మహానటికి పాడను అన్న ఎస్ జానకి

ఆమె పాత తరం కధానాయికలతో పాటు కొత్త తరం వారికి కూడా తన గొంతుని అరువిచ్చి వారి నట జీవితం వెండి తెర మీద దివ్యంగా వెలిగిపోవడానికి ప్రధాన కారణం అయ్యారు

Update: 2026-07-13 03:05 GMT

ఎస్ జానకి తన సినీ జీవితంలో వేలాది పాటలు పాడారు. ఆమె పాత తరం కధానాయికలతో పాటు కొత్త తరం వారికి కూడా తన గొంతుని అరువిచ్చి వారి నట జీవితం వెండి తెర మీద దివ్యంగా వెలిగిపోవడానికి ప్రధాన కారణం అయ్యారు. తెలుగు సినీ స్వర్ణయుగంలో ఆమె నేపధ్య గాయనిగా అడుగు పెట్టారు. 1957లో ఆమె చిత్ర సీమలో ప్రవేశించి ఎమ్మెల్యే సినిమాలో తొలి పాట ఆలపించారు. ఆనాటికి టాప్ హీరోయిన్లుగా సావిత్రి క్రిష్ణ కుమారి వంటి వారు ఉన్నారు. ఇక భానుమతి తన పాటలను తానే సొంతంగా పాడుకునేవారు. ఎస్ వరలక్ష్మి, షావు కారు జానకి వంటి వారికి కూడా అప్పటి ఫిమేల్ టాప్ సింగర్స్ పాటలు పాడేవారు. ఎస్ జానకి విషయం తీసుకుంటే ఆమె గొంతులో ఎంతో సాఫ్ట్ నెస్ ఉంటుంది. అది అమృతంగా చెవులకు తోస్తుంది. అదే సమయంలో వెండి తెర మీద టాప్ హీరోయిన్లకు ఆమె పాటలు పాడినపుడు కొందరికి సూట్ అవదన్న విమర్శలు తొలి నాళ్ళలో వచ్చాయని చెబుతారు.

సావిత్రి విషయంలో అలా :

ఇక మహానటిగా ఆనాడు వెలుగొందిన సావిత్రి విషయం తీసుకుంటే ఆమెకు అత్యధిక శాతం పాటలు లీల సుశీల పాడేవారు. ఈ ఇద్దరి పాటలతోనే సావిత్రి సినీ జీవిత ప్రయాణం సాగింది. అయితే ఎస్ జానకి కూడా సావిత్రికి ఒక దశలో పాడారు. అలా ఆమె ఒక తమిళ సినిమా కోసం సావిత్రికి ప్లేబ్యాక్ పాడారు. ఆ పాట చాలా బాగా వచ్చింది అని అంతా మెచ్చుకున్నారు కూడా. అయితే మహానటి సావిత్రి మాత్రం తనకు జానకి వాయిస్ సూట్ అవదని సుశీలతోనే పాడించాలని కోరారు. దాంతో ఎస్ జానకి పాడిన పాటను తీసి పక్కన పెట్టి మళ్ళీ సుశీలతో ఆ పాటను పాడించారు. దాంతో ఆత్మగౌరవం కలిగిన గాయనిగా పేరు తెచ్చుకున్న ఎస్ జానకి తాను ఇక మీదట సావిత్రికి పాడను అని తెగేసి చెప్పేశారు. సావిత్రికి తాను ఎప్పటికి పాడను అని ఒక రకంగా శపథం కూడా చేశారు.

అయినా పాడి మరీ :

అయితే ఇది జరిగిన మరో మూడు నెలలకు సావిత్రికి ఎస్ జానకి తప్పనిసరి పరిస్థితుల్లో పాడాల్సి వచ్చింది. ఆ సినిమావే మురిపించే మువ్వలు. అందులో నీ లీల పాడెద దేవా అన్న పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాటకు సావిత్రి నటించాలి. అయితే నిర్మాతలు దర్శకుడు ఆమె నటించడం లేదు మరొకరు అని చెప్పి జానకి చేత ఆ పాట పాడించారు. చివరికి ఆ పాటలో సావిత్రి నటించారు. అలా ఎస్ జానకి పాటకు సావిత్రి అభినయించారు. ఈ విషయాలను ఒక ఇంటర్వ్యూలో జానకి చెబుతూ సావిత్రికి సుశీల గొంతు అంటే ఇష్టం అన్నారు. అంతే కాదు తన నటనకు సుశీల గాత్రం సరిగ్గా సరిపోతుందని సావిత్రి భావించేవారు అన్నారు. అందుకే తాను ఆమెకు పాడుతాను అన్నా ఒప్పుకునే వారు కాదని చెప్పారు.

తెలుగులో తక్కువ పాటలే :

ఇక ఎస్ జానకి 1957లో తెలుగు చిత్ర సీమలో ప్రవేశించినప్పటికీ సుశీల టాప్ సింగర్ గా ఉండడం ఆమె వాయిస్ నే ప్రముఖ తారలు అంతా కోరుకోవడం వల్ల ఎక్కువగా పాడలేకపోయారు. ఎస్ జానకి గొంతుకలో పసి తనం సీనియర్ హీరోయిన్లకు సూట్ అయ్యేది కాదని నిర్మాతలు దర్శకులు భావించడం వల్ల కూడా ఆమె తెలుగులో మంచి అవకాశాల కోసం సుదీర్ఘ కాలం వేచి ఉండాల్సి వచ్చింది. అయితే ఆమె కోరుకున్న స్టార్ డం మాత్రం తరువాత కాలంలో వెతుక్కుంటూ వచ్చింది. ఎస్ జానకి వాయిస్ తరువాత తరంలో ఆమెకు ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టి నంబర్ వన్ సింగర్ గా తీర్చిదిద్దాయి. సావిత్రి, క్రిష్ణ కుమారి , బీ సరోజాదేవి, వాణిశ్రీ, శారద, కాంచన వంటి నాటి తరం హీరోయిన్లకు అతి తక్కువ పాటలు మాత్రమే పాడిన ఎస్ జానకి ఆ తరువాత తరానికి మాత్రం తన గొంతునే అరువిచ్చి నిలబెట్టారు. అలా ఆమె పాత కొత్త తరాల వారధిగా నిలిచి గెలిచారు.

Tags:    

Similar News