సూపర్ స్టార్ పేరిట స్వర్ణోత్సవాలు లేవా?
నటసింహ బాలకృష్ణ తెరంగేట్రం చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆయన పేరిట ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే.;
నటసింహ బాలకృష్ణ తెరంగేట్రం చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆయన పేరిట ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి బాలయ్య తరం హీరోలు చిరంజీవి, వెంకటేష్ తో పాటు నెటి జనరేషన్ హీరోలు కూడా హాజరై శుభాంకాక్షలు తెలియజేసారు. తాజాగా నటప్రపూర్ణ మోహన్ బాబు కూడా నవంబర్ 22తో నటునిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, గోపీచంద్, శ్రీకాంత్, నాచురల్ స్టార్ నాని, అల్లు అరవింద్, శ్రీను వైట్ల వంటి ప్రముఖులు హాజరై విషెస్ తెలియ జేసారు.
సోషల్ మీడియా వేదికగా మరికొంత మంది శుభాకాంక్షలు చెప్పారు. మరి ఇలాంటి వేడుకలు కోలీవుడ్ ఇండస్ట్రీ నిర్వహించదా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. రజనీకాంత్ 1975లో `అపూర్వ రాగంగల్` సినిమాతో శివాజీరావ్ గైక్వాడ్ అనే సామాన్యుడు `రజనీకాంత్` గా వెండి తెరకు పరిచయం అయ్యారు. అటుపై ఆయన ప్రస్తానం ఎలా సాగిందన్నది తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టుతోనే 50 ఏళ్ల నట ప్రస్తానాన్ని పూర్తిచేసుకున్నారు.
ప్రముఖ దిన పత్రిక ప్రత్యేక గౌరవం:
కానీ ఆయన పేరిట తమిళ చిత్ర పరిశ్రమ ఎలాంటి గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించలేదు. కానీ ఓ ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక తన వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ చేయని పనిని రజనీకాంత్ కోసం చేసింది. రజనీ సినీ ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా, ఆ పత్రిక ఫ్రంట్ పేజీలో రజనీకాంత్ ఫొటోను ముద్రించి అరుదైన గౌరవాన్ని అందిం చింది. సాధారణంగా వార్తలకు, రాజకీయ నాయకులకు ఇచ్చే ప్రాధాన్యత కంటే ఎక్కువగా ఒక సినిమా హీరో కోసం ఆ పత్రిక తన రూల్స్‌ను పక్కన పెట్టి మరీ ఇలా సెలబ్రేట్ చేయడం రజనీ స్టామినాకు నిదర్శనం.
సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా:
కానీ ఆ మాత్రం గుర్తింపు కూడా తమిళ పరిశ్రమ నుంచి రజనీకాంత్ కు దక్కలేదు. సోషల్ మీడియాలో కొంత మంది అభిమానులు, సెలబ్రిటీలు తప్ప పెద్దగా ఎవరూ స్పందించలేదు. రజనీకాంత్ తమిళ నాట కోట్లాది మంది అభిమానులు స్టార్. కేవలం నటుడిగా వినోదాన్ని అందించడానికే పరిమితం కాలేదు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పరిశ్రమకు పెద్ద దిక్కుగాను రజనీకాంత్ కనిపిస్తారు. అలాంటి నటుడి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ ఎలాంటి వేడుక నిర్వహించక పోవడం శోచనీయం. మరి అందుకు కారణం ఏంటో.
రజనీకాంత్ ఓ కన్నడిగి:
రజనీకాంత్ స్వస్థలం కర్ణాటక. అక్కడే పుట్టి పెరిగారు. కానీ తమిళ పరిశ్రమలో భాషాబేధం ఉంటుందన్నది వాస్తవం. సొంత నటులకు ఇచ్చిన ప్రాధాన్యత ఇతర భాషల నటులకు ఇవ్వరు. రజనీకాంత్ విషయంలో ఇలాంటి వ్యత్యాసం ఉందా? అన్న సందేహం లేకపోలేదు. తమిళ పరిశ్రమలోనే కోట్లాది మంది అభిమానుల్ని సంపాదిం చుకున్న స్టార్ కాబట్టి అందుకు ఎంత మాత్రం అవకాశం ఉండదు? అన్నది మరికొంత మంది వాదన. మరి కోలీవుడ్ మౌనం వెనుక అసలు వాస్తవాలు ఏంటి? అన్నది తేలాలి.