ఇండస్ట్రీలో మరో కొత్త ట్రెండ్!
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు.;
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు. ఒకవైపు హీరోలుగా , హీరోయిన్లుగా చలామణి అవుతూనే.. మరొకవైపు బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి భారీగా సంపాదిస్తున్నారు. కొంతమంది రెస్టారెంట్లను ప్రారంభిస్తే.. మరి కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును పెట్టుబడులుగా పెడుతున్నారు. ఇంకొంతమంది యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇంకొంతమంది అలా సినిమాల ద్వారా.. ఇలా బిజినెస్ రంగాల ద్వారా వచ్చిన డబ్బులను మళ్లీ సినిమాలపైనే పెట్టుబడిగా పెట్టి లాభం పొందే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే ఎంతోమంది సీనియర్ హీరోలను మొదలుకొని ఇప్పుడు యంగ్ హీరోల వరకు చాలామంది ఇలా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. హీరోలే కాకుండా హీరోయిన్లు కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా చేరిపోయారు. రాజావారు రాణిగారు అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం.. చాలా సెలెక్టివ్ గా పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే దిశగా దూసుకుపోతున్నారు.
గత ఏడాది క అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇటీవల కే ర్యాంప్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే సెలెక్టివ్ గా కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను హీరోగా అలరిస్తున్న కిరణ్ తాజాగా నిర్మాతగా మారి ఒక కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే..కిరణ్ అబ్బవరం తాజాగా తిమ్మరాజు పల్లి టీవీ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి "చిన్ని చిన్ని గుండెలోన" అనే ఒక మెలోడీ ఫస్ట్ సింగిల్ ని విడుదల చేయగా.. ఇది ప్రస్తుతం ట్రెండింగ్లో నిలిచింది. ఆహ్లాదకరమైన పల్లె వాతావరణంలో చిత్రీకరించిన ఈ పాటకు వంశీ కాంత్ రేఖన కంపోజ్ చేయగా.. పవన్ కళ్యాణ్, హరిని ఇవటూరి ఆలపించారు. వి మునిరాజు దర్శకుడిగా ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కాబోతోంది.
అలా హీరోగా ఇన్ని రోజులు చలామణి అయిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగా తొలి అడుగు వేశారు. ఈ సినిమాతో ఆయనకు ఎలాంటి సక్సెస్ లభిస్తుందో చూడాలి.
ఇకపోతే కిరణ్ అబ్బవరం మాత్రమే కాదు హీరోయిన్ సమంత, హీరో నాని, దగ్గుబాటి రానా, దుల్కర్ సల్మాన్ ఇలా ఎంతోమంది హీరోలు ఒకవైపు హీరోలుగా చలామణి అవుతూనే మరొకవైపు నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మిస్తున్నారు.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరంతా కూడా ఎక్కువగా విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలను ఎంపిక చేసుకుంటూ ఆ జానర్ ల్లోనే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ పల్లెటూరు వాతావరణం.. అందులో ప్రేమ జంటలు.. కుటుంబం ఇలా అన్నింటిని చక్కగా కలగలిపి సహజత్వాన్ని ఉట్టిపడేలా చిత్రాలను నిర్మిస్తూ సక్సెస్ అవుతున్నారు. మరి కిరణ్ అబ్బవరం చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఆయనకు ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు ఇదొక ట్రెండ్ గా ఇండస్ట్రీలో మారిపోయిందని చెప్పవచ్చు.