దేవుడిని నిందించాలా? లేక కరణ్ జోహార్ నా?: కిల్ హీరో
బాలీవుడ్ యంగ్ హీరో లక్ష్య.. కిల్ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.;
బాలీవుడ్ యంగ్ హీరో లక్ష్య.. కిల్ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. మోస్ట్ వయిలెంట్ సినిమాగా రూపొందిన ఆ చిత్రంలో తన యాక్టింగ్ తో అలరించారు. బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డు అందుకున్నారు. రీసెంట్ గా వచ్చిన ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ లో నటించి అందరినీ మెప్పించారు లక్ష్య.
షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ఆ ప్రాజెక్టుతో బీటౌన్ సినీ ఇండస్ట్రీలో తన ఉనికిని చాటుకున్నారు. అయితే కిల్, ది బ్యా**డ్స్ ఆఫ్ బాలీవుడ్ కన్నా ముందు లక్ష్య చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తనను బోర్డులో తీసుకున్న రెండు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. దీంతో ఐదేళ్ల పాటు అలా వెయిట్ చేశారు.
నిజానికి పోరస్ టీవీ సిరీస్ తో బుల్లితెరపై మంచి క్రేజ్ దక్కించుకున్నారు లక్ష్య. ఆ సమయంలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ తో పని చేసేందుకు మూడు సినిమాల ఆఫర్ అందుకున్నారు. కానీ అందులో రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్ళాక ఆగిపోయాయి. అందులో ఒకటి బేధడక్ కాగా.. మరొకటి కాలిన్ డి కున్హా.
ఇప్పుడు ఆ విషయంపై లక్ష్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ రెండు సినిమాలు ఆగిపోవడం తన తప్పు కాదని తనకు తానే చెప్పుకున్నానని తెలిపారు. రోజూ లేవడం, వ్యాయామం చేయడం, జిమ్ కు వెళ్లడం, సినిమాలు చూడడం, అలా తన దినచర్యను కొనసాగించానని చెప్పిన లక్ష్య.. ఖాళీగా మాత్రం ఉన్నానని చెప్పుకొచ్చారు.
అయితే తానెప్పుడూ నటుడు అవ్వాలని అనుకోలేదని, అనుకోకుండా అది జరిగిందని చెప్పారు. కష్టపడి పనిచేయడం తనకు తెలుసని పేర్కొన్నారు. అందుకే ఆగిపోయిన రెండు ప్రాజెక్టుల విషయంలో తాను ఎవరిని నిందించాలని ప్రశ్నించారు. దేవుడినా? లేదా కరణ్ జోహార్ నా అన్నారు. కానీ ఎవరినీ నిందించలేనని చెప్పారు.
ఒక్కో రోజు పరిస్థితులు తారుమారు అవుతాయని చెప్పుకొచ్చారు. పోరస్ షో ముగిసిన తర్వాత, తనకు మరో టీవీ షో ఆఫర్ వచ్చిందని, అక్కడ వారు నాకు రోజుకు రూ. 20,000-25,000 ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. దీంతో నాన్న ఓకే చెప్పమన్నారని, కానీ తాను అలా చేయలేదని తెలిపారు. అప్పుడు సినిమాల్లోకి రావాలని పట్టుదల ఉందని చెప్పుకొచ్చారు. కచ్చితంగా హీరోగా నటించాల్సిందేనన్న కోణంలో కష్టపడ్డానని లక్ష్య తెలిపారు.