సంజయ్ కపూర్ 30,000 కోట్ల ఆస్తి వివాదంలో బిగ్ ట్విస్ట్
నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ ఆస్తుల వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది.;
నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ ఆస్తుల వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు కరిష్మా కపూర్‌కు నోటీసులు జారీ చేస్తూ, తన స్పందనను తెలియజేయాలని కోరింది. దాదాపు 30,000 కోట్ల ఆస్తులకు సంబంధించిన వివాదంలో ఇది మరో కొత్త మలుపు. సంజయ్ కపూర్ కి ముగ్గురు భార్యలు (ఇద్దరు మాజీలు) ఉండగా వారి మధ్య వారసత్వ పోరు సంచలనంగా మారింది. ముఖ్యంగా కరిష్మా కపూర్ వర్సెస్ ప్రియా కపూర్ మధ్య పోరు హాట్ టాపిగ్గా మారుతోంది.
ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సంజయ్ కపూర్ మూడవ భార్య ప్రియా సచ్ దేవ్ కపూర్, సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. 2016లో కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్ మధ్య జరిగిన విడాకుల రికార్డులను తనకు అందజేయాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. ముఖ్యంగా విడాకుల సమయంలో కుదిరిన ఆర్థిక ఒప్పందాలు, పిల్లల సంరక్షణకు సంబంధించిన వివరాలు తనకు కావాలని ప్రియా సచ్ దేవ్ కోరారు.
సంజయ్ కపూర్ 12 జూన్ 2025న ఇంగ్లాండ్‌లో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత అతడి ఆస్తుల కోసం కుస్తీపట్లు మొదలయ్యాయి. సంజయ్ కపూర్ విల్లు రాసినట్లుగా ప్రియా కపూర్ వాదిస్తోంది. వీలునామా ప్రకారం.. ఆయన తన వ్యక్తిగత ఆస్తులన్నింటినీ భార్య ప్రియా కపూర్‌కే చెందాలని రాసారని కోర్టులో వాదన వినిపిస్తున్నారు. అయితే కరిష్మా కపూర్ పిల్లలు (సమైరా, కియాన్) ఈ వీలునామాను సవాల్ చేశారు. అది ఫోర్జరీ చేసిన వీలునామా అని, తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా కావాలని వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ప్రస్తుతం ప్రియాకపూర్ రివర్స్ పిటిషన్ చర్చగా మారింది. ప్రియా కపూర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఏఎస్ చంద్రూర్కర్ ధర్మాసనం, కరిష్మా కపూర్‌కు నోటీసులు జారీ చేసింది. కరిష్మా తరపు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. విడాకుల వివరాలు వ్యక్తిగతమైనవని, ప్రియా కపూర్ కేవలం వేధించడానికే ఈ పత్రాలు అడుగుతున్నారని వాదించారు.
ఈ అంశంపై తన అభ్యంతరాలను తెలియజేయడానికి సుప్రీంకోర్టు కరిష్మా కపూర్‌కు రెండు వారాల సమయం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఆస్తి వివాదం ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు రెండింటిలోనూ నడుస్తోంది. దేశవిదేశాల్లోని దాదాపు 30వేల కోట్ల ఆస్తులకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ కేసులో ఠఫ్ ఫైట్ నడుస్తోంది. సోనాకామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సంజయ్ కపూర్ అధినేత. ఈ కంపెనీలు అన్ని వ్యవహారాలను అతడు మరణించేప్పటికి భార్యగా ఉన్న ప్రియా కపూర్ నియంత్రిస్తున్నారు.