షాప్‌లో టీలు అందించాను.. కయాదు లోహర్ కఠినమైన జర్నీ!
అసోం మూలాలున్నా కానీ పుణెలోనే పుట్టి పెరిగిన కయాదు లోహర్ తన కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ తాను ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినట్లు తెలిపారు.
వినోద ప్రపంచంలో తళుకుబెళుకుల వెనక ఎవరికీ తెలియని ఎన్నో కన్నీటి కథలు.. భయానక పోరాటాలు దాగి ఉంటాయి. తెరపై అందంగా కనిపించే తారల జీవితాలు ఆరంభం నుంచే సులభంగా సాగిపోవని చెప్పడానికి యువ నటి కయాదు లోహర్ ప్రయాణమే ఒక చక్కటి ఉదాహరణ. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామ, వెండితెరకు రాకముందు తాను పడిన కష్టాలను.. దినదిన గండంలా గడిచిన తన గతాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంటూ తీవ్రంగా భావోద్వేగానికి గురయ్యారు.
అసోం మూలాలున్నా కానీ పుణెలోనే పుట్టి పెరిగిన కయాదు లోహర్ తన కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ తాను ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్న వయసులోనే కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇందులో భాగంగానే పదో తరగతి చదివే వయసులోనే ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. ఒకానొక దశలో కాఫీ షాప్‌లో టీలు అందించే పని చేయడంతో పాటు.. బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా కూడా పని చేసినట్లు నిర్మొహమాటంగా తెలిపారు. ఆ చిన్న ఉద్యోగాలతోనే తన కెరీర్ ప్రయాణం ప్రారంభమైందని.. ఆ కష్టకాలమే తనకు జీవితం ఎంతో నేర్పించిందని తెలిపారు.
జీవితంలో తన కాళ్లపై తాను నిలబడేందుకు కేవలం చిన్నచిన్న పనులే కాకుండా..ఆ తర్వాత ఒక దశలో ఐటీ (సాఫ్ట్‌వేర్) ఉద్యోగంలో కూడా చేరారు. అయితే అక్కడ కార్పొరేట్ ప్రపంచానికి తగినట్లుగా ఉండలేకపోయానని.. తీవ్రమైన పని ఒత్తిడిని భరించలేక ఒకరోజు ఆఫీసులోనే కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్లు కయాదు లోహర్ గుర్తుచేసుకున్నారు. చిన్నప్పటి నుంచి చదువు కంటే నాటకాలు, స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లు, డ్యాన్స్ అంటేనే తనకు ఎంతో ప్రాణం ఉండేదని.. ఆ ఆసక్తే తనను చివరకు కళారంగం వైపు నడిపించిందని ఆమె వెల్లడించారు.
ఇలా మోడలింగ్ రంగం ద్వారా ఒక్కో మెట్టూ ఎక్కుతూ సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన కయాదు లోహర్ ప్రస్తుతం అగ్ర నాయికల సరసన నిలిచే స్థాయికి చేరుకున్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ `ది ప్యారడైజ్`లో కథానాయికగా నటించారు. మాస్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు చేయని పూర్తి భిన్నమైన, అత్యంత ప్రాధాన్యత ఉన్న శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో కయాదు రేంజ్ దేశవ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉంది.
సాధారణ బట్టల షాప్‌లో సేల్స్ గర్ల్ స్థాయి నుంచి మొదలై.. నేడు పాన్ ఇండియా స్టార్ సరసన హీరోయిన్‌గా ఎదిగే వరకు కయాదు లోహర్ సాగించిన ఈ ప్రయాణం ఎందరికో నిజంగా స్ఫూర్తిదాయకం. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా.. అడుగుపెట్టిన ప్రతిచోటా సవాళ్లను ఎదుర్కొంటూ పట్టుదలతో ముందుకు వెళితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని ఈ నటి నిరూపించారు. కేవలం గ్లామర్‌తోనే కాకుండా తన కష్టపడే తత్వంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ యంగ్ బ్యూటీ భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని అభిమానులు కోరుకుంటున్నారు.