ఒక గొప్ప కీబోర్డ్ ప్లేయర్.. గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కాగలడు!- మాధవపెద్ది
ఈ వేడుకలో సంగీత పరిణామాల గురించి మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ.. ఒక అద్భుతమైన సూత్రాన్ని నేటితరం కోసం షేర్ చేసారు.
టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం నటనపై ప్రముఖ సీనియర్ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సోమవాం సాయంత్రం జరిగిన `చెన్నై లవ్ స్టోరి` మ్యూజిక్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన కిరణ్ అబ్బవరం పక్కింటి అబ్బాయిలా కనిపించే ఒక అత్యంత సహజసిద్ధమైన నటుడని కొనియాడారు. సాంప్రదాయ సంగీత నేపథ్యం.. ఎన్నో ఏళ్ల సినీ అనుభవం ఉన్న మాధవపెద్ది సురేష్ వంటి సీనియర్ టెక్నీషియన్ నోట టాలీవుడ్ యంగ్ హీరోపై ఈ స్థాయి ప్రశంసలు రావడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది.
ఈ వేడుకలో సంగీత పరిణామాల గురించి మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ.. ఒక అద్భుతమైన సూత్రాన్ని నేటితరం కోసం షేర్ చేసారు. ఇండస్ట్రీలో ఒక గొప్ప కీబోర్డ్ ప్లేయర్ ఎప్పుడైనా సరే అంతకంటే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కాగలడని ఆయన స్పష్టం చేశారు. సంగీత సాధనలో కీబోర్డ్ ప్లేయర్‌కు అన్ని రకాల వాయిద్యాలు, ట్యూన్స్, రిథమ్స్ పై పూర్తి అవగాహన వస్తుందని.. అదే వారిని భవిష్యత్తులో టాప్ మ్యూజిక్ కంపోజర్లుగా మారుస్తుందని వివరించారు. దీనికి ఉదాహరణగా భారతీయ చలనచిత్ర పరిశ్రమను శాసించిన దిగ్గజాల పేర్లను ఆయన ప్రస్తావించారు.
భారతీయ సంగీత ప్రపంచాన్ని తమ స్వరాలతో ముంచెత్తిన మాస్ట్రో ఇళయరాజా .. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ .. టాలీవుడ్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ వంటి వారంతా ఒకప్పుడు అద్భుతమైన కీబోర్డ్ లేదా పియానో ప్లేయర్లుగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించినవారేనని ఆయన గుర్తుచేశారు. ఆ తర్వాతే వారు కాలక్రమేణా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లుగా ఎదిగి ఇండస్ట్రీ హిస్టరీని తిరగరాశారని విశ్లేషించారు. తన కెరీర్ ఎదుగుదలలో కూడా కీబోర్డ్ ప్లేయింగ్ ఎంతగానో దోహదపడిందని ఈ సందర్భంగా మాధవపెద్ది సురేష్ పేర్కొన్నారు.
తన సుదీర్ఘ సినీ ప్రయాణం గురించి చెప్తూ.. ``నేను ఇప్పటివరకు ఇండస్ట్రీలో దాదాపు 1000 కి పైగా చిత్రాలకు రకరకాల విభాగాల్లో, సంగీతం విభాగంలో పనిచేశాను. ఎంతోమంది లెజెండ్స్‌తో కలిసి ట్రావెల్ అయ్యాను! అని వెల్లడించారు. ఇంతటి సుదీర్ఘ అనుభవం ఉన్నా.. తనకు సంగీతంపై ఉన్న ఇష్టం ఏమాత్రం తగ్గలేదని అన్నారు. నేను ఇండస్ట్రీలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరి పాటలు వింటాను.. అందరినీ ఇష్టపడతాను. సంగీతాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరినీ నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను! అంటూ తనలోని హుందాతనాన్ని చాటుకున్నారు.
కొత్త తరం సంగీత దర్శకులు, గాయకులు వస్తున్న డిజిటల్ యుగంలో కూడా పాత, కొత్త తారలందరినీ సమానంగా ఆదరిస్తూ... కిరణ్ అబ్బవరం లాంటి యువ నటులను ప్రోత్సహిస్తూ మాధవపెద్ది సురేష్ చేసిన ప్రసంగం ఆ వేడుకలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీనియర్ల నుండి లభిస్తున్న ఈ విధమైన భరోసా... యువ ప్రతిభావంతులకు ఇండస్ట్రీలో మరిన్ని మంచి మైలురాళ్లు అందుకోవడానికి బూస్ట్‌లా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ ఆడియో కార్యక్రమంలో మణిశర్మ, ఎం.ఎం.కీరవాణి, కిరణ్ అబ్బవరం తదితరులు పాల్గొన్నారు.
`వదలనే` సాంగ్ లాంచ్: `చెన్నై లవ్ స్టోరీ` ప్రమోషన్స్ ఇంట్రెస్టింగ్!
మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు సాయి రాజేష్, ఎస్.కె.ఎన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం `చెన్నై లవ్ స్టోరీ`. రవి నంబూరి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా `వదలనే` అనే మెలోడీ సాంగ్‌ను చెన్నైలో లైవ్ ఈవెంట్ ద్వారా చాలా గ్రాండ్‌గా విడుదల చేశారు. ఎబినేజర్ పాల్ ప్రోగ్రామింగ్ చేసిన ఈ రొమాంటిక్ ట్రాక్‌కు సుభాని గిటార్, రాజేష్ సాక్సోఫోన్, లలిత్ తల్లూరి ఫ్లూట్, అనిల్ పెర్కషన్స్ అందించిన లైవ్ ఇన్‌స్ట్రుమెంటల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.