ఇంట గెలిచి రచ్చ గెలవాలి: సుహాస్‌పై కాసర్ల శ్యామ్ కామెంట్స్!

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ నెగెటివ్ రోల్‌తో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న లేటెస్ట్ సీ యాక్షన్ డ్రామా మండాడి. తమిళంలో విలక్షణ నటుడు సూరి లీడ్ రోల్ లో నటించారు.

Update: 2026-09-06 03:58 GMT

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ నెగెటివ్ రోల్‌తో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న లేటెస్ట్ సీ యాక్షన్ డ్రామా మండాడి. తమిళంలో విలక్షణ నటుడు సూరి లీడ్ రోల్ లో నటించారు. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా తెలుగులో సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ వేడుకలో స్టార్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో తెలుగు వెర్షన్ కోసం రెండు అద్భుతమైన పాటలు రాసే అవకాశం తనకు దక్కిందని కాసర్ల శ్యామ్ తెలిపారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన అమ్మ తల్లి పాటతో పాటు తెలుసా నీకే పిల్ల అనే ఎమోషనల్ మెలోడీ సాంగ్‌ను తానే రాసినట్లు చెప్పారు.

తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఎక్కడా అనువాదంలా అనిపించకుండా, అచ్చమైన తెలుగు పదాలు, గ్రామీణ భావాలు ఉట్టిపడేలా సాహిత్యానికి స్కోప్ దక్కిందన్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన ట్యూన్స్ అద్భుతంగా కుదిరాయని, అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు ధన్యవాదాలు తెలిపారు.

తన లిరిక్స్ ప్రత్యేకతను వివరిస్తూ వేదికపైనే శ్యామ్ కొన్ని పంక్తులను పాడి వినిపించారు. 'తెలుసా నీకే పిల్ల.. నిన్నే దాచా కన్నుల్లల్లా.. చూస్తే కనవా పిల్ల గూడు కట్టా గుండెల్లల్లా' అంటూ సాగే రొమాంటిక్ ట్రాక్‌తో పాటు 'ఆ గట్టుపై పచ్చగడ్డిలా నీ ఛాతిపై వాలనా.. గింజకే పొట్టులా నిన్ను చుట్టుకోనా' లాంటి స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమని ప్రతిబింబించే లైన్స్ ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఈ పాటను కచ్చితంగా రిపీట్ మోడ్‌లో వింటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ వేదికగా సుహాస్ గురించి మాట్లాడుతూ కాసర్ల శ్యామ్ ఎమోషనల్ అయ్యారు. సుహాస్ వాయిస్‌కు, ఆయన డెడికేషన్ యాక్టింగ్‌కు తాను చాలా పెద్ద ఫ్యాన్‌ని అని చెప్పారు. టాలీవుడ్‌లో వరుస విజయాలతో ఇంట గెలిచిన సుహాస్, ఇప్పుడు తమిళంలోకి వెళ్లి రచ్చ గెలవబోతున్నారని కొనియాడారు. ఈ సరికొత్త పాత్రతో సుహాస్ కచ్చితంగా తమిళంలో కూడా పెద్ద విజయం సాధిస్తారని, ప్రేక్షకులు ఆయనను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.

హీరో సూరిని తెలుగు ఇండస్ట్రీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఒక చిన్న హాస్య నటుడిగా కెరీర్ ప్రారంభించి, తన కష్టంతో, అంకితభావంతో ఈ రోజు ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన సూరి ప్రయాణాన్ని తామంతా గమనిస్తూనే ఉన్నామన్నారు. సూరి హోటల్స్ వ్యాపారం గురించి, ఆయనలోని మంచి మనస్తత్వం గురించి అందరికీ తెలుసని గుర్తు చేశారు.

తెలుగు ప్రేక్షకులు చాలా విశాల హృదయం ఉన్నవాళ్లని, మంచి కంటెంట్‌తో వస్తే నటీనటులను గుండెల్లో పెట్టుకుంటారని, సూరికి కూడా ఇక్కడ బ్రహ్మాండమైన విజయం ఖాయమని భరోసా ఇచ్చారు. చివరగా ఈ ఈవెంట్‌కు విచ్చేసి ఆశీర్వదించిన సినీ దర్శకులు, నిర్మాతలు నవీన్, రవిలతో పాటు తెలుగు ప్రేక్షకులకు కాసర్ల శ్యామ్ కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రానున్న మండాడి చిత్రం రెండు భాషల్లోనూ ఘన విజయం సాధించి టీమ్ మొత్తానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.



Tags:    

Similar News