ఐబొమ్మ రవి కేసు మలుపు.. కోర్టులో కీలక పిటిషన్!

విశాఖపట్నంకు చెందిన ఇమంది రవి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి, ఆ తర్వాత ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా సినిమాలను అక్రమంగా ప్రసారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

Update: 2026-09-17 02:25 GMT

తెలుగు సినీ రంగాన్ని ఊపేసిన ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇమంది రవి కేసు ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. విశాఖకు చెందిన ఈయన పైరసీ, బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లు సంపాదించాడనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన రవి, ప్రస్తుతం తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పేర్కొంటూ నాంపల్లి కోర్టులో ఒక కీలక పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

ఐబొమ్మ రవి నేపథ్యం – జైలు నుంచి బెయిల్ వరకు!:

విశాఖపట్నంకు చెందిన ఇమంది రవి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి, ఆ తర్వాత ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా సినిమాలను అక్రమంగా ప్రసారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఐబొమ్మకు వచ్చే భారీ ట్రాఫిక్‌ను బెట్టింగ్ యాప్‌ల వైపు మళ్లించి కోట్లు ఆర్జించాడనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దాదాపు మూడు నెలల పాటు జైలులో ఉన్న రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.

కోర్టును ఆశ్రయించిన రవి – 'నా దగ్గర పైసలు లేవు!':

దర్యాప్తులో భాగంగా పోలీసులు రవికి సంబంధించిన అన్ని బ్యాంకు ఖాతాలను, ఆస్తులను ఫ్రీజ్ చేశారు. దీంతో ప్రస్తుతం తన వద్ద ఒక్క రూపాయి కూడా అందుబాటులో లేదని రవి నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తెలిపాడట . బ్యాంక్ అకౌంట్లు పనిచేయకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం కూడా చాలా కష్టంగా మారిందని పిటిషన్‌లో పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

కుటుంబ ఖర్చుల కు వెసులుబాటు ఇవ్వాలని విన్నపం:

ఇంట్లో నిత్యావసరాలు కొనుక్కోవడానికి, రోజువారీ కుటుంబ ఖర్చులకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నట్లు రవి ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు అవసరమైన కనీస ఖర్చుల కోసమైనా కొన్ని ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేసి, కొంత మొత్తాన్ని వాడుకునే అవకాశం ఇవ్వాలని కోర్టును వేడుకున్నాడు.

నాంపల్లి కోర్టు విచారణ – పోలీసుల వాదన ఏంటి?:

రవి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ ప్రారంభించింది. అయితే దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున అకౌంట్లను ఫ్రీజ్‌లోనే ఉంచాలా? లేక మానవతా దృక్పథంతో రవి కుటుంబ ఖర్చులకు కొన్ని ఖాతాలపై సడలింపు ఇవ్వవచ్చా? అనే అంశంపై పోలీసులు తమ వాదనలను కోర్టుకు వినిపించనున్నారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పుపైనే రవి భవిష్యత్తు ఆధారపడి ఉంది.

ఒకప్పుడు ఆన్‌లైన్ పైరసీ ప్రపంచంలో కోట్లు సంపాదించాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఐబొమ్మ రవి, ఇప్పుడు కనీస కుటుంబ ఖర్చుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోలీసుల దర్యాప్తు పూర్తయ్యి ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటపడతాయో, కోర్టు రవి పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News