విక్రమ్ రీల్ కాంట్రవర్సీ.. అరుదైన కోతి కారణంగా విచారణ

తమిళ స్టార్ హీరో 'చియాన్' విక్రమ్ ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక చిన్న వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసింది.

Update: 2026-08-11 09:40 GMT

తమిళ స్టార్ హీరో 'చియాన్' విక్రమ్ ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక చిన్న వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసింది. ఓ అరుదైన 'లార్ గిబ్బన్' జాతికి చెందిన కోతితో సరదాగా గడుపుతూ, దాన్ని కౌగిలించుకున్న రీల్‌ను ఆయన షేర్ చేశారు. అయితే ఈ వీడియో చూసిన అటవీశాఖ అధికారులు, వన్యప్రాణి సంరక్షకులు ఆ అరుదైన జీవి చట్టబద్ధతపై ప్రశ్నలు గుప్పించడంతో విక్రమ్ ఆ వీడియోను వెంటనే డిలీట్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన రచ్చ జరిగిపోవడంతో తమిళనాడు అటవీశాఖ దీనిపై అధికారిక విచారణ ప్రారంభించింది.

రీల్ డిలీట్.. కానీ వివాదం సద్దుమణగలేదు:

విక్రమ్ ఆ వీడియోను డిలీట్ చేసినప్పటికీ, ఆ అరుదైన కోతి ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎవరి వద్ద ఉంచారు అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ప్రాథమిక వివరాల ప్రకారం, ఆ గిబ్బన్ విక్రమ్ కుమార్తె మామగారైన ప్రముఖ వ్యాపారవేత్త సీకే రంగనాథన్‌కు చెందినదని తెలిసింది. దీనిని మణిపూర్ నుంచి ఈరోడ్‌కు, అక్కడి నుంచి చెన్నైలోని ఫామ్‌హౌస్‌కు తీసుకొచ్చారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి తగిన కొనుగోలు పత్రాలు ఉన్నాయా లేదా అని అధికారులు పరిశీలిస్తున్నారు.

లార్ గిబ్బన్ ఎందుకంత ప్రత్యేకమైనది?:

శాస్త్రీయంగా 'హైలోబేట్స్ లార్' అని పిలిచే ఈ గిబ్బన్ ఒక అత్యంత అరుదైన, రక్షిత వన్యప్రాణి. ఇది అంతర్జాతీయ సైట్స్ ఒప్పందంలోని అపెండిక్స్-I కింద మరియు భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చట్టబద్ధమైన రక్షణ కలిగి ఉంది. ఇక ఇలాంటి అరుదైన జీవులను ఇంట్లో పెంచుకోవడానికి చాలా కఠినమైన అనుమతులు, అసలైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. అనుమతులు లేకుండా వీటిని ఉంచడం చట్టరీత్యా నేరం కాబట్టి అధికారులు రంగంలోకి దిగారు.

ఈ కోణంలోనూ అనుమానాలు:

ఈ వ్యవహారంలో వన్యప్రాణి ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగ్నేయాసియా అడవుల నుంచి ఇటువంటి పసి గిబ్బన్‌లను అక్రమంగా స్మగ్లింగ్ చేయడం వెనుక పెద్ద ముఠాలే ఉంటాయని, తగిన పత్రాలు లేకపోతే ఇది వన్యప్రాణి అక్రమ రవాణా కిందకే వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికారులు యజమాని వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారని, నివేదిక వచ్చాకే అసలు నిజాలు బయటపడతాయని అటవీశాఖ తెలిపింది.

ప్రస్తుతానికి నటుడు విక్రమ్‌పై నేరుగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు కానీ, ఆ నిబంధనలు తెలియక ఆయన వీడియో పోస్ట్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక ఏది ఏమైనా, సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పోస్ట్ చేసే ముందు అరుదైన జంతువుల పట్ల ఎలాంటి చట్టాలు ఉన్నాయో తెలుసుకోవడం అందరికీ అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. అటవీశాఖ విచారణ పూర్తియితే గానీ ఈ కాంట్రవర్సీకి ముగింపు పడేలా కనిపించడం లేదు.




Tags:    

Similar News