పాన్ ఇండియా మూవీ రిలీజ్‌కి ఈ అమ్మ‌డే కారణం!

ధ్రువ సర్జా కథానాయకుడిగా న‌టించిన `కేడీ: ది డెవిల్` చిత్రం మొదటి నుంచీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.;

Update: 2026-04-25 11:30 GMT

ధ్రువ సర్జా కథానాయకుడిగా న‌టించిన `కేడీ: ది డెవిల్` చిత్రం మొదటి నుంచీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్ నుండి తొలగించడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. సెన్సార్ ప్రక్రియ పూర్తికాకముందే కొన్ని స‌ర్టిఫై చేయ‌ని దృశ్యాలు పొరపాటున ట్రైలర్‌లో చేరడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. నిబంధనలకు కట్టుబడి త్వరలోనే సవరించిన వెర్షన్‌ను మళ్ళీ విడుదల చేస్తామని... ఈ పొరపాటుకు చింతిస్తున్నామని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

కేవలం ట్రైలర్ మాత్రమే కాకుండా.. ఈ చిత్రంలోని ``సర్కే చునార్ తేరి సర్కే`` అనే పాట కూడా తీవ్ర విమర్శల పాలవుతోంది. ఈ పాటలోని సాహిత్యం, దృశ్యాలు అశ్లీలంగా ఉన్నాయని మైనర్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆరోపిస్తూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసిడ‌బ్ల్యూఏ) తో పాటు కంగనా రనౌత్ వంటి ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి.. చివరకు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్‌.సి.డబ్ల్యూ) జోక్యానికి దారితీసింది. ఇప్పటికే ఈ పాటపై ఢిల్లీ సైబర్ సెల్‌లో ఫిర్యాదు నమోదు కాగా.. సెన్సార్ బోర్డు దీనిపై నిషేధం విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఈ గందరగోళంపై దర్శకుడు ప్రేమ్ స్పందిస్తూ.. వివాదాల కోసం తాను పాటను సృష్టించలేదని.. ఇది కేవలం ఒక పార్టీ సాంగ్ మాత్రమేనని వివరించారు. కన్నడలో రాసిన సాహిత్యం అక్కడ అందరినీ అలరించిందని.. అయితే హిందీ అనువాదంలో వచ్చిన అర్థాలను తాను ఊహించలేదని అత‌డు పేర్కొన్నారు. హిందీ అనువాదకుడు రకీబ్ ఆలం సైతం తాను కేవలం మాతృకను యథాతథంగా అనువదించానని.. ఎవరి మనోభావాలనైనా గాయపరిచి ఉంటే క్షమించాలని కోరారు. భాష కార‌ణంగా తలెత్తిన కొన్ని పొరపాట్ల వల్ల ఒక పెద్ద సినిమా చిన్న విషయానికి వివాదంలో చిక్కుకోవడం దురదృష్టకరమని చిత్ర బృందం భావిస్తోంది.

నోరా వివ‌ర‌ణ నిరుప‌యోగం:

నిజానికి కేడీ ది డెవిల్ వివాదానికి నోరా ఫ‌తేహి కూడా ఒక కార‌ణం. నేటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ లేదా స్పెషల్ డ్యాన్స్ నంబర్స్ అనేవి కేవలం గ్లామర్ కోసమే కాకుండా సినిమా మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా మారిపోయాయి. ముఖ్యంగా నోరా ఫతేహి వంటి పాపులర్ డ్యాన్స‌ర్ ఉంటే ఆ క్రేజ్ మరింత పెరుగుతుంది. అయితే `కేడీ ది డెవిల్` లోని పాట‌, నోరా నృత్యంపై చెల‌రేగిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో దానికి వివ‌రణ ఇవ్వ‌బోయి నోరా మ‌రోసారి త‌ప్పు చేసింది. గతంలో తాను నటించిన `సత్యమేవ జయతే' చిత్రంలోని `దిల్‌బర్` సాంగ్ షూటింగ్ సమయంలో ఎదురైన ఒక సంఘటనను నోరా గుర్తు చేసుకున్నారు. ఆ పాట కోసం చిత్ర యూనిట్ తనకు చాలా చిట్టి పొట్టి దుస్తుల‌ను ధరించమని కోరారని... కానీ తాను దానికి నిరాకరించానని వెల్లడించారు. గ్లామర్ ప్రదర్శించడానికి అసభ్యతకు మధ్య చాలా సన్నని గీత ఉంటుందని... తాను ఆ గీత దాటడానికి ఇష్టపడలేదని స్పష్టం చేశారు.

నోరా అభ్య‌ర్థ‌న మేర‌కు డ్రెస్ ని మార్చేసారు. కేవలం క్లీవేజ్ షోపైనే దృష్టి పెట్టే దుస్తులు ధరిస్తే అది పాటను చౌకబారుగా మార్చడమే కాకుండా ప్రేక్షకుల దృష్టిని కేవలం శరీరంపైకి మాత్రమే మళ్లిస్తుందని నోరా అభిప్రాయ‌ప‌డ‌గా త‌న డ్యాషింగ్ డెసిష‌న్ పై ప్ర‌శంస‌లు కురిసాయి. అయితే ఇదంతా కేడీ ది డెవిల్ పాట‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల నుంచి త‌న‌ను తాను కాపాడుకునేందుకేన‌ని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. పాత విష‌యాల‌ను చెప్పి డైవ‌ర్ట్ చేస్తోంద‌ని కూడా కామెంట్ చేస్తున్నారు.

నోరా వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో గ్లామర్ ప్రదర్శన తీరుపై ఒక కొత్త చర్చకు తెర తీసాయి. కేవలం బాక్సాఫీస్ విజయాల కోసం.. అటెన్షన్ కోసమే మేకర్స్ అసభ్యతను ఆశ్రయిస్తున్నారా? అనే ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది. శ‌రీర ప్ర‌ద‌ర్శ‌న కంటే నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌, న‌ట‌న ప‌రంగా ప్ర‌తిభ‌తో అంద‌రి మెప్పు పొందాల‌నే నోరా అభిప్రాయంపై కొంద‌రు సెటైర్లు వేస్తున్నారు. ఒక పాన్ ఇండియా సినిమా రిలీజ్ కి నోరా గండి కొట్టింద‌ని కూడా కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News