ ఖాన్‌తో మూవీ ప్రారంభం అయ్యేది లేదంటే రజనీకాంత్, కమల్ హాసన్‌లతో లోకేష్ కనగరాజ్ ఒక పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీని మొదలు పెట్టేవాడు. కానీ ఆ రెండు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు అనే విషయం తెల్సిందే.
విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్...
విక్రమ్ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ స్థాయి ఒక్కసారిగా పెరిగింది. అంతే కాకుండా ఆయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు చాలా మంది హీరోలు ముందుకు వచ్చారు. కానీ కూలీ సినిమా తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయింది. ఆయనకు వచ్చిన ఆఫర్లు వెనక్కి వెళ్లి పోయాయి, దర్శకుడిగా ఆయన్ను చాలా మంది పక్కన పెట్టారు అంటూ తమిళ మీడియాలో పుంకాను పుంకాలుగా రూమర్స్ వచ్చాయి. ఒకరు ఇద్దరు హీరోలు మొదట ఓకే చెప్పి ఆ తర్వాత నో అన్నారు అంటూ వార్తలు వచ్చాయి. అజిత్ తో సినిమా అంటూ ప్రచారం జరిగింది. అంది కూడా లేదు అని తేలిపోయింది. ఇప్పుడు నటుడిగా లోకేష్ కనగరాజ్ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. దర్శకుడిగా నిరుత్సాహపరిచిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు గాను అంతా రెడీ అయింది. అతి త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఉంటుంది.
లోకేష్ కనగరాజ్ హీరోగా మూవీ...
అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డీసీ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం లోకేష్ కనగరాజ్ ఏకంగా రూ.35 కోట్ల పారితోషికంను అందుకుంటున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. నటుడిగా లోకేష్‌కి ఇది మొదటి సినిమా అనే విషయం తెల్సిందే. గతంలో ఒకటి రెండు సార్లు అలా స్క్రీన్ పై కనిపించినా, పూర్తి స్థాయి పాత్రలో నటించేది మాత్రం ఇదే మొదటి సారి. పైగా ప్రధాన పాత్రలో నటిస్తున్నది కూడా ఇదే ప్రథమం కావడంతో ఆయన సినిమాపై పెద్దగా అంచనాలు ఉండక పోవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు. కానీ నిర్మాతలు మాత్రం ఈ సినిమాలో నిర్మించేందుకు గాను రూ.35 కోట్ల పారితోషికం ఇవ్వడం ద్వారా సినిమాను దాదాపుగా రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్ మూవీగా డీసీ మేకింగ్..
హీరోగా ఇప్పటి వరకు ఒక్క సినిమాను చేయని లోకేష్ కనగరాజ్ ను హీరోగా పెట్టి మీడియం రేంజ్ బడ్జెట్ మూవీ తీయడమే నిర్మాతకు రిస్క్ అనడంలో సందేహం లేదు. అలాంటిది ఏకంగా వంద కోట్ల సినిమాను ఎలా తీస్తున్నారు అంటూ చాలా మంది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. హీరోగా మొదటి సినిమాకు ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం కేవలం లోకేష్ కనగరాజ్ కి మాత్రమే చెల్లిందని, ఈ స్థాయిలో పారితోషికం గతంలో ఏ హీరో తమ అరంగేట్ర మూవీకి తీసుకుని ఉండరు అంటున్నారు. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోల్లో చాలా మంది హీరోల యొక్క మొదటి సినిమా బడ్జెట్ కూడా రూ.35 కోట్లు ఉండి ఉండదు అనేది విశ్లేషకుల మాట. ఇప్పుడు కూడా కొత్త హీరోలు, స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తున్న సినిమాలకు ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం లేదు. ఈ ఘనత కేవలం లోకేష్ కనగరాజ్‌కి మాత్రమే దక్కిందని ఆయన సన్నిహితులు, తమిళ సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. పారితోషికం విషయమై యూనిట్ సభ్యుల నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.