'ఆదిపురుష్' సీతాదేవికి పెద్ద ఆఫర్
1- నేనొక్కడినే, దోచేయ్ లాంటి చిత్రాలతో కృతి సనోన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. కానీ ఇక్కడ తొలి రెండు సినిమాలు డిజాస్టర్లుగా మారడంతో, ఈ భామ పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది.;
1- నేనొక్కడినే, దోచేయ్ లాంటి చిత్రాలతో కృతి సనోన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. కానీ ఇక్కడ తొలి రెండు సినిమాలు డిజాస్టర్లుగా మారడంతో, ఈ భామ పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది. హిందీ చిత్రసీమలోను ఆశించిన విజయాలు దక్కలేదు. కానీ `మిలీ` చిత్రంలో తన అద్భుత నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. ఆ తర్వాత కృతి సనోన్ కెరీర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు. కరీనా, టబుతో కలిసి క్రూ లాంటి బ్లాక్ బస్టర్ లోను కృతి నటించింది. ఈ బ్యూటీ ఇటీవలి కాలంలో ఏ-లిస్టర్ స్టార్‌గా బాలీవుడ్‌లో వెలిగిపోతోంది.
ప్రస్తుతం రణవీర్ సింగ్ కథానాయకుడిగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్న 'డాన్ 3'లో కృతి కథానాయికగా ఎంపికైంది. ఆ మేరకు ఫర్హాన్ అక్తర్- రితేష్ సిధ్వానీలకు చెందిన ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఒక ప్రకటనను జారీ చేసింది. ఒక పత్రికా ప్రకటనలో ఫర్హాన్ దర్శకుడిగా రంగ ప్రవేశం చేస్తున్నాడని, డాన్ 3 జనవరి 2026లో సెట్స్ పైకి వెళ్లనుందని ప్రకటించారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. డాన్ 3 బృందం ఇంకా 'ఎ-లిస్టర్ విలన్' కోసం వెతుకుతోందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాతలు భీకరమైన విలన్ పాత్రను పోషించడానికి అగ్రశ్రేణి నటుడితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
నిజానికి ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే విలన్ పాత్రలో నటించాల్సి ఉంది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అతడు తప్పుకున్నాడు. ఆ తర్వాత అదే పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండను ఫర్హాన్ బృందం సంప్రదించారు. కానీ విజయ్ కూడా దీనిని తిరస్కరించాడు. ఆ ఇద్దరూ కాదనుకోవడానికి కారణం తమకు ఆఫర్ చేసిన పాత్రలో విషయం లేకపోవడమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాలోని నెగటివ్ క్యారెక్టర్‌లో లోతు లేకపోవడంతో ఆ ఇద్దరూ ఓకే చెప్పలేదని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఒక అగ్ర నటుడితో ఫర్హాన్ మంతనాలు సాగిస్తున్నారు. త్వరలోనే విలన్ ని కూడా ప్రకటించేందుకు అవకాశం ఉందని తెలిసింది. అయితే డాన్ 3లో రణ్ వీర్ ప్రధాన పాత్రలో నటించడం షారూఖ్ అభిమానులకు నచ్చడం లేదు. దీనిని బాగా అర్థం చేసుకున్న ఫర్హాన్ ఇప్పుడు ఒక తెలివైన ఎత్తుగడ వేస్తున్నాడని తెలిసింది. డాన్ 3లో అతిథి పాత్రలో నటించేందుకు షారూఖ్ ని ఒప్పించారని కూడా చెబుతున్నారు. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.