కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..
| 'మహానటి'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌కు హిందీలో మాత్రం సరైన విజయం దక్కడం లేదు. వరుణ్ ధావన్‌తో చేసిన 'బేబీ జాన్' నిరాశపరచగా, తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'అక్క'కు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం రాజ్‌కుమార్ రావుతో చేసిన 'రఫ్తార్' విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
కీర్తి సురేష్‌కు తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు ఉంది. 'మహానటి'తో జాతీయ అవార్డు అందుకున్న ఆమె, హిందీలోనూ సత్తా చాటాలని చూస్తోంది. కానీ అక్కడ మాత్రం పరిస్థితులు అనుకున్నట్లు కలిసి రావడం లేదు. వరుణ్ ధావన్‌తో చేసిన 'బేబీ జాన్' నిరాశపరచగా, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'అక్క' కూడా మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో బాలీవుడ్‌లో కీర్తికి సరైన బ్రేక్ ఇంకా దక్కలేదనే చెప్పాలి.
2024లో విడుదలైన 'బేబీ జాన్'తో కీర్తి హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టారు. తమిళంలో విజయ్ నటించిన 'తెరి'కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం అందుకుంది. వరుణ్ ధావన్ లాంటి హీరో పక్కన నటించినా ఆ విజయం కీర్తికి ఉపయోగపడలేదు. దీంతో హిందీలో తొలి సినిమాతోనే మంచి మార్కెట్ సంపాదించుకోవాలనే అవకాశం చేజారింది.
నిజానికి 'అక్క'నే తన మొదటి హిందీ ప్రాజెక్ట్‌గా విడుదల చేయాలని కీర్తి భావించారట. ఈ సిరీస్ కథ నచ్చడంతో ఇతర ప్రాజెక్టులకంటే ముందే ఒప్పుకున్నారు. కానీ నిర్మాణం, విడుదల ఆలస్యం కావడంతో 'బేబీ జాన్' ముందుగా ప్రేక్షకుల దగ్గరకు వచ్చింది. లేటెస్ట్ గా ఈ విషయాన్ని ప్రమోషన్లలో కీర్తి స్వయంగా వెల్లడించారు.
ఇక 'అక్క'లో మాత్రం పూర్తిగా భిన్నమైన పాత్ర. ఎనభై దశకంలో మహిళల ఆధిపత్యంలో నడిచే ప్రాంతానికి నాయకురాలైన భవానిగా కనిపించారు. రాధికా ఆప్టేతో పోటీపడే పాత్రలో కీర్తి నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌ను మెచ్చుకున్నారు. కానీ సిరీస్ కథనం విషయంలో రివ్యూలు భిన్నంగా ఉండటంతో ఆశించిన స్థాయిలో కంప్లీట్ పాజిటివ్ టాక్ రాలేదు.
అయితే హిందీలో కీర్తి ఎంచుకుంటున్న కథలను చూస్తే ఒక విషయం అర్థమవుతోంది. 'బేబీ జాన్'లో కమర్షియల్ హీరోయిన్‌గా కనిపిస్తే, 'అక్క'లో కథను నడిపించే పాత్ర చేసింది. రెండు వేర్వేరు ప్రయత్నాలు చేసినా ఆమెకు తెలుగులో 'మహానటి', 'దసరా' వంటి సినిమాలతో వచ్చిన స్థాయి గుర్తింపు హిందీలో ఇంకా దక్కలేదు.
మరోవైపు కీర్తి ఇప్పటికే రాజ్‌కుమార్ రావుతో 'రఫ్తార్' అనే హిందీ సినిమా కూడా చేసింది. ఆ ప్రాజెక్ట్ విడుదల కావాల్సి ఉంది. హిందీలో ఎక్కువ సినిమాలు చేయాలనే తొందర తనకు లేదని, నచ్చిన కథలనే ఎంచుకుంటానని ఇటీవల చెప్పింది. ఇక అమ్మడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.