ఆడపులిగా మారాను.. జీవితాన్ని చూసే కోణమే మారిపోయింది!
స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మాతృత్వంతో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మాతృత్వంతో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లి కావడం అనేది తన జీవితాన్ని 360 డిగ్రీలు మార్చేసిందని.. ఇప్పుడు ప్రపంచాన్ని చూసే కోణమే పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. గత ఏడాది `గేమ్ ఛేంజర్` వంటి భారీ చిత్రంతో అలరించిన కియారా.. తొందర్లోనే టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియన్ సినిమాతో మరోసారి అభిమానుల ముందుకు వస్తున్నారు. ఇటీవల కియరాకు ఒక బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాధిస్తూనే తన వృత్తిపరమైన బాధ్యతలను సమన్వయం చేసుకుంటున్నారు.
బిడ్డ పుట్టిన తర్వాత తనలో రక్షణ భావం విపరీతంగా పెరిగిందని కియారా వెల్లడించారు. ఈ క్రమంలోనే తాను ఒక ఆడపులిలా మారిపోయానని ఆమె వ్యాఖ్యానించారు. తన బిడ్డ విషయంలో అత్యంత జాగ్రత్తగా.. బాధ్యతగా ఉంటున్నానని.. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రాధాన్యతలు కూడా మారిపోయాయని తెలిపారు. ఒక్కోసారి ప్రపంచంలో ఏదీ ముఖ్యం కాదనిపిస్తుందని.. మరికొన్ని సార్లు తన బిడ్డ కోసం ప్రతిదీ ముఖ్యమే అన్న భావన కలుగుతుందని తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
2025 జూలైలో కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ఆ చిన్నారికి `సరాయా` అని నామకరణం చేశారు. 2025 మెట్ గాలా వేడుకలో కియారా తన బేబీ బంప్‌తో కనిపించినప్పటి నుండి ఆమె అభిమానుల్లో ఒక రకమైన ఉత్సాహం నెలకొంది. ఇప్పుడు సారాయా రాకతో తమ ఇల్లు నందనవనంగా మారిందని.. తన ప్రపంచమంతా ఇప్పుడు ఆ చిన్నారి చుట్టూనే తిరుగుతోందని కియారా మురిపెంగా చెప్పుకొచ్చారు.
సిద్ధార్థ్‌తో తన అనుబంధం గురించి కూడా కియారా పలు విషయాలు పంచుకున్నారు. పెళ్లి తర్వాత తమకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని నిర్మించుకున్నామని.. బాధ్యతలు పెరిగినప్పటికీ తమ మధ్య ఉన్న సరదా ఏమాత్రం తగ్గలేదని అన్నారు. పెళ్లికి ముందు ఎలాగైతే ప్రయాణాలు చేస్తూ గడిపేవారో.. ఇప్పుడు కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. కేవలం నటీనటులుగానే కాకుండా.. సామాన్య ప్రేక్షకులుగా ఇద్దరూ కలిసి సినిమాలు చూస్తామని.. వాటిపై సుదీర్ఘంగా చర్చించుకుంటామని వెల్లడించారు.
ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కియారా త్వరలో `టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ హీరో యష్ నటించిన ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కియారా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. అటు మాతృత్వాన్ని.. ఇటు కెరీర్‌ను కియారా అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తల్లి అయిన తర్వాత చాలా మంది అగ్ర కథానాయికలు ఇలాంటి ఒక డైలమా స్టాటస్ ని కనుగొన్నారు. అయితే మరింత బాధ్యతగా ఉంటూనే సినీతారలుగా తమ కెరీర్ ని ముందుకు సాగించారు. కరీనా, నయనతార, ఐశ్వర్యారాయ్, ఆలియా వంటి తారల స్ఫూర్తితో కియరా ముందుకు సాగుతోంది.