బెదిరించి 60 కోట్ల విలువైన వజ్రం, నగలు కొట్టేశారు.. నటికి కోర్టు పరిహారం రూ.111
అంతర్జాతీయ సెలబ్రిటీలు, నటీమణులు ఇలాంటి విలువైన ఆభరణాల చోరీలు లేదా భయానక దోపిడీల బారిన పడటం ఇదే తొలిసారి కాదు.
మేం పోలీసులం అని చెప్పుకుని హోటల్ రూమ్ లో ప్రవేశించి.. ఆపై ఆ నటీమణిని బలవంతంగా తాళ్లతో కట్టేసి.. ఏకంగా 60 కోట్ల విలువైన వజ్రం, బంగారు ఆభరణాలు కొట్టేసారు. అయితే ఈ కేసులో తీర్పు దాదాపు 10 ఏళ్ల తర్వాత కానీ వెలువడలేదు. దుండగులు దొరికారు.. కానీ పరిహారం కింద ఆ నటికి చెల్లించాలని కోర్టు చెప్పిన మొత్తం విస్తుపోయేలా చేసింది. కేవలం 1 యూరో.. దీనివిలువ సుమారు 1.15 డాలర్లు..అంటే రూ.111 అన్నమాట. ఈ స్టోరీ అంతా కిమ్ కర్ధాషియన్ కు సంబంధించినది.
అమెరికన్ రియాలిటీ స్టార్, బిలియనీర్ కిమ్ కర్దాషియన్‌కు సంబంధించిన 2016 నాటి సంచలనాత్మక దోపిడీ కేసులో ఫ్రాన్స్‌లోని పారిస్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. తొమ్మిదేళ్ల క్రితం పారిస్‌లో జరిగిన సాయుధ దోపిడీ కేసుకు సంబంధించి కోర్టు కిమ్ కర్దాషియన్‌కు కేవలం 1 యూరో (సుమారు 1.15 డాలర్లు) నష్టపరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ నటి స్వయంగా కోరిన మేరకే కోర్టు ఈ నామమాత్రపు మొత్తాన్ని పరిహారంగా ప్రకటించినట్లు కేసు డీల్ చేసిన ఒక లాయర్ వెల్లడించారు.
2016 అక్టోబర్ 2న పారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా హోటెల్ డి పోర్టాలెస్ లో బస చేసిన కిమ్ కర్దాషియన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దోపిడీ జరిగింది. పోలీసుల వేషధారణలో వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె సూట్‌లోకి బలవంతంగా ప్రవేశించి.. ఆమెను కట్టేసి దాదాపు 6 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాన్ని, ఇతర ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆ అనుభవం తన జీవితంలోనే అత్యంత భయానకమైనదని... దాని ప్రభావం తనపై ఎంతోకాలం ఉండిపోయిందని కిమ్ కర్దాషియన్ గతంలో చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని కోర్టు దోషులుగా తేల్చింది.
డబ్బు లేదా నష్టపరిహారం ముఖ్యం కాదని.. కేవలం బాధ్యతతో న్యాయం జరగాలనేదే తన ఉద్దేశమని కిమ్ కర్దాషియన్‌తో పాటు ఆ సమయంలో అక్కడే ఉన్న తన స్టైలిస్ట్ సైమన్ హరూచె సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో దోషులుగా తేలిన వారు అప్పట్లోనే విచారణ కాలంలో జైలు శిక్ష అనుభవించడం.. వారి వయసు (వీరిలో కొందరు 60, 70 ఏళ్ల వృద్ధులు కావడంతో వీరిని `గ్రాండ్ పా రాబర్స్` అని పిలుస్తారు) దృష్ట్యా ఎవరూ మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు. కాగా అదే హోటల్‌లో పనిచేస్తున్న రిసెప్షనిస్ట్ మాత్రం ఈ ఘటన వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని తెలుపుతూ 550,000 యూరోలు పరిహారంగా కోరగా.. కోర్టు అతడికి 109,516 యూరోలు.. హోటల్‌కు 50,000 యూరోల పరిహారాన్ని అందజేయాలని దోషుల్ని ఆదేశించింది.
అంతర్జాతీయ సెలబ్రిటీలు, నటీమణులు ఇలాంటి విలువైన ఆభరణాల చోరీలు లేదా భయానక దోపిడీల బారిన పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో పలువురు ప్రముఖ హాలీవుడ్, బాలీవుడ్ నటీమణులు కూడా తమ పర్యటనల్లో లేదా పెద్ద వేడుకల్లో విలువైన నెక్లెస్‌లు, వజ్రాలు పోగొట్టుకోవడం లేదా దొంగతనాలకు గురికావడం లాంటి సంఘటనలను ఎదుర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హై-ప్రొఫైల్ వ్యక్తుల వద్ద ఉండే ఖరీదైన ఆభరణాలు తరచూ ఇలాంటి అనూహ్య ఘటనలకు కేంద్ర బిందువుగా మారుతుంటాయి.
ఇదిలాఉంటే.. కిమ్ కర్దాషియన్ రిలయన్స్ అధినేత ముంబై వేడుకల సందర్భంగా కూడా ఒక విలువైన వజ్రాన్ని పోగొట్టుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. భారత్‌లో జరిగిన అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన కిమ్ కర్దాషియన్ ప్రముఖ డిజైనర్ లోరెయిన్ స్వార్ట్జ్ డిజైన్ చేసిన భారీ డైమండ్ నెక్లెస్‌ను ధరించారు. అయితే వేడుకలో అతిథులతో మాట్లాడుతున్న సమయంలో ఆ నెక్లెస్ నుండి ఒక పెద్ద విలువైన వజ్రం ఊడిపడిపోయి కనిపించకుండా పోయింది. ఆ వజ్రం ఎక్కడ పడిపోయిందో వెతికినప్పటికీ దొరకలేదని.. ఈ ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని కిమ్ ఆ తరువాత ఒక రియాలిటీ షోలో వెల్లడించారు.