పాతికేళ్ల మైలురాయి - చారిత్రాత్మక కలయిక!

భారతీయ చలనచిత్ర చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించి.. అంతర్జాతీయ వేదికలపై దేశ కీర్తిని చాటిన చిత్రం ల‌గాన్.

Update: 2026-06-14 11:22 GMT

భారతీయ చలనచిత్ర చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించి.. అంతర్జాతీయ వేదికలపై దేశ కీర్తిని చాటిన చిత్రం ల‌గాన్. తాజాగా ఈ సినిమా విడుద‌లై 25 వసంతాలు పూర్తి చేసుకుంది. 2001 జూన్ 15న ప్రేక్షకుల ముందు కొచ్చిన చారిత్రాత్మక స్పోర్ట్స్ డ్రామా రజతోత్సవ మైలురాయిని చేరుకున్న సందర్భంగా చిత్రబృందం ముంబైలో ఘనంగా వేడుకలను నిర్వహించింది. చిత్ర కథానాయకుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ రీయూనియన్ వేడుక బాలీవుడ్ వర్గాల్లో ఎమోషనల్ అండ్ నాస్టాల్జిక్ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

ఈ ప్రత్యేక వేడుకలో లగాన్ చిత్ర దర్శకుడు అశుతోష్ గోవారికర్‌తో పాటు చంపానేర్ గ్రామస్తులుగా నటించిన పలువురు నటీనటులు ఒకే వేదికపైకి రావడం విశేషం. రాజేంద్రనాథ్ జుట్షీ, ఆదిత్య లాఖియా, యశ్‌పాల్ శర్మ, అఖిలేంద్ర మిశ్రా, దయాశంకర్ పాండే, సుహాసిని ములే వంటి సీనియర్ తారాగణమంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాలం ఎంత గడిచినా? తమ మధ్య ఉన్న ఆనాటి బంధం ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ అంతా పాత స్క్రిప్ట్ ప్రతులను తిరగేస్తూ.. షూటింగ్ రోజుల్లోని తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది చిత్రంలో క్రూరమైన బ్రిటిష్ అధికారి కెప్టెన్ ఆండ్రూ రస్సెల్ పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడు పాల్ బ్లాక్‌థోర్న్. ఈ మైలురాయి సంబరాల్లో భాగం పంచుకోవడం కోసం ఆయన ప్రత్యేకంగా లండన్ నుండి భారతదేశానికి విచ్చేశారు. రెడ్ కార్పెట్‌పై సాంప్రదాయకమైన టోపీ, స్టైలిష్ లుక్‌లో మెరిసిన పాల్, అభిమానులను ఆత్మీయంగా పలకరిస్తూ సందడి చేశారు. భారతీయ సినిమాపై ఇక్కడి ప్రేక్షకులపై తనకున్న అమితమైన ప్రేమే పాతికేళ్ల తర్వాత కూడా తన్ను ముంబై వైపు నడిపించిందని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఈ జ్ఞాపకాల పందిరిలో ఆమిర్ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకున్నారు. చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఆయన మాజీ భార్య రీనా దత్తాతో పాటు కిరణ్ రావు , కుమార్తె ఇరా ఖాన్ కూడా హాజరై సందడి చేశారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరికొత్త షార్ట్ హెయిర్ లుక్‌లో వేడుక‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయనతో పాటు నటి కరీనా కపూర్ కూడా హాజ‌రై ఆమిర్ ఖాన్ టీమ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రజతోత్సవ సంబరాలను పురస్కరించుకుని `లగాన్` చిత్రాన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేయడం విశేషం.

జూన్ 12 నుండి 14 వరకు మూడు రోజుల పాటు థియేటర్లలో ఈ సినిమాను చూసేందుకు నేటి తరం ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కట్టారు. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్న పీరియడ్ డ్రామా అయినప్పటికీ క్లైమాక్స్‌లో వచ్చే ఆ నరాలు తెగే ఉత్కంఠభరితమైన క్రికెట్ మ్యాచ్ మ్యాజిక్ ఏమాత్రం తగ్గలేదని థియేటర్లలోని రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది. ఏఆర్ రెహమాన్ అందించిన ఆల్-టైమ్ క్లాసిక్ సాంగ్స్ మళ్లీ పెద్ద స్క్రీన్‌పై మారుమోగాయి.

నాటి రోజుల్లో ఇటువంటి ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాకపోవడంతో ఆమిర్ ఖాన్ స్వయంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి భారీ రిస్క్‌తో దీనిని నిర్మించారు. మదర్ ఇండియా, సలామ్ బాంబే చిత్రాల తర్వాత ఆస్కార్ నామినేషన్ (ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీ) పొందిన మూడో భారతీయ చిత్రంగా నిలవడమే కాకుండా 8 జాతీయ అవార్డులను కొల్లగొట్టి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. పాతికేళ్లు గడిచినా ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ - గ్లోబల్ రీచ్ నేటి తరం మేకర్స్‌కు అద్భుతమైన గైడ్‌లా పనిచేస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News