17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకటైన క్రేజీ కాంబినేషన్
బాలీవుడ్ ప్రతిభావంతురాలు విద్యా బాలన్- ప్రముఖ దర్శకుడు ఆర్. బాల్కి సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు.
బాలీవుడ్ ప్రతిభావంతురాలు విద్యా బాలన్- ప్రముఖ దర్శకుడు ఆర్. బాల్కి సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. దాదాపు 17 ఏళ్ల క్రితం `పా` వంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన ఈ కాంబినేషన్ ఓ తమిళ చిత్రం కోసం ఒకటయ్యారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన షూటింగ్ సెట్స్ నుంచి మొదటి గ్లింప్స్‌ను విద్యా బాలన్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
2009లో విడుదలైన `పా` చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలో విలక్షణమైన ప్రయోగంగా నిలిచిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ అరుదైన పాత్రలో నటించిన ఆ చిత్రంలో విద్యా బాలన్ ప్రతిభతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆర్. బాల్కి దర్శకత్వంలో విద్య నటించడం అదీ నేరుగా తమిళ చిత్ర పరిశ్రమలో కావడం గమనార్హం.
తమిళ కుటుంబ మూలాలు ఉన్న విద్యా బాలన్ కోలీవుడ్‌లో నేరుగా బలమైన ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్న తరుణంలో ఆర్. బాల్కి చెప్పిన కథాంశం ఆమెను అమితంగా ఆకట్టుకుంది. స్వతహాగా తమిళ భాషపై పూర్తి పట్టు ఉన్న విద్యా బాలన్ ఈ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులను నేరుగా అలరించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా సెట్స్ నుంచి షేర్ చేసిన ఫోటోకు `న్యూ బిగినింగ్స్`అని విద్యా బాలన్ క్యాప్షన్ ఇచ్చారు. దర్శకుడు ఆర్. బాల్కితో కలసి సెట్స్‌లో క్లాప్‌బోర్డ్‌తో నవ్వుతూ కనిపిస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కాంబినేషన్ మళ్లీ తెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
`చీని కమ్`, `పా`, `ప్యాడ్‌మ్యాన్`, `చుప్` వంటి విలక్షణమైన కాన్సెప్ట్ ఆధారిత చిత్రాలను తెరకెక్కించడంలో ఆర్. బాల్కి శైలి ప్రత్యేకమైనది. మూస ధోరణికి భిన్నంగా వినూత్నమైన మానవ సంబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో కథలను మలిచే బాల్కీ తమిళంలో తొలిసారి అడుగు పెడుతున్నారు. విద్యా బాలన్ వంటి నటి తోడవడంతో చిత్రంపై దక్షిణాదిలో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రంలో నటిస్తున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. ఏది ఏమైనా 17 ఏళ్ల తర్వాత రియూనియన్ అయిన బాల్కి-విద్యా బాలన్ కాంబినేషన్ సరికొత్త తమిళ ప్రాజెక్ట్‌తో మరో క్లాసిక్‌ను అందిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.