ప్రస్తుత- మాజీ భార్యలు వారి పిల్లలు కుటుంబం కోసం స్టార్ హీరో 100కోట్ల విల్లా!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన వ్యక్తిగత నిర్ణయాలతో మరోసారి వార్తల్లో నిలిచారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన వ్యక్తిగత నిర్ణయాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబైలోని పాలి హిల్‌లో ఆయన సుమారు 100 కోట్లకు పైగా వ్యయంతో ఒక విలాసవంతమైన స్కై విల్లా నిర్మాణానికి ప్లాన్ చేసినట్లు కథనాలొస్తున్నాయి. ఈ కొత్త నిర్ణయంతో తన ఇంటిని ఆనుకుని ఉన్న మరో రెండు భవంతుల్ని కొనేందుకే అతడు ఏకంగా 100 కోట్లు చెల్లించాడు. ఇప్పుడు ఆ ప్లేస్ ని కలుపుకుని మొత్తం స్థలంలో స్కై విల్లాను నిర్మించనున్నారట. 2030 నాటికి నిర్మాణం పూర్తవుతుందట. అయితే ఈ ఇల్లు కేవలం ఆయన ప్రస్తుత భాగస్వామి గౌరి స్ప్రాట్ కోసమే కాదు... అమీర్ ఖాన్ తన మాజీ భార్యలైన రీనా దత్తా, కిరణ్ రావు, వారి పిల్లలు, తన తల్లి - సోదరీమణులతో కలిసి ఒకే తాటిపై, ఒకే ఇంటిలో నివసించాలనే ఆలోచనతో దీనిని నిర్మిస్తున్నట్లు సమాచారం. ముగ్గురు భార్యలు (మాజీలు-ప్రస్తుత భాగస్వామి), పిల్లలందరూ కలిసి ఒకే కుటుంబంగా జీవించాలనే అమీర్ ఖాన్ బ్రాడ్ మైండెడ్ ఆలోచన ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనంగా మారింది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు రకరకాల కామెంట్లు, ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు. `ఇది ఇల్లా లేక హాస్టలా?`, `ఫ్యామిలీ అల్ట్రా ప్రో మాక్స్` అంటూ కొందరు వ్యంగ్యాస్త్రాలు విసురుతుంటే...సినిమా `హమ్ సాథ్ సాథ్... హే` కి అమీర్ ఖాన్ కొత్త వెర్షన్ లా ఉన్నారు! అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఒకే ఇంట్లో మాజీ భార్యలు, పిల్లలతో కలిసి ఉండటమనే ఈ మోడరన్ ఫ్యామిలీ సెటప్‌ను చూసి నెటిజనులు షాక్ అవుతున్నారు. అయితే ఈ వార్తలపై నెగెటివ్ కామెంట్లు వస్తున్నా అమీర్ ఖాన్ మాత్రం తన కుటుంబ బంధాలను వినూత్నంగా మెయింటైన్ చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటారని ఆయన అభిమానులు సమర్థిస్తున్నారు.
భారతీయ సినిమా చరిత్రను పరిశీలిస్తే.. ఇలా ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండి... ఎలాంటి గొడవలు లేకుండా అందరినీ సమానంగా మేనేజ్ చేసిన చరిత్ర కొందరు సినీ ప్రముఖులకు ఉంది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో ఇలాంటి ఆసక్తికరమైన కుటుంబ వ్యవస్థలు గతంలోనూ కనిపించాయి.
కోలీవుడ్‌లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు ఎమ్జీఆర్ (ఎం.జి. రామచంద్రన్)కి కూడా ముగ్గురు భార్యలు (సదానందవతి, భార్గవి, జానకి రామచంద్రన్). ఆయన తన భార్యలందరి బాధ్యతలను ఎంతో క్రమశిక్షణతో, ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకుని ఆదర్శంగా నిలిచారు. తమిళ చిత్రసీమలో మరో దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ కుటుంబం కూడా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు నిదర్శనంగా ఉండేది. ఆయన భార్యలు - పిల్లలందరూ ఒకే ఇంట్లో ఎంతో అన్యోన్యంగా నివసించేవారు.
బాలీవుడ్‌లో లెజెండ్ రాజ్ కపూర్ తన భార్య కృష్ణ కపూర్‌తో పాటు నటి నర్గీస్‌తో సుదీర్ఘ బంధాన్ని నడిపినప్పటికీ కుటుంబంలో పెద్ద గొడవలు రాకుండా చూసుకున్నారు. అలాగే ప్రముఖ రచయిత సలీం ఖాన్ (సల్మాన్ ఖాన్ తండ్రి) తన ఇద్దరు భార్యలైన సుశీల చరక్ (సల్మాన్ తల్లి), నటి హెలెన్‌లను ఒకే ఇంట్లో ఎంతో గౌరవంగా ఉంచి, బాలీవుడ్‌లో ఒక బెస్ట్ ఉమ్మడి కుటుంబంగా నిలిపారు. ప్రస్తుత ఆధునిక కాలంలో సంబంధాలు ముగిసిన తర్వాత ఒకరి మొహం ఒకరు చూసుకోని ఈ రోజుల్లో.. అమీర్ ఖాన్ తన మాజీ భార్యలను, పిల్లలను ఒకే రాజసౌధంలోకి తీసుకురావాలని అనుకోవడం కచ్చితంగా ఒక విభిన్నమైన.. వినూత్నమైన ఆలోచనే అని చెప్పవచ్చు.