కెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదేనేమో!
హాలీవుడ్ కమెడియన్ కం నటుడు కెవిన్ హార్ట్ జీవితంలో మర్చిపోవాలనుకున్న ఓ పాత సంఘటన మళ్లీ వార్తల్లోకి వచ్చింది.;
హాలీవుడ్ కమెడియన్ కం నటుడు కెవిన్ హార్ట్ జీవితంలో మర్చిపోవాలనుకున్న ఓ పాత సంఘటన మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇటీవల జరిగిన నెట్‌ఫ్లిక్స్ టామ్ బ్రాడీ రోస్ట్ షోలో ఫుట్‌బాల్ స్టార్ టామ్ బ్రాడీపై జోకులు వేస్తున్న క్రమంలో కెవిన్ హార్ట్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన 2017 వివాదాన్ని సహచర కళాకారులు ప్రస్తావించారు. దీంతో సోషల్ మీడియాలో పాత ఉదంతం మరోసారి చర్చనీ యాంశమైంది. సెలబ్రిటీల జీవితంలో గతం ఎప్పుడూ వారిని వెంటాడుతూనే ఉంటుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. 2017లో ఏం జరిగిందనే విషయంలోకి వెళ్తే..
కెవిన్ హార్ట్ తన భార్య ఎనికో పారిష్ ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న సమయంలో లాస్ వేగాస్‌లో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో హార్ట్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాడు. ఆ సమయంలో ఎవరో ? తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తన తప్పుకు క్షమాపణలు చెబుతున్నానని బహిరంగంగా ఓ వీడియో కూడా విడుదల చేశాడు. ఆ వివాదం అప్పట్లో హాలీవుడ్ మీడియాలో పెను సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు భార్య - పిల్లలకు తాను చేసిన అన్యాయానికి గానూ ఎంతో పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
`నేను నా జీవితంలో తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం ఇదే` అని తరువాతి కాలంలో తన డాక్యు మెంటరీలో కూడా అంగీకరించారు. అయితే ఆయన భార్య ఎనికో పారిష్ ఆ కష్టకాలంలో ఆయనను క్షమించి, తమ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. తాజాగా ఏడేళ్ల తర్వాత ఓ కామెడీ షోలో భాగంగా ఆ చేదు జ్ఞాపకాన్ని మళ్లీ తవ్వి తీయడం కెవిన్ హార్ట్ అభిమానులకు రుచించడం లేదు. కామెడీ పేరుతో ఒకరి వ్యక్తిగత బలహీనతలను, కుటుంబాన్ని బాధించే విషయాలను ప్రస్తావించడం ఎంత వరకు సమంజసం అనే చర్చ మొదలైంది.
అయితే రోస్ట్ షోల స్వభావమే అంత కాబట్టి హార్ట్ కూడా ఆ జోకులను నవ్వుతూనే స్వీకరించాల్సి వచ్చింది. కానీ ఇంటర్నెట్ యుగంలో పాత తప్పులు ఎప్పటికీ మరుగున పడవని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. కెవిన్ హార్ట్ ఈ వివాదం నుండి బయటపడి తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. తన తప్పులను పాఠాలుగా మార్చుకునీ కామెడీలో కూడా నిజాయితీని ప్రదర్శించడం ఆయన ప్రత్యేకత. అయినా ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై మళ్లీ ఆ సంఘటన ప్రస్తావనకు రావడం ఆయన వ్యక్తిగత ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ప్రేక్షకులు మర్చిపోయిన విషయాన్ని మళ్లీ తానే గుర్తు చేసి అక్షింతలు వేయించుకోవడం అసరమా? అంటూ నెటి జనలు కామెంట్లు పెడుతున్నారు.
సెలబ్రిటీలు చేసే చిన్న తప్పు కూడా దశాబ్దాల పాటు వారి వెంటే ఉంటుందనడానికి ఇదొక ఉదాహరణ. అలా కెవిన్ హార్ట్ 2017 వివాదం ఆయన జీవితంలో ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. కాలం గడిచినా? ఆయన సాధించిన విజయాలు ఎన్ని ఉన్నా? ఆ ఒక్క పొరపాటు మళ్లీ తెరపైకి వస్తూనే ఉంది. ఇది ఒక సెలబ్రిటీ వార్త మాత్రమే కాదు. బాధ్యతాయుతమైన జీవితం ప్రాముఖ్యతను గుర్తుచేసే ఓ పాఠం కూడా.