భవిష్యత్తులో థియేటర్ల పరిస్థితి మరీ దారుణం..!

ఓటీటీ రాకతో మొత్తం సీన్‌ మారింది. గత ఏడు.. ఎనిమిది ఏళ్లుగా ఓటీటీ మార్కెట్‌ విపరీతంగా పెరిగింది. దాంతో థియేటర్‌లకు జనాలు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.;

Update: 2026-01-05 14:30 GMT

ఒకప్పుడు సినిమాలను కేవలం థియేటర్ల ద్వారా మాత్రమే చూసే వీలు ఉండేది. సినిమా థియేటర్లకు జనాలు పెద్ద ఎత్తున వెళ్లేవారు. కానీ కాలక్రమేనా టీవీలు వచ్చాయి. థియేటర్‌లో విడుదల అయిన సినిమాలు కొన్ని వారాలు లేదా నెలల తర్వాత టీవీల్లో టెలికాస్ట్‌ కావడం మొదలు అయింది. దాంతో థియేటర్లకు జనాలు వెళ్లడం కాస్త తగ్గింది. అయితే సినిమాలు టీవీలో చాలా వారాల తర్వాత మాత్రమే టెలికాస్ట్‌ అవుతున్న కారణంగా హిట్‌ అయిన సినిమాలను థియేటర్‌లో చూసేందుకు జనాలు ఆసక్తి చూపించారు. కొన్నాళ్ల తర్వాత సినిమాలను మించిన వినోదాన్ని టీవీల్లో వివిధ కార్యక్రమాల రూపంలో ఇవ్వడం జరిగింది. దాంతో సినిమాలకు వెళ్లడం మరింతగా తగ్గింది. థియేటర్‌కు వెళ్లే బదులు ఇంట్లోనూ కూర్చుని టీవీలో సినిమాలు మాత్రమే కాకుండా సీరియల్స్‌, షో.. ఇలా చాలా రకాలుగా వినోదాన్ని పొందవచ్చు అనే ఉద్దేశంతో ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లడం తగ్గించారు.

థియేటర్‌ వర్సెస్‌ ఓటీటీ

ఓటీటీ రాకతో మొత్తం సీన్‌ మారింది. గత ఏడు.. ఎనిమిది ఏళ్లుగా ఓటీటీ మార్కెట్‌ విపరీతంగా పెరిగింది. దాంతో థియేటర్‌లకు జనాలు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. థియేటర్‌లో రిలీజ్ అయిన సినిమాలు కేవలం నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. కొన్ని సినిమాలు మూడు వారాల్లో కూడా ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ఓటీటీలో కేవలం థియేట్రికల్‌ రిలీజ్ సినిమాలు మాత్రమే కాకుండా డైరెక్ట్‌ స్ట్రీమింగ్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, షో లు, రియాల్టీ షో లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కనుక టైం దొరికినప్పుడు ఓటీటీలో ఏదో ఒకటి చూసేయవచ్చు అనే ఉద్దేశంతో ప్రేక్షకులు ఉన్నారు. చాలా రేర్‌గా మాత్రమే ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్తున్నారు. భవిష్యత్తులో థియేటర్ల పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ హాలీవుడ్‌ స్టార్‌ లియోనార్డో డికాప్రియో ఈ విషయమై తన అభిప్రాయంను వ్యక్తం చేశారు.

హాలీవుడ్‌ స్టార్‌ లియోనార్డో డికాప్రియో..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భవిష్యత్తులో థియేటర్ల పరిస్థితి గురించి స్పందించారు. ఈ టైటానిక్ స్టార్‌ మాట్లాడుతూ థియేటర్లకు ముందు ముందు మరింత గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. ఓటీటీ లు ఇప్పటికే థియేటర్లను అధిగమించాయి. థియేటర్లపై ఓటీటీలు పై చేయి సాధించాయి. కనుక ఇప్పుడు థియేటర్లు కేవలం ఒక డ్రామా ను చూసేవిగా మారి పోతున్నాయి. ఇప్పటికే డాక్యుమెంట్స్ థియేటర్‌లో స్క్రీనింగ్‌ ఆగిపోయింది. డ్రామా సినిమాలకు మాత్రమే థియేటర్‌ పని చేస్తుంది. భవిష్యత్తులో మరింతగా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు అనే అభిప్రాయంను ఆయన వ్యక్తం చేశారు. ఓటీటీలను ఆపడం సాధ్యం కాదన్నారు. అదే సమయంలో రాబోయే రోజుల్లో ప్రేక్షకులు వినోదాన్ని చూసే విధానం మారవచ్చు అన్నారు. థియేటర్‌లు రాబోయే రోజుల్లో జాజ్‌ బార్‌ ల వంటి ప్రత్యేక ప్రదేశాలుగా మారినా ఆశ్చర్యం లేదు అన్నట్లుగా ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

భవిష్యత్తులో ఓటీటీ మార్కెట్‌..

ఓటీటీలు ఎంతగా పెరిగినా థియేటర్‌కి ఉండే వాటా థియేటర్‌కి ఉంటుంది అనేది కొందరి అభిప్రాయం. ఇంతకు మించి ఓటీటీ లు థియేటర్‌ వ్యవస్థను నాశనం చేయలేవని, ప్రేక్షకులు కొందరు అయినా థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటారు. వారి వల్ల అయినా థియేటర్‌లు నడుస్తాయి అనేది వారు చెబుతున్న విశ్లేషణ. అయితే ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అనేది గతంతో పోల్చితే ఎక్కువ అయింది, రాబోయే రోజుల్లో ఓటీటీ కంటెంట్‌ ను చూసే వారు మరింత మంది పెరుగుతారు. అలా అని థియేటర్‌లు మొత్తం మూసి వేసుకోవాల్సిందే అంటే మాత్రం నిజం కాదని కొందరు అంటున్నారు. థియేటర్ల పరిస్థితి గతంతో పోల్చితే దారుణంగా ఉన్న మాట వాస్తవం. ముందు ముందు మరింతగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా ఓటీటీ లు పూర్తిగా థియేటర్లను మింగలేవు అనేది వాస్తవం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News