'చెన్నై లవ్ స్టోరీ' ప్రీరిలీజ్‌: మెగాస్టార్ ముందే నాటి ర‌చ్చ‌ను గుర్తు చేసుకుని కిర‌ణ్ అబ్బ‌వ‌రం భావోద్వేగం

యువ ప్ర‌తిభావంతుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించిన లేటెస్ట్ మూవీ `చెన్నై ల‌వ్ స్టోరి`. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Update: 2026-07-23 03:52 GMT

యువ ప్ర‌తిభావంతుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించిన లేటెస్ట్ మూవీ `చెన్నై ల‌వ్ స్టోరి`. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదిక‌పై కిరణ్ ఎమోష‌న‌ల్ స్పీచ్ ఆద్యంతం హృద‌యాల‌ను గెలుచుకుంది. ఒకప్పుడు రాయచోటి, రాజంపేట వంటి సొంత ఊళ్లలో ఉంటూ టీవీలలో మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాల ఈవెంట్లను చూసేవాడినని గుర్తుచేసుకున్న కిరణ్.. ఈరోజు తను హీరోగా నటించిన సినిమా వేడుకకు స్వయంగా చిరంజీవి గారే అతిథిగా రావడం తన జీవితంలో మర్చిపోలేని సందర్భమని.. అదొక బ్లెస్సింగ్ ఫీలింగ్ అని సంతోషం వ్యక్తం చేశారు.

మెగాస్టార్‌పై తనకున్న ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తూ.. ``చిరంజీవి అనేది కేవలం ఒక పేరు కాదు..అదొక ఎమోషన్`` అని వ్యాఖ్యానించారు. మెగాస్టార్‌కి తమ కుటుంబంలో ఉన్న ఆదరణను గుర్తుచేస్తూ.. తమ అన్నయ్య చిరంజీవి కి అభిమాని అయితే, తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమానినని తెలిపారు. గతంలో థియేటర్ల వద్ద కట్టిన బ్యానర్లు..చేసిన రచ్చను గుర్తుచేసుకుంటూ.. ఇంద్రా, శంకర్ దాబా ఎంబీబీఎస్, ఠాగూర్, అన్నయ్య వంటి చిత్రాలలోని స్వాగ్, డ్యాన్సులు, ఆయనిచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. ఎవరెస్ట్ శిఖరంపై కూర్చుని తమలాంటి కుర్రాళ్లను ``అలసిపోకుండా పరుగులు తీసి విజయం సాధించండి`` అని చిరంజీవి గారు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉన్నారని కొనియాడారు.

ఈ సందర్భంగా సినిమా ప్రొడక్షన్ - టెక్నికల్ టీమ్‌కి కిరణ్ అబ్బవరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నిర్మాతలు ఎస్ కేఎన్, సాయి రాజేష్, ధీరజ్‌ల సినిమా పట్ల ఉన్న ప్యాషన్ తమ అందరినీ ముందుండి నడిపించిందని చెప్పారు. అలాగే మణిశర్మ సంగీతం, హీరోయిన్ గౌరి ప్రియ నటనను అభినందించారు. ఈ చిత్ర దర్శకుడు రవి నంబూరి పుట్టినరోజునాడే చిరంజీవి గారు ఈవెంట్‌కు రావడం ఎంతో ప్రత్యేకమైనదని.. రవి నంబూరి అందించిన అద్భుతమైన రైటింగ్‌కు థియేటర్లలో ప్రేక్షకులందరూ తీవ్ర భావోద్వేగానికి గురవుతారని నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో తాను పోషించిన స్టీవెన్ శంకర్ పాత్ర తన కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమైనదని కిరణ్ అబ్బవరం తెలిపారు. క, కె వంటి ప్రాజెక్ట్‌ల తర్వాత చేస్తున్న ఈ సినిమాలో ఎంతో అమాయకంగా...తుంటరితనంతో సాగే ఈ పాత్ర తన మనసుకు బాగా దగ్గరైందని పేర్కొన్నారు. నివి పాత్ర లేకపోతే స్టీవెన్ శంకర్ లేడు! అని చెబుతూ క్యారెక్టర్ల మధ్య ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ఈ రోల్ ప్రేక్షకులందరినీ క‌చ్చితంగా అలరిస్తుందని.. స్టీవెన్ శంకర్ ఒకసారి పరిచయమైతే ఎప్పటికీ మర్చిపోలేరని కాన్ఫిడెంట్‌గా చెప్పారు.

ప్రేక్షకులకు- అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ, ``ఇది మీ ఇంట్లోని కుర్రాడు చేసిన సినిమాగా భావించి మీ ఫ్యామిలీ అంతా కలిసి ధైర్యంగా థియేటర్లకు వెళ్లండి`` అని కిరణ్ అబ్బవరం కోరారు.`చెన్నై లవ్ స్టోరీ` అనే ఈ అందమైన ప్రేమకథ ప్రతి ఒక్కరికీ క‌చ్చితంగా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుక్ మై షో లేదా ఇతర యాప్‌లలో టికెట్లు బుక్ చేసుకుని థియేటర్లలో సినిమాను ఆస్వాధించాలని పిలుపునిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందిన‌ సినిమా `చెన్నై లవ్ స్టోరీ`. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్- మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ గా రిలీజ్ కానుంది.



Tags:    

Similar News