బాలీవుడ్ లో ఫుల్ లెంగ్త్ రోల్ చేయాలనుంది
అదే ఇంటర్వ్యూలో జాకీ చాన్ మాట్లాడుతూ బాలీవుడ్ పై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.;
చైనీస్ సూపర్‌హిట్ ఫ్రాంచైజ్ సినిమా కరాటే కిడ్ నుంచి ఆరో భాగం కరాటే కిడ్ లెజెండ్స్ రిలీజ్ కు రెడీ అయింది. జొనథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జాకీ చాన్, బెన్ వాంగ్, రాల్ఫ్ మాకియో, జోషువా జాక్సన్, సేడీ స్టాన్లీ లాంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 30న ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాకు బాలీవుడ్ లో స్టార్ హీరో అజయ్ దేవగణ్, అతని కొడుకు యుగ్ దేవగణ్ డబ్బింగ్ చెప్పారు.
కరాటే కిడ్ లెజెండ్స్ సినిమాతోనే అజయ్ దేవగణ్ కొడుకు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాకీ చాన్, బెన్ వాంగ్‌తో కలిసి అజయ్, యుగ్ ఆన్ లైన్ లో మాట్లాడి ఓ స్పెషల్ చిట్ చాట్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అజయ్ దేవగణ్ తన తండ్రి గురించి, జాకీ చాన్ గురువు మిస్టర్ మియాగీ గురించి మాట్లాడాడు.
ఇప్పుడు యాక్షన్ సీన్స్ చాలా సులభంగా మారాయని, గతంలో లాగా కష్టం కాదని చెప్పాడు. కేబుల్స్ వాడి గ్రాఫిక్స్ లేకుండా చేసే రోజుల్లో యాక్షన్ సీన్స్ చేయడం ఎంతో కష్టంగా ఉండేదని, ఇప్పుడు టెక్నాలజీ వల్ల పని చాలా తేలికైందని, కానీ ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ కు మాత్రం ఎప్పుడూ ప్రత్యామ్నాయం ఉండదని ఆయన చెప్పాడు. ఈ సందర్భంగా యుగ్ దేవగణ్ మాట్లాడుతూ తన తండ్రి లేనిదే తాను లేనని చెప్పాడు.
అదే ఇంటర్వ్యూలో జాకీ చాన్ మాట్లాడుతూ బాలీవుడ్ పై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ డ్యాన్సులు చూసినప్పుడల్లా తాను ఆశ్చర్యపోతానని, అంతటి గ్రేస్, టైమింగ్ తానెక్కడా చూడలేదన్నారు. ఓసారి తనకు ఫుల్ డ్యాన్స్ సీక్వెన్స్ చేయాలనిపించిందని, తాను డ్యాన్స్ ను యాక్షన్ గా చూస్తానని ఆయన అన్నారు. ఇదే సందర్భంగా తనకు బాలీవుడ్ లో ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేయాలని ఉన్నట్టు కూడా ఆయన చెప్పారు. దీంతో జాకీచాన్ బాలీవుడ్ సినిమా చేస్తారనే వార్త నెట్టింట వైరలవుతోంది.