ప్రయోగం చేసే దర్శకులకు ఈ సపోర్టే కావాలి

సినిమాల్లో ఇంతవరకు ఎవ్వరూ చేయని ప్రయోగం చేయాలంటే.. తెర మీద ఇంతకుముందెవ్వరూ చూడనిది చూపించాలంటే చాలా గట్స్ ఉండాలి.

Update: 2026-09-30 02:30 GMT

సినిమాల్లో ఇంతవరకు ఎవ్వరూ చేయని ప్రయోగం చేయాలంటే.. తెర మీద ఇంతకుముందెవ్వరూ చూడనిది చూపించాలంటే చాలా గట్స్ ఉండాలి. ఐతే ఆ గట్స్ కేవలం దర్శకులకు ఉంటే సరిపోదు.. వాళ్ల విజన్‌ను ముందు నిర్మాత నమ్మాలి. తర్వాత ఆర్టిస్టులూ అంగీకరించాలి. ఐతే వీళ్లందరిలో కన్విక్షన్ ఉంటే సరిపోదు. ప్రేక్షకులూ దీన్ని ఆమోదించాలి. ఈ క్రమంలో అవసరమైతే సెలబ్రెటీలు కూడా సాయం పట్టాలి.

ఇప్పుడు తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ తీసిన ‘డొరోతీ’ సినిమాకు ఇలాంటి మద్దతే లభిస్తోంది. తన తొలి చిత్రం ‘పిజ్జా’తోనే తాను మామూలు దర్శకుడిని కాదని రుజువు చేశాడు కార్తీక్. ఇక రెండో సినిమా ‘జిగర్ తండా’ అయితే మాస్టర్ పీస్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తమిళేతర భాషల వాళ్లు కూడా ఆ సినిమా గురించి తెలుసుకుని చూశారు. అదొక కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. కార్తీక్ నుంచి తర్వాత ఆ స్థాయి సినిమాలు రాకపోయినా.. ఇరైవి, మహాన్ మంచి పేరే తెచ్చుకున్నాయి. ఇప్పుడు కార్తీక్ ‘డొరోతీ’ తీశాడు.

ఇందులో ఒక హీరో స్వలింగ సంపర్కుడు. అతను తన ఫ్రెండునే ప్రేమిస్తాడు. ఆ ఫ్రెండు ముందు అపార్థం చేసుకున్నప్పటికీ.. చివరికి తన మనసు అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటాడు. స్వలింగ సంపర్కులను తేడాగా చూడొద్దని, వాళ్లు కూడా మనుషులే అని చాటే ప్రయత్నం చేశాడు కార్తీక్. ఈ క్రమంలో కొన్నిసెన్సేషనల్ డైలాగులు రాశాడు. షాకింగ్ సీన్లు తీశాడు. వాటి మీద మొదట్లో తీవ్ర దుమారం రేగింది. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్రోల్స్ పడ్డాయి. ఐతే కార్తీక్ అండ్ టీం తొణకలేదు. రాక్ సాలిడ్‌గా నిలబడింది. అదే సమయంలో మణిరత్నం ‘డొరోతీ’ని స్పెషల్ ఫిలింగా, కార్తీక్‌ను స్పెషల్ టాలెంట్‌గా కొనియాడాడు. ధనుష్ సైతం ‘డొరోతీ’ని మాస్టర్ పీస్ అంటూ పొగిడాడు. ఇంకా కొందరు సెలబ్రెటీలు ఈ సినిమాను మెచ్చుకున్నారు.

తమిళ ప్రేక్షకులు కూడా నెగెటివిటీని పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తున్నారు. తొలి రోజు తక్కువ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా.. తర్వాత పుంజుకుంది. ఇప్పుడు వసూళ్లు స్టడీగా ఉన్నాయి. మొత్తానికి సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడి సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది. సినిమాలో కంటెంట్ మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ కార్తీక్ ఒక పెద్ద ప్రయోగం చేశాడు. నిర్మాత రిస్క్ చేశాడు. ఇలాంటి సినిమాకు సెలబ్రెటీలతో పాటు ప్రేక్షకుల ప్రోత్సాహమూ దక్కడం మంచి విషయం.

Tags:    

Similar News