రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో ఎప్పుడూ బాధ ప‌డ‌లేదు

హీరోల‌కు ప‌దుల కోట్ల‌లో రెమ్యూన‌రేష‌న్లు ఇస్తే, హీరోయిన్ల‌కు మాత్రం ల‌క్షల్లోనో లేదంటే హీరో రెమ్యూన‌రేష‌న్ లో నాలుగో వంతు కూడా ఇవ్వ‌ర‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే.;

Update: 2025-11-25 13:30 GMT

ఇండ‌స్ట్రీలో హీరోల‌తో పోలిస్తే హీరోయిన్ల‌కు అన్నీ త‌క్కువే. హీరోల‌కు ఉండే సౌక‌ర్యాలు, వారి రెమ్యూన‌రేష‌న్లు, వారికిచ్చే వాల్యూ అన్నీ ఎక్కువే. కెరీర్ విష‌యంలో కానీ, రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో కానీ హీరోల‌కు ఉండే విలువ హీరోయిన్ల‌కు ఉండ‌దు. హీరోల‌కు ప‌దుల కోట్ల‌లో రెమ్యూన‌రేష‌న్లు ఇస్తే, హీరోయిన్ల‌కు మాత్రం ల‌క్షల్లోనో లేదంటే హీరో రెమ్యూన‌రేష‌న్ లో నాలుగో వంతు కూడా ఇవ్వ‌ర‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఈ రెమ్యూన‌రేష‌న్ల విష‌యంలో ఇప్ప‌టికే ఎంతోమంది హీరోయిన్లు త‌మ బాధ‌ను వెల్లిబుచ్చిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. సినిమాలో హీరోల‌తో పాటూ న‌టించిన‌ప్ప‌టికీ, వారితో క‌లిసి డ్యాన్సులేసిన‌ప్ప‌టికీ త‌మ‌ను వేరేలా చూస్తార‌ని చెప్పారు. ఈ విష‌యంలో కొంద‌రు హీరోల‌కు స‌పోర్ట్ గా మాట్లాడితే, మ‌రికొందరు మాత్రం మార్కెట్ వాల్యూని బ‌ట్టే ఏదైనా ఉంటుంద‌ని త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తూ వ‌స్తున్నారు.

డిమాండ్ ను బ‌ట్టే రెమ్యూన‌రేష‌న్

గ‌తంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూడా ఈ విష‌యంలో నోరు విప్పి మాట్లాడారు. ఇండ‌స్ట్రీలో ఆర్టిస్టు మేల్, ఫీమేల్ అని చూడ‌ర‌ని, వారి వారి డిమాండ్, మార్కెట్, క్రేజ్ ను బ‌ట్టి నిర్మాత‌లు వారికి రెమ్యూన‌రేష‌న్ ను ఇస్తార‌ని, ఒక‌వేళ హీరోయిన్ కు ఎక్కువ డిమాండ్ ఉండే దానికి త‌గ్గ పారితోషిక‌మే ఇస్తార‌ని, హీరోకు త‌క్కువ క్రేజ్ ఉంటే హీరోయిన్ల కంటే త‌క్కువ రెమ్యూన‌రేష‌న్ ఇస్తార‌ని చెప్పారు.

కాగా ఇప్పుడు ఇదే విష‌య‌మై సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కీర్తి సురేష్ మాట్లాడారు. రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో హీరోయిన్లకు త‌క్కువ ఇస్తున్నార‌నే విష‌యం గురించి మాట్లాడుతూ, ఎవ‌రి జీత‌మైనా వారి ప‌ని, మార్కెట్, క్రేజ్ ను బ‌ట్టే ఉంటుంద‌ని, హీరోల‌తో కంపేర్ చేస్తే త‌న‌కు త‌క్కువ పారితోషిక‌మిస్తార‌నే బాధ త‌న‌కెప్పుడూ లేద‌ని, ఏదైనా డిమాండ్ ను బ‌ట్టే ఉంటుంద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

Tags:    

Similar News